Novella

 ఒక యాభై ఎనిమిది సంవత్సరాలు అలా దొర్లిపోయాయి...!


వెనక్కి తిరిగి ఓ మారు చూసుకుంటే , ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు లా అనిపిస్తోంది.


అవన్నీ ఎవరో చాలా జాగ్రత్త గా పేర్చినట్లు గా,ఒకదానికి మరోదానికి ఏదో సంబంధం ఉన్నట్లుగా...!


కల నెరవేరకపోవడం కూడా కొన్నిసార్లు వరం లాంటిదే..!

అంతకంటే గొప్ప సంఘటనలు నీ జీవితం లోకి ఊహించని రీతి లో ప్రవేశించినపుడు కల నెరవేరకపోవడం  కూడా కొన్నిసార్లు వరం లాంటిదే.

రమారమి ముప్ఫై ఏళ్ళ క్రితం మాట,చాలామంది లాగే నాకూ అప్పుడు ఓ కల ఉండేది.ముందు దాని గురించి చెబుతాను. ఆ తర్వాత మిగతా విషయాలు. లైబ్రరీ కి వెళ్ళినప్పుడల్లా ఎంప్లాయ్మెంట్ న్యూస్ ,కాంప్టేటివ్ సక్సెస్ రివ్యూ ఇంకా ఇలాంటి పత్రికలు చదువుతుండేవాణ్ణి.విజయం సాధించిన సివిల్ సర్విస్ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూలు చదివినప్పుడు , ఎందుకో గాని అది నేను కూడా సాధించగలను అనిపించేది.మరి అది నా అజ్ఞానమా లేదా ఇంకొకటా..?! చెప్పలేను.

  అప్పటికి గ్రాడ్యుయేట్ ని. ఎందుకైనా మంచిదని బి.యిడి కూడా చేశాను. నిజానికి మద్రాస్ యూనివర్శిటి లో ప్రవేశించి ఎమ్మే ఆంగ్ల సాహిత్యం చేయాలనేది నా కోరిక. కాని ఇంట్లో ఆర్దికపరిస్థితులు అంతంత మాత్రం. అలా అని మరీ ఎవరినీ యాచించే స్థితీ కాదు. అదే మధ్య తరగతి మందహాసం అంటే. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగం సంపాదించుకుంటే తప్పా లాభం లేదు అని అంతరాత్మ పోరు పెడుతుండేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని ప్రైవేట్ గా అయినా చేసుకోవచ్చుగదా అనిపించేది. 

ఇదిలా ఉండగా ఇదిగో...ఇప్పుడు సివిల్ సర్విస్ రాయాలని కొత్త కోరిక. మాయల దెయ్యానివే మనసా...తెగిన పతంగానివే అని ఆత్రేయ ఊరికనే అన్నాడా..? సరే...! ఇండియన్ సివిల్ సర్విస్ అనే పేరు మీద మన దేశం లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ 1920 లో ప్రవేశపెట్టిన ఉద్దేశ్యం ఏమిటంటే,మేధస్సు ఇంకా శారీరక బలం ఉన్న యువత బ్రిటిష్ ప్రభుత్వ యంత్రాంగానికి చెవులు,కళ్ళు గా ఉండి పరిపాలనలో సహకరించడానికి..!దాన్నే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ సివిల్ సర్విస్ గా మార్చుకున్నాం.

ఆప్షనల్స్ రాయడానికి కావలిసిన మెటీరియల్ ని పోస్ట్ లో తెప్పించుకుని చదువుతూండేవాడిని.యోజన లాంటి పత్రికలు, ఇంగ్లీష్ డైలీలు, లైబ్రరీ లో అందుబాటులో ఉండేవి.ఈ వాట్సాప్ లు లాంటివి ఆ రోజుల్లో లేవు కాబట్టి సమయం ని దుర్వినియోగం చేయకుండా చదువు మీదనే దృష్టి నిలిపేవాడిని.చరిత్ర ఒక ఆప్షనల్ గా ఉండేది.కనక చదవక తప్పదు. ముందు కొద్దిగా ఆ సంవత్సరాలు అవీ గుర్తుండేవి కాదు ఎంత చదివినా. అయితే పోను,పోను భారతదేశ చరిత్ర చదువుతుంటే ఆయా కాలాల్లోకి ,ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి కలిగేది.

ఆ రకంగా ఎంత చదివినా ఇంకా తెలుసుకోవాలనిపించేది.చదవాలనిపించేది.తినగ తినగ వేము తియ్య నవడం అంటే ఇదేనా అనిపించసాగింది.నాకు సివిల్ సర్విస్ లో ర్యాంక్ వచ్చి ఐ.ఏ.ఎస్. అధికారిని అవుతానా లేదా నాకు తెలీదు గాని చదవడం లో ఉన్న మాధుర్యాన్ని,జ్ఞానం లో ఉన్న తేజాన్ని నాకు పరిచయం చేసింది కాలం.అది నా జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసింది.దేశం మొత్తాన్ని ఒంటరి గా తిరిగి ప్రతి రాష్ట్రం లోని గొప్పదనాన్ని ఆకళింపు చేసుకునేలా ఉత్తేజపరిచింది. ఈ దేశం యొక్క ఎత్తు పల్లాల్ని కళ్ళ తో చూసే అవకాశం కల్పించింది.     

      ఇదిలా ఉండగా సెకండరి గ్రేడ్ టీచర్స్ నియామకానికి ప్రకటన వెలువడింది. ఎలాగూ బి.యిడి చేశాను గనక, పోటీ పరీక్ష రాశాను.ఒక మూడు నెలల తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. పోస్టింగ్ ఎక్కడంటే దుమ్ముగూడెం మండలం లో లక్ష్మీపురం అనే కుగ్రామం.

"మరి నీ సివిల్ సర్విస్ పరీక్ష ని ఏం చేస్తావు" అడిగారు సన్నిహితులు.

" ఉద్యోగం చేసుకుంటూనే చదువుతాను. వచ్చిందా సంతోషం లేదా ఇంకా సంతోషం...నాకంటే ఎంతో తెలివైనవాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి అలమటిస్తున్నారు. నేను కేవలం రెండు ఎకరాల రైతుబిడ్డని. ఈ స్థాయికి రావడమే నాకు గొప్ప..!" అనేవాడిని.

పేరుకి ఏదో రైతుబిడ్డ ని అనడమే తప్పా ఏనాడూ నేను పొలం లోకి అడుగు పెట్టింది లేదు. నా ఊహ వచ్చినప్పటినుంచి పెరిగింది అంతా మా తాతయ్య దగ్గర నే..! ఆయన ఆరోగ్య శాఖ లో ఓ చిరు ఉద్యోగి.

" నువ్వు ఎందాక చదువుకున్నావు తాతయ్య" అని ఎప్పుడైనా అడిగేవాడిని. 

"ఏదో ...మాదంతా వానా కాలం చదువురా..." అని నవ్వేసేవాడు. 

కాని ఆయనకి ఉన్న లోకజ్ఞానానికి నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతుండేది. చిన్నప్పుడు ఆయన పక్కలో పడుకోబెట్టుకొని నాకు కొన్ని పద్యాలు నేర్పించేవాడు. అవన్నీ నాకు ఈ రోజుకి జ్ఞాపకమే. అవన్నీ కూడా భాగవతం లోని పద్యాలే. దాని కర్త పోతన గారే..! ఏ పాట నో గుర్తు కు రావడం లేదు గాని అది శుద్ధ ధన్యాసి రాగం లో చేసిన పాటరా అని ఓ సంధర్భం లో చెప్పాడు. వీటన్నిటినీ తల్చుకున్నప్పుడు సంగీతసాహిత్యాల్లో ఆయనకి మంచి అభిరుచి ఉండేదని క్రమేపి అర్ధమయింది. ఆయన భౌతికంగా కనుమరుగైనా ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ నా అంతరాంతరాళాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.  

 తాతయ్య నాకు ఇచ్చిన గొప్ప ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయీ అంటే అవి రెండు అలవాట్లు అని చెప్పాలి. ఒకటి గ్రంథాలయానికి వెళ్ళి చదువుకోవడం,ప్రతిరోజు బయటికి వెళ్ళేముందు ఇష్ట దైవాన్ని ప్రార్ధించుకోవడం.ఫలానా పుస్తకాన్నే చదువు,ఫలానా దేవుణ్ణి మాత్రమే పూజించు అని ఆయన ఎప్పుడూ చెప్పేవాడు కాదు.కొన్ని ఎపుడు అలా నా ఇష్టానికి వదిలివేసేవాడు.మరెందుకో తెలీదు గాని,ఆయన చిరు ఉద్యోగి అయినప్పటికీ డైరెక్టురేటు స్థాయిలో కూడా మంచి పలుకుబడి ఉండేది.రికమండేషన్లు చేయమని వాళ్ళ శాఖ లోని ఉద్యోగులే వస్తుండేవాళ్ళు. దాని కీలకం ఏమిటో నాకు ఇప్పటికీ తెలియదు. 


                                                         ------------ 2 --------------


లక్ష్మీపురం అనే గ్రామం దుమ్ముగూడెం మండలం లో ఉంటుంది. అక్కడ ఉన్న ప్రాథమిక పాఠశాల లో నాకు మొదటి పోస్టింగ్ వచ్చింది. భద్రాచలం వచ్చి అక్కడ నుంచి బస్సు ఎక్కి దుమ్ముగూడెం వచ్చాను.రమారమి ఓ ముప్ఫై కిలొమీటర్లు ఉంటుంది.అక్కడే మండల కార్యాలయాలు ఉండేవి.ఒకప్పుడు బ్రిటీష్ వారి హయాం లో ఒక వెలుగు వెలిగిన గ్రామం అది.రాజమండ్రి నుంచి ఇక్కడ కి గోదావరి మీద స్టీమర్లు,బోట్లు బాగా నడిచేవి.ఆ జల రవాణా కి సంబందించిన వర్క్ షాప్  ఈ దుమ్ముగూడెం ఊరి మొదట్లో నే తగులుతుంది. అయితే బాగా పాడయిపోయిన స్థితి లో ఉంటాయి అప్పటి నిర్మాణాలు.

మండల విద్యాధికారి వద్ద కి వెళ్ళి నా అప్పాయింట్మెంట్ ఆర్డర్  ఇచ్చి వాళ్ళ దగ్గరి నుంచి సపోర్టింగ్ ఆర్డర్ తీసుకొని లక్ష్మీపురం గ్రామానికి బయలుదేరాను.అక్కడే వి.ఆర్.ఓ. గా పనిచేసే ఒక మిత్రుడు తన సైకిల్ మీద నన్ను ఆ ఊరికి తీసుకు వెళ్ళాడు. ఆ ప్రాథమిక పాఠశాల లో అప్పటికే రాబర్ట్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు.తను సీనియర్ కనక ఆ స్కూల్ కి హెడ్మాస్టర్ కూడా..!      

 తను అల్లంత దూరం నుంచి మమ్మల్ని గమనించి మెల్లిగా ముందుకు నడుచుకుంటూ రాసాగాడు. దారి మధ్యలో ఉన్న కానుగ చెట్ల దగ్గర కలుసుకున్నాం.

"సార్...మీ స్కూల్ కి ఇంకో మేస్టార్ని పంపించారు" చెప్పాడు వి.ఆర్.ఓ.మిత్రుడు, రాబర్ట్ గారితో.

"చాలా సంతోషం సార్. ఈ మధ్యనే ఆఫీస్ కి వెళితే చెప్పారు కొత్త టీచర్లు వస్తున్నారని" అన్నాడాయన.

నేను ఆయనకి విష్ చేశాను. ఆయన కూడా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ముగ్గురం వెళ్ళి పాఠశాల లో కూర్చున్నాం. పిల్లలు మొత్తం మీద పదిహేను మంది దాకా ఉన్నారు. ఈ కొత్త మనిషి ఎవరబ్బా అని తదేకం గా చూస్తున్నారు.అందరి మొహాల్లో ఓ అమాయకత్వము,ఆసక్తి కలగలిసి ఉన్నాయి.

"పిల్లలూ , ఈ సారు ని మన బడికి కొత్తగా పంపించారు, ఇక మీదట ఎప్పుడూ వస్తూనే ఉంటారు" చెప్పారు రాబర్ట్ గారు. వాళ్ళసందేహం తీరిపోయినట్లయి చాలా సంతోషం గా నమస్తే సార్ అని ముక్త కంఠం తో అరిచారు. నేను కూడా వాళ్ళని విష్ చేశాను.

"ఏం సమస్య లేదు సార్. చక్కని స్కూలు,పిల్లలు కూడా చెప్పింది చదువుతారు, రేపటి నుంచి పొద్దున్నే వచ్చేయండి" అన్నారు హెడ్మాస్టర్ రాబర్ట్ గారు. ఊరు మొత్తం మీద కలిపితే ఓ వంద గడప ఉంటుంది. స్కూల్ మాత్రం ఊరు కి కొద్దిగా ఎడం గా ఉంటుంది. ఇళ్ళు అన్ని దారికి  అటూ, ఇటూ ఉంటాయి. పొలాలు,పచ్చని వృక్షాలు కనువిందుగా ఉన్నాయి.      

ఆ ఊరికి దగ్గర లోనే ఉన్న చిన నల్లబల్లి గ్రామం లో మకాం పెట్టాను. అది పర్ణశాలకి వెళ్ళే దారి మీద ఉంటుంది.కొన్ని ఇళ్ళు బయటకి,కొన్ని ఇళ్ళు లోపలికి ఉంటాయి.రమారమి పర్ణశాల అక్కడ నుంచి ఓ పది కిలోమీటర్లు ఉంటుంది.భద్రాచలం తర్వాత పర్ణశాల ని దర్శించుకోవాలని అనుకునే భక్తులు ఈ దారి మీదుగానే వెళుతుంటారు. శ్రీరామనవమి,ముక్కోటి ఏకాదశి లాంటి పండగలప్పుడైతే వాహనాల రద్దీ బాగా ఉంటుంది.ముఖ్యం గా ఈ చిన్ననల్లబల్లి గ్రామం లో రోడ్డు కి ఇరువైపులా ఉండే పచ్చని వరిపొలాలు కనుచూపు మేరకు విస్తరించి ఆహ్లాదపరుస్తుంటాయి.ఇక్కడ స్థానిక ఆదివాసీలతో పాటు కోస్తా జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఉంటారు.

ఈ గ్రామం లోనే ఇంకొంతమంది టీచర్లు నివాసం ఉంటూంటారు. చుట్టుపక్కల ఉన్న లోతట్టు గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులు ఇక్కడే అద్దె కి ఉంటారు.ప్రతి శుక్రవారం సంత నడుస్తుంది.ఆ రోజు బాగా సందడిగా ఉంటుంది.ఇంకో ముగ్గురు బ్యాచిలర్ టీచర్స్ తో కలిసి ఊరికి చివరన ఉన్న ఓ ఇంటిలో అద్దె కి ఉండేవాణ్ణి. ఆ   చుట్టూ మామిడి చెట్లు ఉండేవి.పైగా అడివి గడ్డి తో కప్పబడిన ఇల్లు గనక మంచి ఎండాకాలం లో కూడా చాలా చల్లగా ఉండేది. 

ఒక వర్షపు రాత్రి సంఘటన చెప్పాలి. మడత మంచాలు వేసుకుని నిద్రపోతున్నాం. రాత్రి పన్నెండు గంటలు అవుతోంది.కరెంట్ బల్బులు దీనంగా వెలుగుతున్నాయి,వోల్టేజ్ తక్కువ ఉండడంతో..!మాగన్నుగా నిద్రపట్టింది.దూరం నుంచి బూట్ల చప్పుడు వినబడుతున్నాయి.అవి క్రమేపి మా వైపే వస్తున్న అనుభూతి కలిగింది.ఎవరం మాట్లాడకుండా అలాగే వింటున్నాం.ఇంటి ని ఎవరో చుట్టూ కవర్ చేస్తున్నారు.ఒక్క నిమిషం వ్యవధి లో అరుగు మీదికి నలుగురు తుపాకులు పట్టుకున్న వ్యక్తులు ప్రత్యక్ష్యమయ్యారు. 

దెబ్బ తో మేమంతా ఉలిక్కిపడి లేచాం. ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోయాం. వచ్చిన వాళ్ళలో ఒకతను అడిగాడు.

" మీరు ఎవరు..? ఇక్కడ ఏం చేస్తున్నారు? " అని .

"మేమంతా ఈ చుట్టు పక్కల గ్రామాల్లో పనిచేసే టీచర్లం,ఇక్కడ అద్దెకి ఉంటున్నాం" అని చెప్పాము.

మా పేర్లు,మేము పనిచేసే ఊరి పేర్లు ఇంకా ఇతర వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళు అప్పుడు చెప్పారు,వాళ్ళంతా యాంటీ నక్స లైట్ స్క్వాడ్ కి చెందిన పోలీస్ లని. ఒక సమాచారం రావడం వల్ల ఈ గ్రామం లో ప్రవేశించారని.      

ఆ తర్వాత తెల్లారి మాకు తెలిసిన విషయం ఏమిటంటే రాత్రి పోలీస్ లు మా ఇంటికి వెనక వేపు ఉన్న ఓ ఇంట్లో తలదాచుకున్న ఇద్దరు నక్స లైట్ లని అరెస్ట్ చేశారని. విచిత్రం గా అనిపించింది.ఈ ప్రపంచం లో కొన్ని పనులు ఎంత రహస్యం గా జరుగుతాయి,అప్పుడప్పుడే చదువులు ముగించి సమాజం తో సంబంధం నెరిపే ఉపాధ్యాయ వృత్తిలో కి వచ్చిన మాకు కొన్ని వ్యవహారాలు కొత్త గా అనిపించేవి.అవి చదువు లో ఎక్కడా ఉండవు. ఎవరూ చెప్పరు. అనుభవం లో నుంచి నేర్చుకోవలసిందే.

ఒక్కొక్కసారి దానికి ఎంతోకొంత మూల్యం చెల్లించుకున్న తర్వాత గాని అర్థం కావు. మా హెడ్మాస్టర్ రాబర్ట్ గారు సందార్భానుసారం గా కొన్ని విషయాలు చెబుతుండేవారు.పిల్లలతో మనం మనసు విప్పి పాఠాలు చెబుతూ ,మాట్లాడుతూ మనం కూడా పిల్లల మాదిరిగా అయిపోతాం. వాళ్ళ తో వచ్చిన నష్టం ఏమీ లేదు గాని అంత భోళా గా గ్రామం లోని పెద్ద వాళ్ళ తో గాని,ముఖ్యం గా రాజకీయ పార్టీ ల్లో పనిచేసే వారి తో గాని మాట్లాడకూడదు.వాళ్ళకు ఇచ్చే గౌరవం ఇస్తూనే ఎంత అవసరమో అంతవరకే వినయం గా మాట్లాడాలి అని చెబుతుండేవారు.   

ఆయన ఎందుకు అలా చెప్పారో చాలా రోజులకి గాని అర్థం కాలేదు.లక్ష్మీపురం కి వెళ్ళే అడ్డరోడ్డు దగ్గర బస్ దిగి అక్కడనుంచి లోపలికి నడిచివెళ్ళేవాణ్ణి. మంచి వయసు లో ఉన్న రోజులు. అందునా ప్రకృతి ని ఆస్వాదించే నైజం. కాబట్టి ఆ నడక ఆనందకరం గానే ఉండేది. బాట కి ఇరువైపులా రకరకాల చెట్లు ,పూల మొక్కలు,పొదలు ఉండేవి. వాటి మీదుగా చల్లని గాలి రివ్వున వీస్తుండేది.చాలా అరుదైన ఔషధ మొక్కలు అగుపించేవి.వాటిని గుర్తించి వివరించాలంటే రాబర్ట్ మేష్టారే..!   

 ఒకరోజు అలాగే నడుచుకుంటూ వస్తున్నాను. ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలి వేగంగా వీస్తోంది. మద్ది చెట్ల వద్దకి రాగానే ఒక వింత శబ్దం బూం బూం అంటూ వినబడుతోంది. ముఖ్యం గా గాలి ఉండుండి వేగంగా వీచినప్పుడు,ఆ శబ్దం బాగా వినబడుతోంది. అక్కడే ఆగిపోయాను. చుట్టుపక్కలా నిశితంగా పరిశీలిస్తే అప్పుడు తెలిసింది. ఆ వింత శబ్దం మద్ది చెట్ల వెనుక ఉన్న వెదురు పొదల నుంచి ఆగి ఆగి వస్తున్నది.మంచి ఏపుగా పెరిగిన కొన్ని వెదురు పొదలు వంగిపోయి ఉన్నాయి.మరి జంతువులో,మనుషులో వాటిని అక్కడక్కడ విరగగొట్టినట్లు ఉన్నాయి. అలా కిందకి వంగిన వెదురు బొంగు ల్లోకి గాలి విసురు గా తగిలినప్పుడల్లా ఒక గమ్మత్తైన శబ్దం వస్తోంది.ఇంత దాకా నాకు వినబడినది మరేదో కాదు,వేణుగానం ...ప్రకృతి ఆలపిస్తోన్న వేణుగానం అన్నమాట..!

ఒళ్ళు గగుర్పొడిచింది. అలాగే నిల్చుండిపోయి చూడసాగాను.

"ఏంటి మేస్టారు, మీలో మీరే ఏదో ఆలోచిస్తున్నారు మద్ది చెట్ల కింద నిలబడి" అంటూ వినబడింది ఒక కంఠం. చూస్తే గడ్డం తో ఉన్న ఓ మనిషి. తనని ఎపుడూ నేను చూడలేదు, కాని నేను మేష్టార్ని అని ఇతనెలా గుర్తుపట్టాడబ్బా అని నివ్వెరపోయాను.

"అబ్బే...ఏం.. ఏం లేదు, ఊరికినే నిలబడ్డాను, అన్నట్టు మీరు ఎవరండి" తత్తరగా అడిగాను. ఏదో పార్టీకి యువ నాయకుడని చెప్పాడు.

"సరే...వస్తా మేస్టారు,మండల స్థాయి లో ఓ మీటింగ్ ఉంది " అంటూ చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళిపోయాడు మెయిన్ రోడ్ వైపు.             

స్కూల్ కి వచ్చిన తర్వాత జరిగిన విషయం చెప్పాను. రాబర్ట్ గారు నవ్వి " అవును సార్,ఎక్కడ ఎవరూ మనని గమనించనట్లే ఉంటుంది గ్రామాల్లో కాని ప్రతి మనిషి గురించి ఆరా ఉంటూనే ఉంటుంది.ముఖ్యం గా ఉద్యోగులు మీద కన్ను బాగా ఉంటుంది.మనం కూడా అందర్నీ పలకరించినట్లు ఉంటూనే ముందుకు పోతుండాలి...మొత్తానికి ప్రకృతి ని బాగా ఆస్వాదిస్తున్నారు" అన్నారు.

స్కూల్ మొత్తం లో పిల్లలు అంతా కలిపి ఇరవై మంది ఉంటారు.దాంట్లోనూ ఓ అయిదుగురు పిల్లలు ఇంకా లోపలున్న గ్రామం నుంచి వస్తారు.నిజానికి అది ఏకోపాధ్యాయ పాఠశాల.ఆ తర్వాత మరో పోస్ట్ శాంక్షన్ అయింది.గ్రామం చిన్నదే అయినప్పటికీ సబ్ ప్లాండ్ ఏరియా లో భాగం గా అక్కడ స్కూల్ మంజూరు అయింది.చాలామంది పిల్లలు దగ్గర్లో ఉన్న మరో గ్రామం లోని హాస్టల్ లో జాయినవడం మూలంగా మాకు వచ్చే పిల్లలు తక్కువ.

ఒకటవ తరగతి నుంచి అయిదవ తరగతి వరకు ఉన్న పిల్లల్ని ,ఎలాగు మేము ఇద్దరం కనక సగం సగం సంఖ్య లో పంచుకుని పాఠాలు చెబుతుండేవాళ్ళం. పిల్లలంతా కూడా చెప్పిన మాట వింటూ చదివేవారే,కాకపోతే తరచుగా కొంతమంది  అబ్సెంట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళని తీసుకురావడానికి ఇళ్ళకి వెళుతుండేవాళ్ళం.తల్లిదండ్రులు కూడా సహకరిస్తుండేవారు. అయితే నాట్ల సమయం లో మాత్రం కొద్దిగా కష్టం.

  గ్రామస్తుల ఇళ్ళు దూరంగా కొన్ని విసిరేసినట్లుగా ఉండేవి.బహుశా ఈమధ్యన కట్టినవనుకుంటా.అలా పిల్లల ఇళ్ళ కి వెళ్ళి తిరిగివస్తుండగా,అంతకు ముందు నేను ఏ మద్ది చెట్ల కిందనైతే నిలబడ్డానో ,దానిలో ఒకటి నరికివేయబడి దీనం గా మొండెం తో ఉన్నట్లుగా ఉంది. అరే...ఇంత పెద్ద మద్ది చెట్టు ని ఎవరు నరికారు..? ఆశ్చర్యపోతూ మా హెడ్మాస్టర్ కి చూపెడుతూ "ఏమిటి...సార్,ఇలా నరికిపారేశారు ఇంత పెద్ద చెట్టు ని..ఎవరై ఉంటారు..?" ప్రశ్నించాను.

"ఇంకెవరు..? మీరు చెప్పారుగా ...మీరు ఇక్కడ నిలబడినప్పుడు ఒకతను వచ్చి మాట్లాడాడని" అన్నాడాయన.

"అదేమిటి సార్,దానివల్ల అతనికి ఏమిటి నష్టం..?" బాధగా ఉంది ఆ చెట్టుని చూస్తుంటే.

"కొంతమంది మనుషులంతే.వాళ్ళకి ఏం లాభం ఉండనవసరం లేదు.ఎదుటివారికి ఏ మాత్రం అసౌకర్యం జరిగినా దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. దానికోసం వాళ్ళు ఇలాంటి వెధవ పనులు ఎన్నైనా చేస్తుంటారు. అదో శాడిజం. మీరు రేపు వచ్చేటప్పుడు ఈ పక్కనున్న మరో మద్ది చెట్టు ని కూడా కొట్టేస్తారు.చూస్తుండండి" రాబర్ట్ గారన్నారు.

నిజం గా ఆయన అన్నట్టుగానే ఆ మద్ది చెట్టు ని మరుసటి రోజు తెగనరికారు.గ్రామ సీమ ల్లో అమాయకత్వం నిండిన ప్రజలు కొందరుంటే ఇలాంటి శాడిస్ట్ కేరక్టర్లు ఇంకొన్ని ఉంటాయి. 

         పిల్లలందర్నీ తీసుకుని ఉపాధ్యాయులం ఇద్దరం పిక్నిక్ కి వెళ్ళాం. ఎక్కడికో కాదు మేము పనిచేసే ఊరికి ఓ నాలుగుమైళ్ళు లోపలికి ఉండే ప్రదేశం అది.అక్కడ ఒక వాగు ఇంకా చెట్లు అవీ బాగా ఉన్నాయి. అక్కడే ఓ చిన్న ప్రాజెక్ట్ కడుతున్నారు.దాన్ని కూడా పిల్లలకి చూపించినట్లు ఉంటుందని అక్కడికి ప్రోగ్రాం పెట్టుకున్నాం.ముఖ్యంగా మా హెడ్మాస్టర్ గారు అక్కడ కనిపించే కొన్ని మొక్కల్ని చూపించి వేటికి ఎలాంటి హెర్బల్ మెడిసినల్ వేల్యూస్ ఉన్నాయో వివరించడం ఆసక్తిదాయకం గా ఉండేది పిల్లలతో బాటు నాకు కూడా..! 

అలా వెళుతున్నప్పుడు దారి లో ఒక వ్యక్తి అప్పుడే తాటికల్లు దించి కొంతమందికి పోస్తున్నాడు. అతను స్థానిక కోయ ఆదివాసి తెగ కి చెందిన వ్యక్తి.ఈ ప్రాంతం లో ఉండేది ఎక్కువగా వారే.అవసరమైతే తప్పా ఇతరులతో ఎక్కువ గా మాట్లాడరు.ఇళ్ళని,పరిసరాల్ని సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకుంటారు.అనేక తరాలుగా విద్యాగంధానికి,అభివృద్దికి దూరం అవడం మూలంగా పేదరికం వెన్నంటే ఉంటుంది.అయితే భద్రాచలం లో ప్రభుత్వం పెట్టిన ఐ.టి.డి.ఏ. వల్లగాని ఇతర అభివృద్ది ప్రణాళికల వల్లగాని ఇప్పుడిప్పుడే బయట ప్రపంచం లోకి వస్తున్నారు.

మన తెలుగు సినిమాల్లో కోయ తెగ కి చెందినవారు అనగానే చూపించే వెర్రి మొర్రి దుస్తులు,లేని పోని డాన్సులు, కుర్రో కుర్రు అనే భాష...ఇలాంటివి అన్నీ సినిమాలు తీసే వారి  అజ్ఞానం,మూఢత్వం తప్పా మరొకటి కాదు.వారికి ఉన్న దాంట్లోనే నీటుగా ,శుభ్రంగా వారిదైన జీవనశైలి లో ఆత్మవిశ్వాసం తో జీవిస్తారు.అనేక వేల ఏళ్ళ చరిత్ర కలిగిన కోయ భాష ద్రావిడ భాషా కుటుంబం లో అత్యంత పురాతనమైనది.తమిళ భాష లోని కొన్ని మూలపదాలు బాగా పరిశీలించినట్లయితే కోయభాష లో కూడా వినిపిస్తాయి.      

ఆ పిక్నిక్ కి వెళ్ళినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. మా హెడ్మాస్టర్ గారి కి తెలిసిన స్థానిక గ్రామస్తుడు ఒకతను కలిశాడు.అతను,ఈయన ఏవో విషయాలు మాట్లాడుకున్నారు.ఆ వ్యక్తి కళ్ళు పరిశీలిస్తే బ్లూ రంగు లో ఉన్నాయి. మనిషి కూడా బలంగా,ఎర్రగా ఉన్నాడు. అసలు ఇటువంటి కళ్ళు నేను ఇంతదాకా చూసింది లేదు.దవడలు,ముక్కు చూసినా ఎందుకో గాని కాకసస్ జాతి ప్రజలకి దగ్గరగా అనిపించాడు.సివిల్స్ కి చదవడం లో ఇదొక ప్రయోజనం ఉంది.అనేక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది.ఇంకా తెలుసుకోవాలి అనే తృష్ణ కలుగుతుంది.

"సార్...ఎవరతను ?" ఆసక్తి గా ప్రశ్నించాను,ఆ కొత్త వ్యక్తి వెళ్ళిపోయాక.

"ఈ ఊరి వ్యక్తే , మేకలు బేరం చేస్తాడు. గ్రామాల్లో మేకలు కొని బయట కి తీసుకు వెళ్ళి అమ్ముతుంటాడు..!" 

"లాభం ఫర్లేదా ...బాగుంటుందా " 

"కనీసం ఒక్కో మేక కి అయిదువందల నుంచి వెయ్యి దాకా మిగులుతుంది సార్, కానీ రిస్క్ కూడా అలానే ఉంటుంది " 

"అతని కళ్ళు చూశారా ...నీలి రంగు లో లేవూ" 

"అవును...అతడిని అందరూ ఏయ్ అమెరికా అని ఆట పట్టిస్తుంటారు"

"అలాగా ...మరి దానికి కారణం ఏమై ఉండచ్చు" 

"ఒక్కో శరీర తత్వం సార్ " అని ఆయన ఆ టాపిక్ ని చాలా లైట్ గా తీసుకుని ఇంకేదో మాట్లాడడం మొదలెట్టాడు. నేను కూడా తాత్కాలికం గా ఆ విషయం మర్చిపోయాను.కాని ఇక్కడ ఏదో చరిత్ర ఉంది. చిదంబర రహస్యం లాంటిది ఉంది.మనసు లో ఆ ముద్ర పడిపోయింది. అది ఎప్పటికైనా విడిపోతుందా..?!

ప్రిలింస్ ఇంకా రెండు నెలలు ఉన్నాయి. అదృష్టం కొద్దీ మాకు సెలవులు ఉండే మే నెల లోనే..! కొన్ని పుస్తకాల్ని  స్కూల్ కి తెచ్చుకుని ఖాళీ సమయం లో చదువుకునే వాడిని. మేరియో ప్యూజో రాసిన ది గాడ్ ఫాదర్ నవల లో విటో కార్లియోన్ అనే పాత్ర ఒక మాట అంటుంది. ప్రతి మనిషి కి ఒకే ఒక విధిరాత ఉంటుంది. దాన్ని తప్పించుకుని బయటకి రావాలని చూసినా,ఏదో సరైన సమయం లో మళ్ళీ కాలం నిన్ను దాంట్లోకి తీసుకుపోతుంది అని.

అవును...అంతరంతరాళాల్లో ఎక్కడో ఒక రహస్యవాణి నాకు చెబుతూనే ఉన్నట్లు ఉంటుంది. ఒరేయ్ అబ్బాయ్...నువు సివిల్ సర్వెంట్ కావలసిన వాడివి కావు.అన్నిటికన్నా వేరుగా ఈ ప్రదేశాల్లోనే ఏదో ...మరుగున పడిన ఏదో ...విషయాల్ని పైకి వెలికి తీయవలసినవాడివి. దానికోసమే నీకు కాలం తర్ఫీదు ఇస్తున్నది.మరుగునపడిన చరిత్ర ని తవ్వడానికి..!

కాని నేను వింటానా ..? లేదు. ఎంతోమంది ఉద్యోగులు వాళ్ళ పనిచేసుకుంటూనే పై స్థానాల్లోకి ప్రయత్నించి వెళ్ళలేదా..?పరీక్షల్లో సక్సెస్ అయ్యి విజయదుందుభి మోగించలేదా అని నా అంతరాత్మ ని సమాధానపుచ్చేవాడిని. సరే...కానివ్వు,మానవ ప్రయత్నం మంచిదే అంటూ అంతరాత్మ కూడా సెలవిచ్చేది.

కళ్ళుమూసుకుని ఇలా ఆలోచిస్తున్న సమయం లో తటాలున స్కూల్ పక్కన ఏదో జీప్ ఆగిన శబ్దం అయింది.కుర్చీలో నుంచి అలా లేచానో ,లేదో నీటుగా ఉన్న ఓ యువకుడు స్కూల్ లోపలికి వచ్చాడు.తన వెనక ఉన్నవాళ్ళు బయటనే ఉండిపోయారు.అప్పుడు తట్టింది,    భద్రాచలం సబ్ కలెక్టర్ అని. ఫోటో ని పేపర్లలో చూసిన విషయం గుర్తుకి వచ్చింది. 

నా కంటే ముందు పిల్లలు గుడ్మాణింగ్ సార్ అంటూ గట్టిగా అరిచారు.మా పిల్లల్లో ఉన్న సుగుణం ఏమిటంటే జీప్ లో ఎవరు వచ్చినా వాళ్ళకి గట్టిగా గుడ్మాణింగ్ చెబుతారు. అదంతే..!ఆయన కూడా హేపీ గా ఫీలయినట్లు అనిపించింది.నేను విష్ చేసి నిశ్శబ్దం గా ఓ పక్కకి నిలబడ్డాను.

ఆయన ఏమీ మాట్లాడకుండా నా టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తీసి పరిశీలించాడు.అప్పటిదాకా చదివి పేజీ ని మార్క్ చేసి అక్కడ పెట్టాను.హడావిడి లో తీయలేదు.ఆ బుక్ పేరు "వర్డ్ పవర్ మేడ్ ఈజీ" అని నార్మన్ లూయిస్ రాసింది.అదీ ఓ రకం గా అకడమిక్ బుక్ లాంటిదే కాబట్టి,దాని మీద ఏమీ అడగకుండా ఓ పిల్లాడిని పిలిచి గోడ మీద ఉన్న ఇంగ్లీష్ పదాన్ని చదవమన్నాడు.వాడు ఠకీమని చదివాడు.

వెరీ గుడ్ అని ఆ పిల్లాడిని అభినందించి బయటకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళు చెప్పారు,లోపల జరుగుతున్న ప్రాజెక్ట్ పనులు చూడటానికి సబ్ కలక్టర్ వచ్చారు తప్పా మన స్కూల్ గురించి కాదు అని. హమ్మయ్యా...ఎవరైనా కంప్లైంట్ చేశారాని అనుకున్నది పొరబాటన్నమాట..!  

"సార్...నిన్న మీరు సెలవు పెట్టారు గదా, సబ్ కలెక్టర్ మన స్కూల్ ని విజిట్ చేశారు" చెప్పాను తెల్లారి హెడ్మాస్టర్ గారికి.

"ఓహో...అలాగా,ఇక్కడ ప్రాజెక్ట్ సైట్ కి వచ్చినపుడు మన దగ్గరకి వచ్చి ఉండచ్చు...గతం లో కూడా వచ్చారు" అన్నాడాయన.

"మన గ్రామం మీదనుంచి చత్తిస్ ఘడ్ లోని గ్రామాల్లోకి సంతలకి వెళుతున్నారు కొంతమది చిరు వ్యాపారులు...మోపెడ్ ల మీద...అంత దగ్గరా మేస్టారూ...ఇక్కడకి" అడిగాను.

"మన దుమ్ముగూడెం,లక్ష్మీ నగరం ల నుంచే వెళుతుంటారు,ఇక్కడ నుంచి అడ్డంగా పోతే మహా అయితే పది కిలో మీటర్లు ఉంటుంది.కిష్టారం,గొల్లపల్లి ...మారాయిగూడెం ఇలాంటి ఊర్లలో సంతలు జరుగుతుంటాయి,చత్తిస్ ఘడ్ కి చెందిన గిరిజనులు అవీఇవీ కొనుక్కోడానికి వస్తుంటారు " 

"ఊరి పేర్లు అన్నీ తెలుగు లాగే ఉన్నాయి గదా "

"బోర్డర్ గదా...తెలుగు ప్రభావం సహజం...అన్నట్లు బడి అయిపోయిన తర్వాత ఎలా కాలక్షేపం చేస్తారు సాయంత్రం" 

"ఏముంది సార్...కాసేపు పుస్తకాలు చదువుకుంటాను,మా రూం పక్కనే ఉన్న టీచర్ల తో కలిసి ఊరి చివరకి అలా షికారు వెళతాను...ఆ చెరువు ... పచ్చని పొలాలు ...హాయిగా గడిచిపోతుంది" 

ఒక్కోసారి సార్ అని, ఇంకోసారి మేస్టారు అని అలా మేము ఇద్దరం పిలుచుకుంటూంటాం. ఉన్నది ఇద్దరమే గదా...ప్రస్తుతం వరకైతే ఎలాంటి ఈగోలు లేకుండా సాగిపోతోంది. రాబర్ట్ గారి లో ఉన్న గొప్పదనం ఏమిటంటే పిల్లలతో పిల్లల్లా కలిసిపోయి పాఠాలు చెబుతారు.

 బోర్డ్ మీద రకరకాల బొమ్మలు వేస్తూ, వేయిస్తూ ,నవ్విస్తూ పిల్లలకి బోధిస్తూ అలరిస్తుంటాడు. ఆయన రాని రోజున నాకు,పిల్లలకి బోరు గానే ఉంటుంది.ఏ మేస్టారు ఇంకో మేస్టారు లా ఉండడు,ఎవరి ప్రత్యేకత వారిదే. ఆయన లోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూల్ పరిసరాల్లో ఉండే చెట్లు,మొక్కలు ఒక్కటే కాదు,లోపల అడివి లో ఎక్కడో ఉండే ప్రతి మొక్క గురించి దాని ఔషధ గుణం గురించి బాగా తెలుసు.

ఏ మాత్రం ఖాళీ ఉన్నా వాటి గురించి వివరిస్తాడాయన. ఓసారి ఉత్తరేణి మొక్క, తెల్ల ఉసిరి మొక్కల్ని తీసుకొచ్చి " సార్ వీట్ని మీరున్న ఇంట్లో పెరట్లో వేయండి. అన్నిటికీ మంచిది" అన్నారు. అలాగే నాటాను.చక్కగా పెరుగుతున్నాయి.ఒకరోజు వచ్చి వాటి వేర్లని దేనికి ఎలా ఉపయోగించాలో చెబుతాను అన్నారు.


---------3--------

ఇలా ఉండగా ప్రయాణాల పై ఆసక్తి మళ్ళింది. దానికి రెండు కారణాలు. ఒకటి చదవడం మూలంగా ఆయా ప్రదేశాల్ని చూడాలనుకోవడం రెండవది స్విస్ కి చెందిన మార్కస్ జెల్లర్ అనే వ్యక్తి ని కలవడం. ఈ విదేశీ వ్యక్తిని అనుకోకుండా భద్రాచలం లో ఓ మలి సంధ్య వేళ కాకతాళీయం గా చూశాను. ఒడ్డున ఉన్న రాగి చెట్టు కింద మెట్ల పై ఒక్కడే కూర్చొని అస్తమిస్తున్న సూర్యుడి ని తదేకం గా చూస్తున్నాడు. 

"మీరు ఏ దేశం నుంచి వచ్చారు?" అడిగాను.

నా ప్రశ్న కి చిరునవ్వు తో "స్విసర్ లాండ్ "అన్నాడు. ఆ మనిషి లో ఏదో ఆనందం,ఆన్వేషణ ఈ రెండూ దోబూచులాడుతున్నాయి.వాటి కారణాలు ఏమిటో తెలియదు. మా సంభాషణ అంతా ఆంగ్లం లోనే జరుగుతోంది. 

"ఇక్కడ టెంపుల్ చూడడానికి వచ్చారా " ప్రశ్నించాను.

"అదీ ...ఇంకా ఈవేపు ప్రదేశాలు చూద్దామని వచ్చాను. కొన్ని రోజులు ఢిల్లీ,వారణాసి,లక్నో అటువైపు ఉన్నాను. దక్షిణాది లో కొన్ని మంచి ప్రదేశాలు చూడమని మిత్రులు చెప్పగా ఇటు వచ్చాను" అన్నాడు. అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్ లు ,వాటిల్లో ఇంటర్ నెట్ లు రాలేదు.

అతని చేతి లో ఓ కొబ్బరి చిప్ప ఉంది.అది పింగాణీ కప్పు లా నున్నగా ఉంది.అంటే ఆ విధంగా దాన్ని రాపిడి పెట్టి తయారు చేశాడు.

"అరే...గమ్మత్తు గా ఉందే. ఈ చిప్ప ని ఎలా ఇంత నున్న గా చేశారు..? కళాత్మకం గా ఉంది"అన్నాను.

"ఏముంది...ఖాళీ దొరికినప్పుడల్లా అలా చేస్తూ ...చేస్తూ.." మళ్ళీ చిరునవ్వు తో చెప్పాడతను.  

" మీకు చాలా ఓపిక. అవును లక్నో లో ఏ చేశారు?" 

"తబలా నేర్చుకున్నాను"

" ఓ...మ్యూజిక్ అంటే ఇష్టమన్నమాట...మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, రెగ్గె అంటే బాగా ఇష్టం. గిటార్ కూడా వాయిస్తుంటాడు. సెమి బ్రేవ్,మినిమం,క్రోచెట్ ఇలా నోట్స్ లో ఉండే రకాల గురించి చెబుతుంటాడు..!" 

"వెరీ నైస్,రెగ్గె అంటే నాక్కూడా ఇష్టం" 

"మీకు ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టమా లేక వెస్టెర్న్ నా " 

"అసలు మ్యూజిక్ మీద నిజంగా పేషన్ ఉన్న వ్యక్తి ఏ మ్యూజిక్ ని అంత తెలిగ్గా తీసివేయడు. దేని ప్రత్యేకత దానిదే. దేని గొప్పదనం దానిదే..!" 

"బాగా చెప్పారు. మా మిత్రుడు కూడా మీ లాగే అంటాడు.నాకు గిటార్ ఎంతో ఇష్టమో డోలు,నాదస్వరం కూడా అంతే ఇష్టం.ప్రతి వాయిద్యం లోనూ ఏదో గొప్పదనం ఉంది అంటాడు" 

"నిజం గా అతను చూడవలసిన వ్యక్తి" 

"మీరు ఇంకా ఇక్కడ భద్రాచలం లో ఎన్ని రోజులు ఉంటారు..? అవకాశం ఉంటే తనని రేపు కలుద్దాం"

"ఓకె...నేను ఇక్కడ ఈ లాడ్జ్ లో ఉంటున్నాను. రేపు మీకు కుదిరితే  ఉదయం రండి " అంటూ కార్డ్ ఇచ్చాడతను.        

.ఆ తెల్లారి మార్కస్ ని కలిశాను. ఇద్దరం కలిసి భద్రాచలం కి 45 కి.మీ. దూరం లో ఉన్న చర్ల అనే గ్రామం కి వెళ్ళాము. అక్కడ సురేంద్ర అనే చిన్ననాటి మిత్రుని కలిశాము.సాయంత్రం వరకు గడిపాము.మార్కస్ , సురేంద్ర తూర్పు ,పశ్చిమ సంగీత రీతుల గూర్చి చర్చించుకున్నారు.ముఖే ముఖే సరస్వతి గదా. ఈ చర్ల అనే గ్రామం ఒకప్పుడు నటులకు,నాటకాలకు ప్రసిద్ధి. తెలుగు నాటక రంగం లో ప్రసిద్ధులై ఆ తర్వాత సినిమా రంగం లో కూడా వెలుగుతున్న ఎల్.బి.శ్రీరాం,తనికెళ్ళ భరణి లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ తమ జీవితపు తొలిదశ లో నాటకాలు వేశారు.ప్రతి ఏటా నాటక పరిషత్ లు జరిగేవి.చాలా కోలాహలం గా ఉండేది.

మార్కస్,సురేంద్ర,నేను ఊరి చివరి పచ్చని పైర్ల వేపు గా వెళ్ళి చాలా సంగతులు సావధానం గా మాట్లాడుకున్నాము.ఎక్కడి యూరపు లోని స్విస్ దేశం,ఎక్కడి చర్ల గ్రామం..? ఇదే ప్రశ్న అతడిని అడిగాను.

"మనలో మన మాట. మీరు ఎక్కడో యూరపు నుంచి వచ్చి  ఏ ఇది లేకుండా ఈ దేశం లో ఇన్ని ప్రదేశాలు తిరుగుతున్నారే. భయం అనేది ఉండదా..?" అని.

"మనిషి ఎక్కడున్నా ఏవో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ప్రయాణాల్లో కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి.తప్పదు.వాటిని కూడా కలిపి ఆస్వాదించాలి,అప్పుడే ప్రపంచాన్ని తిరిగిరాగలం...ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం...ప్రజల జీవితాన్ని దగ్గరగా చూడడం నా చిరకాల వాంఛ..!" అన్నాడు మార్కస్.

"మా ప్రజలు చాలామంది తమ రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలు వెళ్ళాలన్నా అక్కడ పరిస్థితులు ఏమిటో అనుకుంటారు.కాని మీరు దేశాలు దాటి వచ్చి హాయిగా విహరించి వెళుతున్నారు... ఆ విషయం లో మిమ్మల్ని అభినందించాలి" సురేంద్ర తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

అలా ఆహ్లాదంగా ఆ సాయంత్రం వరకు  గడిచింది. ఆ తర్వాత మార్కస్ , నేను భద్రాచలం బస్ ఎక్కి వచ్చేశాము. ఆ మరుసటి రోజు రాత్రి మార్కస్ జగదల్ పూర్  బస్ ఎక్కి  ఉత్తర భారతం వైపు సాగిపోయాడు. ఆ తర్వాత నాలో ఎన్నో ఆలోచనల తరంగాలు ... ఎక్కడో దేశం నుంచి వచ్చి ఒంటరి గా తిరుగుతున్న మార్కస్ నా మస్తిష్కం లో ఎన్నో ఆలోచనలకి హేతువయ్యాడు. ఇదే దేశం లో పుట్టి పెరుగుతున్న నేను ఈ దేశం లో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఆ ఆసక్తి కూడా బాగా ఉంది.దేశం లోని ప్రతి అణువు ని కాకపోయినా ప్రతి ముఖ్యమైన ఊరు ని దర్శించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. కాని ఎందుకు వెళ్ళలేకపోతున్నాను. ఆపుతున్న అంశం ఏమిటి..?

భయము,బెరుకు ఇంకా ఏమవుతుందో అనే సందేహం..! నిజాయితీ గా విశ్లేషణ చేస్తే మటుకు అదే కారణం. సరే...ఈ సారి ఒక ప్రయోగం చేస్తాను. ఎన్ని ఏళ్ళు పట్టినా,ఏది ఏమైనా ఒంటరి గా దేశం మొత్తాన్ని చుట్టే ప్రయత్నం చేస్తాను. ప్రతి సంవత్సరం ఒక్కో రాష్ట్రాన్ని ఎంచుకుంటాను.అక్కడి చూడదలుచుకున్న ప్రదేశాల్ని ఒక ప్రణాళిక ప్రకారం సందర్శిస్తాను. అలా గట్టిగా నిర్ణయించుకున్నాను.

మే నెల రానే వచ్చింది. వైజాగ్ లో ప్రిలింస్ సెంటర్. ఏ.ఎన్.ఆర్. కాలేజ్..! అంత గొప్పగా రాయలేదు. అది నాకే తెలుస్తోంది.బాధ కూడా ఏమీ అనిపించలేదు.ప్రస్తుతం ఉద్యోగం లో ఉన్నందు వల్లనా ,ఏమో..!ఇపుడు దానికంటే నా లక్ష్యం భారతదేశ పర్యటన.దానికి మొదటి అడుగు ఇక్కడినుంచే.హౌరా ఎక్స్ ప్రెస్ ఎక్కి మద్రాస్ లో దిగాను.దానికి తూర్పు ఎటో దక్షిణం ఎటో నాకు తెలీదు.కానీ చూద్దాం ఏమవుతుందో...ఏ అనుభవాలు దొరుకుతాయో ఇక్కడ అనుకున్నాను.

ఎగ్మొర్ స్టేషన్ లో దిగి అందరి తో బాటు బయటకి వచ్చాను. నేను రైలు లో తోటి ప్రయాణీకుల దగ్గర నుంచి మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాను.దాని ప్రకారం ఏ మాత్రం సందేహించకుండా స్టేషన్ ఎడమ వైపు ఎంట్రెన్స్ నుంచి వచ్చి వెనక్కి కొద్ది దూరం నడవగానే హోటల్స్ కనిపించాయి.అక్కడ ఓ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఉన్న హోటల్ లో రూం తీసుకున్నాను. అప్పటికి మద్రాస్ చెన్నై కాలేదు.

ప్రతిచోట ఇంగ్లీష్ లోనే మాట్లాడాను.భాషాపరమైన ఇబ్బంది ఏమీ లేదు.ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకి చేసిన మేళ్ళ లో ఇది ఒకటి. ప్రతి వారికి ఎంతో కొంత ఇంగ్లీష్ రావడం.   

మద్రాస్ లో లేనా తమిళ్ వాణన్ అనే సాహితీవేత్త ని కలిశాను.తను కాల్ కండు అనే వార పత్రిక కి సంపాదకుడు కూడా..! నగరం లోని వివిధ చారిత్రక,సాంస్కృతిక,సాహిత్య అంశాలని టచ్ చేయాలనేది నా కోరిక.దానిలో భాగం గానే ఈ తమిళ్ వాణన్ ని కలిశాను.ఈయన తండ్రి గారు కూడా ప్రసిద్ధ సాహిత్యకారుడు.మరి ఈ సాహిత్య కారుడి గురించి నీకు ఎలా తెలుసంటారా..?

భద్రాచలం లో ఓ పెట్రోల్ బంక్ పక్కన ఇడ్లీ ,దోశెలు వేసి అమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఉండేవాడు. అతను తమిళుడు. పేరు అబ్దుల్లా.నేను ఎప్పుడు టీ,టిఫిన్ చేసినా అక్కడే.ముఖ్యం గా చట్నీ మాత్రం అదరహో అనే విధం గా ఉండేది.ఎక్కడో రామేశ్వరం దగ్గర నుంచి వచ్చి ఈ మూలన టిఫిన్ కొట్టు పెట్టుకున్నాడు.చిన్న గది లో ఉంటుంది.దానికి పేరు ఏమీ ఉండదు గానీ అబ్దుల్లా హోటల్ అంటే మాత్రం అందరకీ తెలుస్తుంది.

అతను ఏ మాత్రం ఖాళీ దొరికినా ఓ తమిళ పత్రిక పట్టుకుని చదువుతుంటాడు. నేను ఆసక్తి గా అడిగాను ఏమిటా పత్రిక పేరు అని.

"దీని పేరు కాల్ కాండు సార్. దీంట్లో వేసే కథలు,వ్యాసాలు,మిగతా విశేషాలు బాగుంటాయి.అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా దీన్ని పోస్ట్ లో తెప్పిస్తుంటాను. ఖాళీ ఉన్నప్పుడల్లా చదువుతుంటా"  చెప్పాడతను.

"ఏదీ పాత ఇష్యూ ఉంటే ఒకటివ్వకూడదూ,మీ భాష రాదు లే గాని ఏదో అలా తిరగేస్తా సరదాగా " అన్నాను నవ్వుతూ. అబ్దుల్లా ఎంతో ఆనందం గా నెల క్రితం వచ్చిన ఇష్యూ ఒకదాన్ని నా చేతి లో పెట్టాడు. డబ్బులివ్వబోతే అబ్బె దీనికి ఎందుకు సార్ అని స్వీకరించలేదు.    
           నిజం గానే పత్రిక బాగుంది.కొన్ని వైజ్ఞానిక విషయాలు ఉన్నాయి.కథలు ఉన్నాయి. సంగీత కారుల తో,సాహిత్యకారుల తో ఇంటర్వూలు ఉన్నాయి.అలాగే సినిమా విశేషాలు ఉన్నాయి.చివరి పేజీ లో కింద చూస్తే సంపాదకుని పేరు , చిరునామా, ఫోన్ నెంబర్ ఇంగ్లీష్ లో ఉన్నాయి.అవన్నీ నా డైరీ లో నోట్ చేసుకున్నా.అబ్దుల్లా ని కలిసినపుడు ఆ సంపాదకుడి గురించి అడిగితే చాలా గొప్ప గా చెప్పాడు.

అలా సేకరించిన చిరునామా,ఫోన్ నెంబర్ నాకు ఇలా ఉపయోగపడ్డాయి. మద్రాస్ పర్యటన లో తనికాచలం రోడ్ లో ఉన్న ఆ ఆఫీస్ లో లేనా తమిళ్ వాణన్ ని కలిసి మాట్లాడాను.ఆయన రాసిన పుస్తకాల గురించి ,తమిళ పత్రికల గురించి అడిగితే వివరించాడాయన.చాలా కొత్త విషయాలు తెలిశాయి. ఒక ఫోటో దిగాను. అలాగే తను రాసిన ఒక పుస్తకాన్ని బహుమతి గా ఇచ్చాడు. అది ఒక మధురానుభూతి.

 నా బస్ దగ్గర నుంచి మెరీనా బీచ్ దాకా నడిచివెళ్ళేవాడిని.సబ్ వే లో కూడా తిరగడం ఆనందం ఇచ్చేది.అన్నిరకాల చూడవలసిన నిర్మాణాల్ని చూశాను.సినిమాలకి,నాటకాలకి,సంగీత కచేరీలకి వెళ్ళేవాణ్ణి.అలా సగటు తమిళ ప్రజ యొక్క నాడి ఎంతో కొంత అర్థమయ్యేది.ఏ అంశాన్ని పట్టుకున్నా చివరి వరకు వదిలిపెట్టకుండా కష్టపడి పనిచేయడం తమిళులల్లో నాకు నచ్చేది.మనం ఆలోచించే లోపు వాళ్ళు కార్యం లోకి దిగిపోతారు.ఎంత డబ్బులున్న వారు గానీ ఆడంబరం తక్కువ. ఇలా మనకి వాళ్ళకి కొన్ని మౌలిక మైన తేడాలున్నాయి అనిపించేది.

ఎక్కడికి వెళ్ళినా సాధ్యమైనంత వరకు నడిచి వెళ్ళడం లేదా సిటీ బస్ లు ఎక్కడం చేసేవాణ్ణి. దానివల్ల జనాలతో మమేకం అయ్యే అవకాశం ఎక్కువ. కొద్ది కొద్దిగా తమిళ భాష ని మాట్లాడటానికి ప్రయత్నించే వాడిని.మొత్తానికి అలా పది రోజులు ఉండి వచ్చేశాను.నా మొదటి దూరప్రయాణం సక్సెస్ అయినందుకు ఆనందమనిపించింది. మరి చేదు అనుభవాలు లేవా..?

ఉన్నాయి. కాని అవేవీ పట్టించుకునేంత సీరియస్ వి కావు. ఎక్కడ ఎవరి తో ఎలా మెలగాలో మాట్లాడాలో ప్రయాణాలు చేస్తేనే బాగా తెలుస్తాయి.ఎన్ని రకాల మనుషులని. 
సంజీవదేవ్ గారి పుస్తకం "తెగిన జ్ఞాపకాలు" లోని కొన్ని విషయాలు గుర్తుకి వచ్చాయి. అదే విధంగా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమైన అంశాలు రాసిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను.మనం చూస్తున్నపుడు,వింటున్నపుడు ...ఆ ఇది గుర్తు ఉండదా అనుకుంటాం గాని చాలా విషయాలు మనం మర్చిపోతుంటాం.అది అనుభవం లో తెలుస్తూనే ఉంటుంది.

స్కూల్ లో రాబర్ట్ గారికి నా ప్రయాణ విశేషాలు అన్నీ చెప్పాను.మెరీనా బీచ్ లో కొన్న ఒక శంఖాన్ని ఇచ్చాను. చాలా అందం గా ఉండి,ఊదుతున్నప్పుడు గూడా చెవులకింపు గా శబ్దం వచ్చేది. మా బడి పిల్లలందరికీ ఏవో చిన్న చిన్న బహుమతులు ఇచ్చాను.అందరూ సంతోషించారు.ప్రయాణ అనుభవాల్ని అందరి తో పంచుకున్నాను.

"అవును సార్, మీ పాలసీ నే కరెక్ట్. నేను ఎన్నో ప్రదేశాలు తిరగాలనుకున్నా.సంసారం లో బడి అన్నిటినీ పక్కన పెట్టేశా.పెళ్ళి కి ముందే అన్నీ తిరగాలి ఇలా ...మళ్ళీ ఆ తర్వాత కుదరదు..!" అన్నారు రాబర్ట్ గారు. 

అంతలోనే లూనా ఆగిన చప్పుడయింది. బయటకి వచ్చాము.ఎవరో కాదు వి.ఆర్.వో. గా మండలం లో ఉద్యోగం చేస్తోన్న రాఘవయ్య గారు. నేను జాబ్ లో జాయిన్ అవడానికి మొదట్లో ఆయనతోనే కలిసివచ్చాను. ఆయన మంచి పాఠకుడు ఇంకా రచయిత కూడా.ఆయన తో సాహిత్య విషయాలు అవీ మాట్లాడుతుండే వాడిని.దుమ్ముగూడెం లో నివాసం ఉంటాడాయన. ఉద్యోగరీత్యా గ్రామాల్లో తిరుగుతూ ఉంటారు.    
" ఏమిటి సార్, ఎలా ఉంది ఉద్యోగ జీవితం..? మా ఇంటికి కూడా రాలేదు అప్పటినుంచి" నవ్వుతూ అడిగారు రాఘవయ్య గారు.

"అయిదు నెలలు గడిచిపోయాయి. ఏముంది సార్, ఇక్కడికి నాలుగు  మైళ్ళ దూరం లో ఉన్న చిన్న నల్లబల్లి గ్రామం లో రూం తీసుకున్నా.పొద్దున్నే అక్కడ నుంచి క్యారేజి తీసుకుని బడికి రావడం మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవడం.పిల్లలు కూడా మంచిగా చదువుతారు,హాయిగా ఉంది .." అన్నాను.

"వి.ఆర్.వో. గారూ,మీ మిత్రులు ఈ మధ్య సెలవుల్లో తమిళ నాడు టూర్ వేశారు.అవే చెప్పుకుంటున్నాం...ఇంతలో మీరు వచ్చారు..!" అన్నారు రాబర్ట్ గారు.

"ఓహో అలాగా..!ఆయనకి ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం లెండి, అన్నట్టు సార్, మీకు జనార్ధన్ గారు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారా ,ఇంకా తిప్పిస్తూనే ఉన్నారా..?"  అడిగారు రాఘవయ్య గారు.

"ఇంకా లేదు సార్,అదేం మనిషో ...ఇంతవరకు నేను అలాంటి వ్యక్తిని చూడలేదు" బాధ గా చెప్పారు రాబర్ట్ గారు. ఎదో కత లాగే ఉన్నదే అని ప్రశ్నార్ధకం గా ముఖం పెట్టాను.

"జనార్ధన్ అని మన మండలం లోనే ఓ హైస్కూల్ లో పనిచేస్తాడు.మహా చాణక్యుడు. అందిన వాళ్ళ దగ్గరల్లా అప్పులు తీసుకుంటాడు.అసలు అప్పుడు చెప్పే కబుర్లు మామూలుగా ఉండవు.ఎలాంటోళ్ళయినా ఆ మాయలో పడాల్సిందే...మన రాబర్ట్ మేస్టారు దగ్గర రెండేళ్ళ క్రితం యాభై వేలు తీసుకున్నాడు.అప్పటినుంచి అదిగో..ఇదిగో..అంటూ కాలయాపన చేస్తున్నాడు తప్పా డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు" చెప్పారు రాఘవయ్య గారు.

"అసలు ఫోన్ చేసినా ఎత్తడు...ఇంటికి వెళితే లేడని చెప్పిస్తాడు, ఇలా కాదని మొన్న ఆ మధ్య వాళ్ళ స్కూల్ కి వెళితే బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.తన ఆరోగ్యం దెబ్బ తిన్నదని,ఫిట్స్ వచ్చి మంచం మీద నుంచి పడిపోయానని,హైద్రాబాద్ హాస్పిటల్ కి పోతే లక్షన్నర ఖర్చు అయింది అంటూ ఆ చిట్టీలన్నీ చూపించాడు...అది చూసి మళ్ళీ నాకే జాలి అనిపించి వచ్చేశా" తల పట్టుకుని చెప్పారు రాబర్ట్ గారు.

" ఈ మధ్య మీ టీచర్ల లోనే ఒక గాసిప్ మొదలయింది,వినలేదా..! ఈ జనార్ధన్ కనిపించిన ప్రతి వాళ్ళదగ్గర ఇలాగే డబ్బులు గుంజుతాడట.రకరకాల కతలు జెప్పి జనాలకి టోకరా వేస్తాడట. అంతకీ బాగా వత్తిడి తెస్తే మీకు జెప్పినట్లే సెంట్ మెంట్ కబుర్లు జెప్పి సగం మాత్రమే ఇవ్వగలనని కాళ్ళు పట్టేస్తాడట. అట్లా ఆయన సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడట..!" రాఘవయ్య గారు చెప్పాడు.

దానితో నాకు మతి పోయింది. ఇంత కేటులు ఉన్నారా టీచర్ల లో అని..!

" ఇదేదో సినిమా కేరక్టర్ లా ఉందే" అన్నాను ఆత్రం ఆపుకోలేక. రాబర్ట్ గారు నవ్వలేక నవ్వాడు.

"భలే వాళ్ళే...అసలు మీరు ఒక్కసారి అతగాడిని కలవాలి. ఆ వాక్చాతుర్యానికి ఎవరైనా పడిపోవాల్సిందే.ప్రతి ఒక్కడిని అన్నా ...అన్నా...తమ్మీ...తమ్మీ ...అంటూ ,మాటి మాటికి అందమైన చిరునవ్వు నవ్వుతూ మామూలుగా అలరించడూ " రాఘవయ్య గారు నవ్వుతూ చెప్పారు.

"అయితే ఆ కేరక్టర్ ని కలవవలసిందే" అన్నాను.మొత్తానికి ఇవేళ ఓ కొత్త సంగతి తెలుసుకున్నాను. టీచర్ల లో రాబర్ట్ గారి లాంటి మంచివాళ్ళున్నట్లే,జనార్ధన్ లాంటి టోకరా టీచర్లు కూడా ఉంటారు.

"సార్, ఈ ఆదివారం మా ఇంటికి రండి దుమ్ముగూడెం ...అక్కడి మిత్రులం అంతా కలిసి ఓ చిన్న సాహిత్య గోస్ఠి పెట్టుకున్నాం" అన్నారు రాఘవయ్య గారు.

"అలాగే...తప్పకుండా సార్" అన్నాను.            
ఇచ్చిన మాట ప్రకారం చిన్న నల్లబల్లి నుంచి దుమ్ముగూడెం గ్రామం కి బయలుదేరాను. అప్పుడు ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం మాట. ఆటోలు అవీ ఏమీ ఉండేవి కావు.ఆర్.టి.సి.బస్సులు లేదా దేవస్థానం వాళ్ళ బస్సు ఉండేది.దాదాపు గా ఏడు కి.మీ. దూరం ఉండేది.దుమ్ముగూడెం, పర్ణశాల వెళ్ళే రోడ్డు కి కొద్దిగా లోపలికి అంటే ఓ కి.మీ. లోపలికి ఉంటుంది.ఒకప్పుడు అంటే బ్రిటీష్ వాళ్ళు పాలించే కాలం లో ఓ వెలుగు వెలిగిందని మిత్రులు రాఘవయ్య గారు చెబుతుంటారు.

వచ్చిన ఆర్.టి.సి. బస్సు ఎక్కాను. అది మెల్లిగా కేశవ పట్నం మీదుగా దుమ్ముగూడెం కి చేర్చింది. దిగగానే రాఘవయ్య గారు ఇంకో ఇద్దరు మిత్రులు బస్ స్టాప్ వద్ద కలిశారు. ఆ సెంటర్ లోనే ఉన్న ఓ హోటల్ లో టీ తాగాము. పిచ్చాపాటి ముచ్చట్లు అయిన తర్వాత రాఘవయ్య గారు అక్కడి స్థానిక లైబ్రరీ కి తీసుకెళ్ళారు.అక్కడే మా సాహితీ సమావేశం. ఆ లైబ్రేరియన్ ఇలాంటి సమావేశాలకి ఓ రూం వాడుకొండి అని తాళాలు ఇస్తాడట. ఈరోజుల్లోనూ ఇలాంటి సాత్యాభిమానులు ఉన్నారు.సంతోషం.

దుమ్ముగూడెం గ్రామాన్ని గమనిస్తుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది. లైబ్రరీ ఓ పెద్ద పాతబడిన బంగాళా లో ఉంది. అదీ పై భాగం లో ఉన్న అంతస్తు లో ఉంది. కాని పాతదనం లో కూడా ఏదో హుందాతనం ఉంది. వంశీ సినిమా సితార లో ఉండే బిల్డింగ్ లా ఉంది.బర్మా కలప నిర్మాణం లో విస్తారం గా వాడారు.ముఖ్యంగా పైన సీలింగ్ కి,ఎదురుగా ఉండే మెట్లకి,డెకరేషన్ కోసం వీలయిన చోటల్లా వాడారు. పైన ఓ నాలుగు కుటుంబాలు,కింద ఓ ఐదారు కుటుంబాలు హాయిగా ఉండవచ్చు.అంత పెద్ద గా ఉంది.

"ఇది ఇప్పుడు కట్టింది కాదు మేస్టారు. 1920 ల ప్రాంతం లో కట్టింది. ఆ రోజుల్లో రాజమండ్రి నుంచి గోదావరి మీద లాంచీలు అవి తిరుగుతుండేవి. ఏ సామాన్లు అయినా అక్కడ నుంచే వచ్చేవి. ఆ రోజుల్లో కట్టిన బిల్డింగ్ లు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి,పాతబడిపోయాయి..!"  అన్నారు రాఘవయ్య గారు.

"అవునండి.నేను వస్తుంటే ఊరి మొదట్లో గోదావరి తగిలింది.దానిమీద ఓ వంతెన లాగా కూడా కట్టారు గదా " నా లోని చరిత్రకారుడు పైకి లేచాడు.

"అది కూడా ఆ నాటిదే. మీరు గమనిస్తే ఇంకా కొన్ని కనబడతాయి. వాటిని లాకులు అంటారు.గోదావరి నీళ్ళని అదుపు చేయడానికి ,మళ్ళీ విడిచిపెట్టడానికి చాలా పెద్ద ఇనుప తలుపులు ఉన్నాయి. ఆ రోజుల్లో లాంచీలు , బోట్లు లాంటివి పాడయితే వాటిని బాగుచేయడానికి ఆ ఒడ్డునే కొన్ని షెడ్స్ కూడా ఉండేవి. అవి ఇప్పుడు క్షీణ దశకి వచ్చాయి.వాటన్నిటిని ఆ రోజుల్లో బ్రిటీష్ వాళ్ళే కట్టారు. తెల్ల వాళ్ళు కూడా ...కొన్ని కుటుంబాలు ఉండేవి"  వివరించారు రాఘవయ్య గారు.

అంతలోనే రాఘవయ్య గారి తో ఉన్న ఓ వ్యక్తి అన్నాడు " మీకు ఇంకా చరిత్ర పూర్తిగా కావాలంటే ,కట్టా సుబ్బారావు గారిని కలవాలి...ఈ ఊరి హిస్టరీ మీద ఆయనే అథారిటీ" అని.

" ఎవరు సార్ ఆయన..?" అడిగాను రాఘవయ్య గారిని.

"ఆయన ఆల్ ఇన్ వన్ . వైద్యం చేస్తారు. వేదాంతం వివరిస్తారు.చరిత్ర చెబుతారు.ట్రావెల్ చేస్తుంటారు.మంత్ర,తంత్ర విద్యల్లో కూడా అందె వేసిన చెయ్యి.మీరు ఏది అడిగినా దానికి ఆయన దగ్గర సమాధానం ఉంటుంది.ఆయన అటక మీద అరుదైన ప్రాచీన గ్రంథాలు ఉంటాయి.అవి గాక ఇప్పటికీ పోస్ట్ లో ఏవో తెప్పించి చదువుతుంటారు..!" రాఘవయ్య గారు చెప్పారు.

" అలాంటి వ్యక్తిని కలవాలి సార్" అన్నాను.

" తప్పక మీకు పరిచయం చేస్తాను.అయితే ఇప్పుడు ఊర్లో లేరు.ఓ రెండు మూడు రోజుల్లో రావచ్చు.ఆయన సంసారం అంతా కర్నాటక రాష్ట్రం లో ఉంటుంది.ఇక్కడ అయనకి వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఓ ఇల్లు ఉంది.ఎవరైనా పేషెంట్స్ ఉన్నారంటేనో లేదా ఇల్లు చూసుకోవడానికో అప్పుడప్పుడు వస్తుంటారు " రాఘవయ్య గారి మాటలు విన్నాక ఈ సారి ఆయన వచ్చినప్పుడు తప్పక కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను.   

మా నలుగురు తోనే సాహిత్య సమావేశం ముగిసింది. మేము ఇద్దరం గాక ఉన్న మరో ఇద్దరు ఎవరంటే ఈ ఊరి లో కుర్రాళ్ళే.  గ్రాడ్యుయేషన్ చేసి గ్రూప్స్ కి చదువుతున్నారు.కొద్దిగా సాహిత్య అభిలాష ఉన్నవాళ్ళు. ప్రతి నెల ఎంతమంది వస్తే అంతమందితో చిన్న సమావేశం ఏర్పరచి సమకాలీన సాహిత్య పోకడల గురించి ,పుస్తకాల గురించి మాట్లాడుకుండానికి ఈ వేదిక. ఈ మాత్రం ఊరి లో ఇలాంటి ఆసక్తి గలవాళ్ళు ఉండటం మామూలు విషయం కాదు.       
"సార్, ఈసారి దగ్గర్నుంచి ఓ పని చేద్దాం. సాహితీ సమావేశం లో భాగం గా ప్రతి నెల ఓ పుస్తకం గురించి చర్చించుదాం. కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్న ప్రకటన కూడా ఇద్దాం. దానివల్ల ఆసక్తి కలిగిన వాళ్ళు వస్తుంటారు.సరే... అట్లాని సాహిత్య సమావేశాలకి పెద్ద పెద్ద గుంపుల్ని కూడా మనం ఎక్స్ పెక్ట్ చేయలేం. ఏదో మన చేతి లో ఉన్నది మనం చేద్దాం..!" నా అభిప్రాయాన్ని చెప్పాను రాఘవయ్య గారి తో. 

"అవును, మీరు చెప్పింది నిజమే" అన్నాడాయన. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా ఆయనే అన్నాడు "అలా ఊర్లోకి వెళదాం పదండి" అని.నేను సరే అని చెప్పి నడవసాగాను. ఆయన నన్ను ఊరి సెంటర్ లో కి తీసుకు వచ్చి మళ్ళీ ,అక్కడి నుంచి ఉత్తరం వేపు తీసుకెళ్ళాడు. సెంటర్ లో చక్కని సుభాష్ చంద్ర బోస్ విగ్రహం ఉంది. మిలటరీ డ్రెస్ లో శాల్యూట్ చేస్తున్నాట్లుగా..! ఈ విగ్రహానికి కొద్దిగా అవతలికి చూస్తే మహాత్మా గాంధీ విగ్రహం ఉంది.

అంతటితో ఆగలేదు. ఊరికి చివరికి రాగానే నెహ్రూ విగ్రహం వచ్చింది.అవి అన్నీ కూడా చక్కగా రంగులు వేసి నీటుగా ఉన్నాయి. బహుశా వాళ్ళ వర్ధంతి,జయంతులకి పూలమాలలు వేయడం లాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు రంగులూ అవీ నీటుగా వేస్తారనుకుంటాను. అదే అనుమానం వ్యక్తపరిచాను.

"సార్,ఈ వూళ్ళో భవంతులు పాతబడి ఉన్నా,దేశభక్తుల విగ్రహాలు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి,ఏమిటి కారణం..?" అని.

"ఇది పాత తరాల నుంచి వస్తున్నదేనండి. ఈ విగ్రహాలు అవీ చూశారా...ఏ మాత్రం వేలుపెట్టి చూపించడానికి లేకుండా ఎంత చక్కగా ఉన్నాయో...ఇవన్నీ కూడా రాజమండ్రి నుంచి ఆ రోజుల్లో లాంచీల్లో వచ్చినవే.వాటికి ఏ మాత్రం డామేజ్  కాకుండా చూసుకుంటారు. ఓసారి ఎవరో లారీ ని లోపలికి వేసుకొచ్చి బోసు బాబు బొమ్మని గుద్దేసి ఆయన కాలు ని విరగగొట్టారు. వాడి అడ్రెస్ కనుక్కుని మరీ ఇక్కడి జనాలు పరిహారం కట్టించుకున్నారు.అంతేకాదు,ఆ బోసు బాబు బొమ్మ కి అయిన డ్యామేజ్ ని సరిదిద్ది మళ్ళీ యథావిధి గా దాన్ని నిలబెట్టారు" రాఘవయ్య గారు పాత జ్ఞాపకాల్ని నా కోసం మళ్ళీ వెలికితీశారు.      

అలా మాటాడుకుంటూ గోదావరి నది మీద కట్టిన లాకులు దగ్గరకి వచ్చాము. నది లోని ఒక పాయని ఇవతలకి మళ్ళించి అక్కడ పెద్ద పెద్ద ఇనుప తలుపులు పెట్టారు.అవి తెరవడం,మూయడం అంతా కూడా ఒక పెద్ద చక్రం ఉంటుంది.దానితో చేస్తారు.దాని మీద ఓ చిన్న బ్రిడ్జ్.ఇదంతా దుమ్ముగూడెం గ్రామానికి మొదట్లో తగులుతుంది.

అక్కడినుంచి ప్రకృతి రమణీయం గా కనిపించింది. సరిగ్గా గోదావరి మధ్య లో ఓ దీవి లా ఉంది.దాని గురించి అడిగితే అక్కడ తమలపాకు తోట ఉందని రాఘవయ్య గారు అన్నారు. అంతా పచ్చగా కనిపిస్తోంది. ఒకటి రెండు ఆవులు మేస్తున్నట్లుగా ఉంది.ఒక్కసారి ఆ దీవి లోకి వెళితే బాగుండుననిపించింది.అనుకున్నవన్నీ అవుతాయా...ఎప్పుడన్నా సమయం వచ్చినపుడు చూడాలి.

"గోదావరి కి ఇవతల ఉన్న భాగాన్ని వర్క్ షాప్ అని అంటారు.చూశారా...కొన్ని పాత కాలం ఇళ్ళ మాదిరిగా ,కొద్దిగా కూలిపోయి కనిపిస్తున్నాయి అవన్నీ బ్రిటీష్ వాళ్ళ టైం లో కట్టినవే..!" చెప్పారు రాఘవయ్య గారు.

"అలాగా...మరి ఈ కనిపిస్తున్న పెద్ద పెద్ద పొడవైన వృక్షాల్ని కూడా వాళ్ళే నాటి ఉంటారు కదూ.బిర్చ్,మేపుల్,ఓక్ చెట్లతో ఉన్న ఇంగ్లండ్ గ్రామసీమలు గుర్తుకువచ్చాయి, వీటిని చూస్తుంటే, ఏం చెట్లండి ఇవి..." ప్రశ్నించాను.

"ఏవో అంటారండి...జ్ఞాపకం రావట్లేదు...అయితే కొన్ని నేరేడు చెట్లు కూడా ఉన్నాయి దాంట్లో " గుర్తున్నమేరకు చెప్పాడాయన.

" దానికి వెనుక భాగం గుండా వెళితే అద్దాల మేడ,ఇంకా రెండు మూడు పాత కాలపు బిల్డింగ్ లు కనిపిస్తాయి.వాటిల్లో బ్రిటీష్ అధికారులు నివసించేవారు.అవి కూడా శిథిల దశకి వచ్చాయన్నారు...మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలియదు.ఓ అరమైలు దూరం ఉంటుంది.ఇప్పుడు కాదులే గాని,మరెప్పుడైనా వెళదాం" చెప్పారు రాఘవయ్య గారు. ఆ రోజు త్వరగా రావాలని దైవాన్ని ప్రార్థించాను.  

"మళ్ళీ బస్ స్టాప్ కి ఎందుకు రావడం..? నేను ఇటునుంచి ఇటు వెళతాను లెండి. అక్కడ క్రాస్ రోడ్ దగ్గర బస్ పట్టుకుని చిననల్లబల్లి వెళ్ళిపోతాను" చెప్పాను ఆయనతో.

"మరి బస్ లు...సరే ఒక వేళ బస్ దొరక్కపోతే మా ఇంటికి వచ్చేయండి...!" అన్నాడాయన. అలాగే అన్నాను.అసలే చలి కాలం , తొందరగా చీకటి పడుతోంది.అడ్డ రోడ్ దగ్గరకి చేరుకున్నాను.పది నిమిషాల్లో.భద్రాచలం నుంచి పర్ణశాల వేపు వెళ్ళే బస్ కోసం చూస్తున్నాను.ఒక అరగంట తర్వాత బస్ వచ్చిందిలే గాని బాగా రష్ ఉంది.వదిలేశాను.

చీకటి పడింది. నక్షత్రాల కాంతి తో భూమి పై సన్నటి వెలుతురు పరుచుకుంది. రోడ్ కి అటూ ఇటూ చింత చెట్లు ఏపు గా పెరిగి ఉన్నాయి.అంతా నిర్మానుష్యం గా ఉంది.అక్కడున్న కల్వర్ట్ మీద కూర్చున్నాను. గుయ్ ...మంటూ ఏదో వినీవినపడని చప్పుడు.బహుశా క్రిమికీటకాలు ఏవో అయ్యుంటాయ్. మనం కళ్ళతో చూసే ,చెవులతో వినే చాలా కీటకాల పేర్లు మనకి తెలియవు.వాటి గురుంచి పట్టించుకోము.నిజంగా వాటిని మనం అవమానించడమే గదూ ఆ రకం గా..!
ఎందుకు ఇక్కడ వెయిట్ చేయడం...ఈ నక్షత్రాల కాంతి లో ...ఈ చెట్ల మధ్య లో నుంచి జెర్రి పాము లా పోతున్న ఈ నల్లటి తారు రోడ్ మీద ...ఈ రాత్రి పూట ...అయిదారు మైళ్ళు నడిస్తే ఎలా ఉంటుంది..? తనకి అసాధ్యమేమి కాదు. ఆలోచన రావడమే తరువాయి...లేచి నడక మొదలెట్టాను.

ఒక్క మనిషి కూడా కనబడట్లేదు. చల్లటి గాలి. చెట్ల ఆకులు చిరుగజ్జెలు మాదిరిగా మోగుతున్నాయి.బహుశా రాగి చెట్టు ఆకులనుకుంటాను.సున్నంబట్టీ క్రాస్ రోడ్ దాటి వచ్చాను. అటూ ఇటూ పొలాలు. కాలవ లో నీళ్ళు బుడ బుడ మని పారుతున్నాయి.ఈ సవ్వడులన్నీ పగటి పూట ఏమవుతాయో..? అప్పుడు కూడా ఉంటాయి.కాకపోతే మనం వినాలనుకునే శబ్దాల మధ్య వీటిని గమనించము.

ఒక పాము...తప్పకుండా అది కొండ చిలువ నే...లేకపోతే మనిషి పాదాల చప్పుడు కి అంత మెల్లిగా ఎందుకు స్పందిస్తుంది..? రోడ్డు పక్కనున్న గుంట లోనుంచి మెల్లిగా తారు రోడ్డు ఎక్కుతోంది.దేన్నో ఆరగించి ఉంటుంది.చిన్న సైజు గూడ్స్ బండి లా ఆ నక్షత్ర కాంతి లో కదులుతోంది.నాకు చాలా పరిచయం ఉన్న జీవి లానే అనిపించింది.ఎందుకంటే తెల్లవారిన తర్వాత తారు రోడ్డు మీద ప్రతి రోజు ఒకటి రెండు పాములు చచ్చిపడిఉంటాయి.ఏ లారీ నో,బస్ నో అలా తొక్కేసిపోతుంటాయి.

వాటి హెడ్ లైట్ల కాంతికి పాపం కళ్ళు కనపడక రోడ్డు మీద అటు ఇటు మెలికలు తిరుగుతుండగా వాటి మీదినుంచి పెద్ద వాహనాల్ని ఎక్కించి నిర్దాక్షిణ్యం గా చంపేస్తుంటారు.ఎంతో మంది జనాలు సైకిళ్ళ మీద, ఇప్పుడు నాలా నడిచివెళుతుంటారు. కాని ఏరోజున ఏ పాము ఎవరినీ కాటేసి చంపినట్లుగా వినలేదు. మనిషి అడుగుల చప్పుడు వింటే వాటంతటే అవే తప్పుకుని పోతుంటాయి. ఎప్పుడైనా మనిషి వాటి తోకని తొక్కడమో లేదా దగ్గరకెళ్ళి కదలిక చేస్తేనో అవి ఆత్మరక్షణ నిమిత్తం కాటేస్తాయి. ఇది నా అనుభవం లో తెలుసుకున్నదే.

సరే...మొత్తానికి ఆ గూడ్స్ బండి లాంటి కొండచిలువ క్షేమంగా రోడ్డు దాటేసి వెళ్ళిపోయింది. ఏ తాడి చెట్టు దగ్గరో,ఏ బూరుగు చెట్టు కిందనో విశ్రాంతి తీసుకుంటుంది. మంచిది ...దేవుడు నీకు ఈ రాత్రికి ఆయుషు నిచ్చాడు.జీవించు మిత్రమా ..!    

 అలా ఆ రాత్రి పూట ప్రకృతి ని ఆస్వాదిస్తూ నెమ్మెదిగా నడుచుకుంటూ నా గది కి చేరుకున్నాను. అప్పటికే నా పక్క గది లో ఉన్న టీచర్స్ భోజనాలు కానించి,బయట కుర్చీలు వేసుకుని ఏవో మాట్లాడుకుంటున్నారు.

"ఏమిటి సార్...ఈరోజు లేటు" అన్నారు వాళ్ళు.

"మా మిత్రులు ఒకరిని కలవడానికి దుమ్ముగూడెం వెళ్ళాను సార్...వచ్చేప్పుడు నడుచుకుంటూ వచ్చాను" నవ్వుతూ చెప్పాను.

"మీ ఓపిక కి జోహార్లు సార్..."  అన్నారు వాళ్ళు. నేను కూడా భోజనం చేసి పడుకున్నాను. అలిసి ఉండటం వల్ల గాఢ నిద్ర పట్టేసింది.

---------- 4 -----------

సివిల్స్ ప్రిలింస్ లో నా నంబర్ రాలేదు. అంటే గట్టెక్కలేదని అర్థం. బాధ కూడా ఏమీ అనిపించలేదు. సొంత ప్రిపరేషను అందులో దేశవ్యాప్తంగా ఉండే పోటీ ...సరే మన ప్రయత్నం మనం చేశాం అని సంతృప్తి పడ్డాను. మళ్ళీ రాయాలనిపించలేదు.

అదే సమయం లో ఒక పత్రిక లో సబ్ ఎడిటర్ గా పనిచేసే మిత్రుడు నెలకి ఒక ఆర్టికల్ ఏదో ఓ క్లాసికల్ రచన మీద రాసి పంపించమని కోరాడు. నేను ఇంగ్లీష్,తెలుగు నవలలు బాగా చదువుతుంటానని తనకి తెలుసు. మంచిది. ఈ రకం గా నైనా చదవడం,రాయడం అనే ప్రక్రియలకి ప్రతి రోజు అందుబాటు లో ఉండవచ్చు.

బోధన కి ఇది ఏ మాత్రం అడ్డు కాదు. పైగా మనం చదివితే అది ఎక్కడో ఒకచోట స్కూల్ పిల్లలకి తప్పకుండా ఉపయోగపడుతుంది.నిజానికి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి రోజు ఎంతో అంత చదవాలి. కాని దురదృష్టవశాత్తు చాలా మంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అవసరం లేదు అనుకుంటారు.

రోజులు,నెలలు,సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పుడే అయిదు ఏళ్ళు అయిపోయాయి ఇక్కడికి వచ్చి. ట్రాన్స్ ఫర్స్ అవుతాయని అంటున్నారు గాని రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతున్నాయి.     

 ఒక్కో సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రం తిరుగుతున్నాను. దీనికి గాను వేసవి సెలవుల్ని,దసరా సెలవుల్ని,సంక్రాంతి సెలవుల్ని ఉపయోగించుకుంటున్నాను.అవసరమైనప్పుడు కొన్ని లీవ్ లు పెడుతున్నాను. ఉపాధ్యాయ వృత్తి లో ఇదొక సౌకర్యం.ఒడిశా,వెస్ట్ బెంగాల్,మహారాష్ట్ర,కేరళ కర్నాటక రాష్ట్రాల్ని పర్యటించాను.వెళ్ళినపుడు అక్కడ విద్యా విధానం ఎలా ఉందీ అనేది పరిశీలించేవాడిని.

ప్రతి రోజు ఆయా ప్రాంతాల్లోని హిందీ లేదా ఇంగ్లీష్ లోకల్ పత్రికల్ని చదివేవాడిని.చుట్టుపక్కల చిన్న పట్టణాల్ని చూసి అక్కడ ఉండే సాంస్కృతిక,సామాజిక విశేషాల్ని డైరీ లో నమోదు చేసేవాడిని.వివిధ రాష్ట్రాల్లోని మనుషులు వారి వ్యావహారిక తీరు ఆలోచింపజేసేవి. లోకం తిరుగుతున్న కొద్దీ అంతా ఎక్కడున్నా మనుషులే అనిపించేది. కాని ఏదో తేడా గానూ అనిపించేది.

  ముఖ్యంగా కేరళ బోర్డర్ లోకి రైలు ప్రవేశించగానే చకోడీలు,బిస్కెట్ పాకెట్ లు అమ్మడానికి వచ్చే వాళ్ళు ప్రవేశించారనుకున్నాను,ఇంతకీ బిల బిల మని మా కోచ్ లోకి ఎక్కినవాళ్ళు ఎవరయ్యా అంటే అంతా రకరకాల పుస్తకాలు అమ్ముకోవడానికి వచ్చిన పిల్లలు వాళ్ళు.ఎప్పుడు ఎదురుకాని అనుభవం.జనాలు కూడా అలాగే కొంటున్నారు. నా ముందు కూర్చున్న మళయాళీ చత్తిస్ ఘడ్ లోని కోర్బా లో టీచర్ గా పని చేస్తున్నాడు.తను కుటుంబ సమేతంగా ఏదో పెళ్ళి నిమిత్తం వస్తున్నాడు. 

వాళ్ళ మాటల్ని బట్టి లీలగా అర్థమవుతోంది. మళయాళ భాష తమిళం కి దగ్గరగా ఉన్నా, సంస్కృత ప్రభావం కూడా ఎక్కువే. ఉదాహరణకి నఖ క్షతంగళ్ అనే మళయాళీ మాట... అదే మాటని తెలుగు లో నఖక్షతములు అంటాము.ఇంకా అచ్చ తెలుగు లో చెప్పాలంటే గోటి వల్ల అయిన గాయములు అని చెప్పవచ్చు. సంస్కృతం అండర్ కరెంట్ గా పనిచేస్తూనే ఉంది ...!     

ఓట్టపాలెం దాటిన తర్వాత అడిగాను, "కొట్టాయం రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది" అని.

"ఆ...దగ్గరకొచ్చింది కోట్టయం " అన్నాడు ముక్తసరిగా. కొ అనే అక్షరాన్ని కొద్దిగా సాగదీస్తూ.

రైలు కిటికీ లోనుంచి చూస్తుంటే అంతా పచ్చదనమే.అడివి మధ్య లో ఇళ్ళు కట్టుకున్నారా అనిపిస్తోంది ఏ వూరు చూసినా..!పొడుగ్గా పెరిగినా రబ్బరు చెట్లు,వాటి చుట్టూ కట్టినా పాత్రలు.ప్రతి రాష్ట్రానిదీ ఓ ప్రత్యేకత మన దేశం లో..!

"ఇంత అందమైన రాష్ట్రాన్ని వదిలి చాలా మంది కేరళీయులు బయటకి ఎందుకు పోతుంటారు..?" మనసు లో ఉన్నదే అడిగేశాను.

"ప్రకృతి సంపద,విద్య ...ఈ రెండే కేరళ యొక్క ఆస్తి,పెద్ద పరిశ్రమలు తక్కువ గా ఉంటాయి. అందుకే చాలామంది గల్ఫ్ దేశాలకి ఇంకా ఇతర ప్రాంతాలకి వలస పోతుంటారు, అన్నట్టు మీరు టీచర్ కదా..?" అనుమానం వ్యక్తం చేశాడు. ఎలా గుర్తు పట్టాడబ్బా అనుకున్నాను. నా షర్ట్ జేబులో ఉన్న రెండు పెన్నుల్ని బట్టా ...ఒకటి రెడ్ ఇంక్ ...రెండవది బ్లూ ఇంక్ ...!

"అవును, ఎలా తెలుసుకున్నారు మీరు ?" ఆశ్చర్యపోయాను.

"మీ జేబు లో ఉన్న రెండు పెన్నుల్ని చూసి... నేను కూడా టీచర్ నే...సి.బి.ఎస్.యి.స్కూల్ లో " అన్నాడు తను. ఆ తర్వాత స్టేషన్ లో దిగిపోయాడు. తన పేరు నాకు తెలియదు,నా పేరు తనకి తెలియదు. వీటినే రైలు పరిచయాలు అంటారు.    నేను చేస్తున్న స్కూల్ కి ఇంకా లోపలికి మరిన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. చాలా అటవీ ప్రాంతం... నడిచి వెళితే తప్పా,అవి రావు.ఇంత లోపలికి కూడా స్కూల్స్ ఉన్నాయా అని మొదట చూసిన వారు ఆశ్చర్యపోతారు.అంతా కూడా గిరిజన గ్రామాలే,ఇంత లోపలికి కూడా ఎందుకు పెడతారు ,చదువుకునే వాళ్ళు కూడా తక్కువ గదా అని కొందరనేవారు. లోతుగా ఆలోచిస్తే ప్రభుత్వమే ఇంత లోతట్టు గ్రామాల్లో స్కూల్స్ పెట్టకపోతే మరెవరు పెడతారు..? ప్రైవేట్ వాళ్ళు లాభాల కోసం చూస్తారు తప్పా సంక్షేమం గురించి వాళ్ళకి ఏం అవసరం...?

కాబట్టి స్వతంత్ర్యభారతం లో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అనడానికి ఈ మారుమూల నెలకొల్పిన స్కూల్స్ ని ఉదాహరణగా చెప్పాలి.పైడాకులమడుగు,చింతగుప్ప,నిమ్మలగూడెం,మారాయిగూడెం ఇలా కొన్ని లోపల గ్రామాలు ప్రస్తుతం చత్తిస్ ఘడ్ రాష్ట్ర సరిహద్దులకి దగ్గరగా ఉంటాయి.అప్పట్లో ఆ రాష్ట్ర విభజన జరగలేదు కాబట్టి మధ్యప్రదేశ్ లో ఉండేవి.జిల్లా కొస్తే బస్తర్ కిందికి వస్తాయి.మారాయిగూడెం అనే పేరు తో అటు ఆ రాష్ట్రం లోనూ ,ఇటు మన తెలుగు రాష్ట్రం లోనూ రెండు గ్రామాలు ఉండేవి.

రెండు గ్రామాల మేష్టర్లు లంచ్ చేసిన తర్వాత ఆయా రాష్ట్రాల పరిస్థితుల గురించి జీతభత్యాల గురించి మాట్లాడుకునేవారు.అవతల గ్రామం లో చీకటి పడితే నిశ్శబ్దమై పోతుంది. మావొయిస్టుల ప్రభావం ఎక్కువ ఆ గ్రామాల్లో.అక్కడ జరిగే కూంబింగ్ లు అవీ తట్టుకోలేక అటువైపు గిరిజనులు మన వైపు లోపలి గ్రామాల్లోకి వచ్చి గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు. అక్రమంగా గుడిసెలు వేసుకున్నారని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్ళు తొలగిస్తుంటారు. నిత్యం అక్కడ అదొక రకమైన ఘర్షణ. పేపర్ల లో ఇవన్నీ తరచూ వస్తూనే ఉంటాయి.   

 అలాంటి ఒక గ్రామం లోకి డెప్యుటేషన్ వేశారు. అక్కడున్న ఉపాధ్యాయుడు ఆరోగ్య కారణాల రీత్యా మెడికల్ లీవ్ పెట్టాడు. కనుక తాత్కాలికం గా నన్ను పంపించారు. ఆ డెప్యుటేషన్ ఆ తర్వాత మరో నాలుగేళ్ళు కొనసాగింది.కారణం ఆ మేస్టారు దుబాయ్ కి వెళ్ళిపోయారు.అక్కడ వాళ్ళ బంధువులు ఎవరో అతనికి కన్స్ట్రక్షన్ కంపెనీ లో జాబ్ ఇప్పించారట.ఉపాధ్యాయ నియామకాల్లో కూడా ఇక్కడకి ఎవరూ రాకపోవడం తో నాకు తప్పలేదు.

ఇక్కడ...ఈ స్కూల్ లో నేనే రాజు,నేనే మంత్రి. చిననల్లబల్లి నుంచి లోపలి గ్రామం లోకి సైకిల్ పై వెళ్ళేవాడిని.ఆ రోజుల్లో అటవీ ప్రాంతం మరీ ఇప్పుడంత దోపిడీ కి గురి కాలేదు.సైకిల్ మీద ఏడు మైళ్ళు తొక్కినా పెద్దగా అలసట ఉండేది కాదు.కారణం ఎత్తైన చెట్లు దగ్గర దగ్గర గా ఉండేవి, దానికి తోడు  ఇంకా రకరకాల పొదలు అవీ బాగా ఉండేవి. చల్లగా ఉండేది,వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు..!

మొత్తం కలిపి డబ్భై ఇళ్ళు ఉండేవి. అవీ ఒకే చోట కాకుండా కొన్ని గుంపులు గా ఉండేవి.పిల్లలు మొత్తం పది మంది వచ్చేవాళ్ళు.ఇంకొంతమంది ఇంట్లో చిన్నపిల్లల్ని పట్టుకోవడానికో ,పొలం పనులకో ఆగిపోయేవారు.క్రమేపి వాళ్ళు కూడా స్కూల్ కి అలవాటుబడ్డారు.వాళ్ళు చెప్పే కారణాల్లో కూడా న్యాయం ఉంది అనిపించేది.తల్లిదండ్రులు పనుల కోసం ఎప్పుడో పొద్దుట పోయి చీకటి వేళ కి వస్తుంటారు.  
   
అంత లోతట్టు గ్రామం లో కూడా ఒక తమిళ వ్యక్తి చిన్న కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. అది చూసి మతి పోయింది. ఇక్కడ ఎంత కొట్టుకున్నా మహా అయితే రోజుకి వంద రూపాయల బిజినెస్ కూడా జరగదు.అతను ఉండేది చిన్న గుడిసె లో..!అది కూడా స్థానిక గిరిజనులు తమ స్థలం లో వేసుకున్న గుడిసె ని అద్దెకిచ్చారు. ఆ కొట్టు నడిపేవాడు అతనితో పాటు హెల్పర్ లా ఇంకొకడు ఉండేవాడు.

ఆ కొట్టు మా బడికి రెండు ఫర్లాంగుల దూరం లో ఉండేది.లుంగీ కట్టుకుని అటూ ఇటూ ఆదరా బాదరా తిరుగుతూ కనిపించేవాడు.అదీ చాలా మాసిపోయి ఉండేది.అప్పుడప్పుడు బయటకి వెళ్ళేప్పుడు మాత్రం షర్ట్ వేసుకునేవాడు.చూడటానికి అనామకుడి లా ,అర్భకుడి లా ఉండేవాడు.ఒక్కోసారి నేను బడికి వస్తూండగా ఓ డొక్కు సైకిల్ వేసుకుని ఎదురయ్యేవాడు. పలకరిద్దాం అనుకునే లోగా మొహం ఎటో తిప్పుకుని చటుక్కున మాయమయ్యేవాడు.

ఇలా లాభం లేదు, ఇన్ డైరెక్ట్ మార్గం లో రావాలని నిర్ణయించుకున్నాను.బడి లో ఉన్న పిల్లాడిని తీసుకెళ్ళడానికి ఓ రోజున  పేరెంట్ వచ్చాడు. అదీ ఇదీ మాట్లాడి ఆ తర్వాత అడిగాను.

"ఏం...లక్ష్మయ్య ...? మీ గుంపు కి వెళ్ళే దారి లో తాడి చెట్ల మధ్య  ఒక చిన్న కొట్టు ఉంది గదా...అతని పేరేమిటి..?" 

"అరవాయన కొట్టు సారు. పేరు ఏదో చెప్పిండు లే గాని గుర్తు రావడం లే...ఇప్పుడెక్కడ ...అయిదారు ఏళ్ళ సంది ఇక్కడనే ఉంటన్నడు" 

"అలాగా...ఇంత చిన్న ఊళ్ళో అంత చిన్న కొట్టు తో ఏం గిట్టుబాటు అవుతుంది..?" సందేహం వ్యక్తపరిచాను.

"ఏదో రోజువారీ వాడుకొనే సామాన్లు ...అదీ కొద్ది కొద్దిగానే ఉంటయి...ఇగ అట్లనే నడుపుతాడు ...మాకు గూడా ఏదో ఒకటి అందుబాటు లో ఉంది గదాని అనుకుంటం" అన్నాడు లక్ష్మయ్య.

నాకు ఇంకా ఆసక్తి ఎక్కువయింది. ఏదో రహస్యం ఉంది అనిపించింది.అయితే స్థానికులకి కూడా అది తెలిసినట్లు లేదు. ఈ లోపు లో నా జీవితం లో ఒక ప్రధాన ఘట్టం చోటు చేసుకుంది.అదే వివాహం. సంసారాన్ని చిననల్లబల్లి లో ఉన్న మరో ఇంట్లో కి మార్చాను.చుట్టుపక్కల కొన్ని టీచర్ల కుటుంబాలు ఉండేవి గనక ఎలాంటి ఒంటరితనాన్ని ఫీలవ్వలేదు.

దుమ్ముగూడెం నుంచి వి.ఆర్.వో. మిత్రుడు కబురు పెట్టాడు. కట్టా సుబ్బారావు గారు ఊర్లోకి వచ్చారని...కొన్ని రోజుల పాటు ఉంటారని...వీలు చూసుకుని రమ్మని..!మొత్తానికి ఇన్ని రోజులకి నా నిరీక్షణ ఫలించింది.ఇంత మారుమూల ప్రాంతం లో అనేక శాస్త్రాల్లో నిష్ణాతుడైన ఓ అపురూపమైన వ్యక్తి ని చూసే అవకాశం కలిగిందని..!

ఆదివారం రోజున ఉదయాన్నే సైకిల్ పై బయలుదేరాను. కేశవపట్నం, లక్ష్మీపురం క్రాస్ రోడ్ దాటి దుమ్ముగూడెం లోకి ప్రవేశించాను.ఒక పురాతన చరిత్ర లోకి ప్రవేశించినట్లు అనిపించింది, ఎందుకో తెలియదు..!  వి.ఆర్.వో. మిత్రుని ఇంట్లో తేనీరు సేవించి , మెల్లిగా నడుచుకుంటూ బయలుదేరాము. సుబ్బారావు గారి ఇల్లు చేరువ గా వచ్చేశాము ఓ ఆరు నిముషాల్లో..! మెయిన్ రోడ్ చీలిపోయి ఒక శాఖ కుడి వేపు వెళుతుంది,ఇంకొద్దిగా లోపలికి వెళితే పెద్ద చింత చెట్టు కనిపించింది.అది ఎంత పెద్దదంటే ఇంత వరకు అంత పెద్ద చింత చెట్టు ని చూడలేదు. 
ఆ చింత చెట్టు గుబురుగా చాలా విశాలంగా ఆకాశమంతా పరుచుకున్నట్లుగా ఉంది. ఆ చెట్టు ని దాటితే సుబ్బారావు గారి ఇల్లు. పక్షులు ఆవాసం ఏర్పరుచుకున్నాయి. అవి ఎన్నో తెలియదు గాని ,కిచ కిచ మంటూ ఒకటే రొద.మిగతా శబ్దాలు ఏవీ లేవు.   

సుబ్బారావు గారి ఇంట్లోకి వెళ్ళాము. అది పాత కాలపు పెంకుటిల్లు. అయితే లోపల విశాలంగా ఉంది.ఆ ఇల్లు ఒక్కటే ఉంది.ఆ ఇంటిని ఆనుకుని వేరే ఇళ్ళు ఏమీ లేవు. ముందు హాలు గచ్చు మీద, ఓ చాప పరుచుకుని మౌనంగా కూర్చుని ఉన్నాడాయన.

మమ్మల్ని చూసి చిరునవ్వు తో స్వాగతించారు సుబ్బారావు గారు. మా మిత్రుడు,నేనూ ఆయనకి ఎదురు గా ఉన్న బెంచీ మీద కూర్చున్నాము. ఆయన కింద కూర్చోవడం,మేము బెంచీ మీద కూర్చోవడం నాకు అదోలా అనిపించి లేవబోయాను.

"ఏం ఫర్లేదు.." అంటూ చేతితో కూర్చోమని సైగ చేశారాయన. 

"ఈయన మన ప్రాంతానికి కొత్తగా టీచర్ గా వచ్చారు. మీగురించి చెప్పాను.కలుసుకోవాలని ఉందంటే మీ దగ్గరకి తీసుకొచ్చాను..!" చెప్పారు మా వి.ఆర్.వో. మిత్రులు. 
సుబ్బారావు గారి వయసు చెప్పడం కష్టమే. ఎందుకంటే ఆయన తల వెంట్రుకలు మొత్తం తెల్లగా ఉన్నాయి.మనిషి మాత్రం చూడటానికి ధృఢంగా ఉన్నాడు. శరీరం లో వృద్ధాప్యచ్ఛాయలు లేవు. కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి.ఆయన స్వరం లో ఒక జీర లాంటిది ఉండి మాటాడుతున్నప్పుడు వినే మనిషిని ఆనందపరుస్తున్నది.నేను ఇప్పటిదాకా చూసిన అందరి మనుషులకంటే చాలా భిన్నమైన వ్యక్తి.

"ఓహో...మంచిది. నేను ఓ చిన్న గ్రామీణ వైద్యుణ్ణి, నా దగ్గర ఏముంది తెలుసుకోవడానికి..?" చిన్నగా నవ్వుతూ అన్నారాయన.

"ఈ ప్రాంత చరిత్ర తెలుసుకోవాలంటే మిమ్మల్ని కలవవలసిందే అని మన వి.ఆర్.వో. మిత్రులు చెప్పారు. ఇంతకాలం మీ కోసం ఎదురుచూస్తున్నాను...నిజం చెప్పాలంటే..!" అన్నాను.

"సరే...దానిదేముంది. నాకు తెలిసింది చెబుతాను" ఆమోదించారు సుబ్బారావు గారు. సంతోషమనిపించింది.     

గొంతు సవరించుకుని ఆయన చెప్పసాగారు.

"మా ముత్తాత గారి టైం లో వ్యాపార నిమిత్తం ఇక్కడకి వచ్చాము.అప్పుడు ఈ ఊరు చాలా చాలా కళ కళ లాడుతూ ఉండేదట. డైరెక్ట్ గా ఏ వస్తువైనా రాజమండ్రి నుంచి ఇక్కడికి గోదావరి వచ్చేసేది జల రవాణా ప్రబలం గా ఉండేది ఆ రోజుల్లో..!అప్పటిదాకా ఎందుకు నాకు ఊహ ఎరిగిన తర్వాత వరకు భద్రాచలం కంటే ఈ ప్రాంతమే చాలా బిజీ గా ఉండేది.

బ్రిటీష్ వాళ్ళ కుటుంబాలు ఇక్కడి దగ్గర్లోనే ఉన్న వర్క్ షాప్ ఇంకా కొద్దిగా అవతలికి ఉండేవి.ఇప్పటికి కూడా కొన్ని శిథిలమైన బిల్డింగ్ లు ఉన్నాయి.అలాగే వాళ్ళ సమాధులు కూడా ములకపాడు అని ఆ దగ్గర్లోనే ఉన్నాయి.మనం ఇద్దరం కలిసి వెళ్ళి చూద్దాం. చెప్పినదాని కంటే అవి చూస్తే ఇంకా బావుంటాయి..!" కొద్దిగా సస్పెన్స్ లో పెట్టారు సుబ్బారావు గారు.

"సార్,వాటి మీద ఏమైనా రాసి ఉన్నాయా ..?" ఆసక్తి గా అడిగాను.

"ఉన్నాయి. వాళ్ళ సమాధులపైన చనిపోయిన వారి పేర్లు,పుట్టిన ఇంకా మరణించిన తేదీలు కూడా చెక్కారు. అయితే నేను కొన్నేళ్ళ క్రితం చూసిన దానికి ఇప్పటికీ పాడైపోయాయిట.ఎవరో అల్లరి మూక చికాకు చేశారని విన్నాను..!" బాధ గా అన్నారు.

"అలాగా...అయితే సాధ్యమైనంత త్వరగా వెళదాం సార్ , ముందు ముందు అవి కూడా మిగలవేమో" అన్నాను.

"అవును, మీరు చెప్పింది నిజం. మన జనాలకి హిస్టారికల్ సెన్స్ ఎక్కడుందని..? కనిపించినదాన్నల్లా తవ్వడమే...కింద ఏవో నిధులు దొరుకుతాయని...వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి నిధులు కొల్లగొట్టిన వాళ్ళు...మనకి నిధులు ఇవ్వాలని సమాధుల కింద పెట్టి వెళతారా...పిచ్చిగాకపొతే" ఆయన వ్యంగ్యంగా అన్నా , దాంట్లోనూ విచారం ధ్వనించింది.   

---------------------------- 5 ---------------------------

ఆ రోజు ఎందుకో పొద్దునే లేవగానే మొహం కూడా కడుక్కోకుండా పేపర్ చూశాను. గొప్ప ఆసక్తికరమైన వార్తలు ఏమీ లేవు గాని,ఓ మూలన చిన్నగా ఓ న్యూస్ ఐటెం వేశారు. అది చూడగానే నా కళ్ళు విచ్చుకున్నాయి. భద్రాచలం బస్ స్టాండ్ లో గంజాయి పట్టివేత. అది వార్త.భద్రాచలం ఈ చిననల్లబల్లి గ్రామానికి దాదాపు ముప్ఫై కిలోమీటర్లు ఉంటుంది.ఇంకా వివరం గా వార్త చదివాను.

భద్రాచలానికి దక్షిణం గా ఓ అరవై కిలోమీటర్లు ఉండే చింతూరు వైపు నుంచి ఈ గంజాయి వస్తోందిట. పోలీస్ లకు సమాచారం అందటం తో పట్టుకున్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఈ గంజాయి ని సీజ్ చేసిన వార్తలు కనీసం రెండయినా వస్తుంటాయి.కొన్నిసార్లు ఇలా బస్ స్టాండ్ లో,మరి కొన్ని సార్లు జీపుల్లో,కార్లలో ఇంకా ఇతర వాహనాల్లో వస్తుండగా సీజ్ చేస్తుంటారు.

ఈ గంజాయిని స్మగ్లింగ్ చేసే వాళ్ళ పేర్లు చూస్తే చాలా మటుకు ఉత్తరప్రదేశ్,ఒడిశా,మహరాష్ట్ర,బీహార్,కర్నాటక ఇత్యాది రాష్ట్రాలకి చెందిన వారిగా మనకు తెలుస్తుంది.ఈ పట్టుబడేది అంతా కింది వాళ్ళే.పట్టుబడే సరుకు కూడా సముద్రం లో నీటి బిందువు అని అంతా అనుకుంటూంటారు.

ఈ భద్రాచలం... పుణ్యక్షేత్రం గానే చాలామందికి తెలుసు ,కాని భౌగోళికంగా చాలా చిత్రం గా ఉంటుంది.ఇక్కడి నుంచి చట్టి అనే గ్రామం మీదుగా ప్రస్తుతం కొత్త రాష్ట్రం గా విడదీయబడిన చత్తిస్ ఘడ్ లోకి ప్రవేశించవచ్చు. కొంటా అనే ఆ గ్రామం లో తెలుగు వాళ్ళే ఎక్కువ.కాని హిందీ చదువుతూ ,రాస్తూ అక్కడ కలిసిపోయారు.తెలుగు అందరికీ వస్తుంది.

ఆ కొంటా అనే ఊరి చివరన ప్రవహించే తాల్చేర్ నది ని దాటితే చాలు,ఒడిశా రాష్ట్రం లో అడుగుపెట్టవచ్చు.మల్కాన్ గిరి జిల్లా లోని గ్రామాలు తగులుతాయి.అదిగో...అక్కడే కొన్ని వందల ఎకరాల్లో ఈ గంజాయి ని సాగు చేస్తుంటారు.అది ఒక కుటీర పరిశ్రమ. కావాలసిన వాళ్ళంతా సరుకు ని ఇక్కడకి వచ్చి వివిధమార్గాల్లో తీసుకుపోతుంటారు.అక్కడ పంట పండించి వ్యాపారం సాగించేదంతా కర్నాటక,తమిళనాడు,ఆంధ్రా కి చెందిన పెద్ద తలకాయలు.వాళ్ళు ఎప్పుడూ పట్టుబడరు.ఇదంతా నేను చెబుతున్నది కాదు,ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ న్యూస్ పోర్టల్ వెల్లడించిన సారాంశం. 

సాయంత్రం పూట గ్రామం లో ఉన్న టీచర్లమందరం ఊరి చివరన ఉన్న కల్వర్ట్ మీద సమావేశం అయ్యేవాళ్ళం. అక్కడ చర్చకు రాని అంశం అంటూ ఉండేది కాదు. అటూ ఇటూ పచ్చని పొలాలు,చక్కటి పైరగాలి.స్థానిక విషయాల నుంచి అంతర్జాతీయ విషయాల దాకా చర్చలు జరిగేవి.

మా బడి పక్కన ఉండే తమిళుడి దుఖాణం గురించి ప్రస్తావించాను. అంత లోపల గ్రామం లో ఏం లాభాలు వస్తాయని అక్కడ తెరిచాడు. నా అనుమానానికి ఇంకో మేస్టారు ఊతమిచ్చాడు.

"ఏదో పెద్ద లాభం వచ్చే పనే చేస్తున్నాడనుకుంటా, ఆ దుఖాణం బయటి జనాలకి కవరింగ్ కావచ్చు" అన్నాడాయన.

"మనిషి మాత్రం ఏదైన అడిగితే ,గలగలమని ఎక్కడ లేని నవ్వు నవ్వుతూ , ఏదో పొంతన లేని సమాధానం చెబుతూనే గబగబా ఏదో అర్జంట్ పని ఉన్నట్టు వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడూ పాత లుంగీ,పాత చొక్క వేసుకుంటాడు.అది చూసి జనాలు వీడో కోన్ కిస్కా అనుకుంటారు.కాని వాడి కళ్ళ లో ఏదో సముద్రం లో ఉన్నంత అగాధం ఉంది. సీక్రెట్ ఉంది అనిపిస్తుంది" సాలోచనగా అన్నాను.

"ఊర్లో జనాల్ని ఎంక్వెరీ చేయలేకపోయారా" అన్నాడు మరో మేస్టారు.

"చేసినా పెద్ద వివరాలేమీ తెలియలేదు.అయితే నెలకి రెండు మూడు సార్లు మాత్రం ఉన్నట్లుండి మాయమైపోతాడని తెలిసింది.ఎక్కడి కెళ్ళావు సేటు అని అడిగితే పర్ణశాల అవతల గ్రామం లో మా బావ కొట్టు పెట్టాడు ...అక్కడికి వెళ్ళాను అణ్ణా..." అంటూ తమిళ యాస లో ఇకిలిస్తూ చెబుతాడట గ్రామస్తులకి ..!" నాకు తెలిసింది చెప్పాను. 

ఒకరోజు పర్ణశాల కి సైకిల్ మీద వెళ్ళాను. అక్కడ గుళ్ళో దర్శనం చేసుకుని , సీతమ్మ వారు నార చీరలు ఆరేసుకున్న ప్రదేశం చూశాను.ఇక్కడ గోదారి చాలా వెడల్పు గా ఉంది.భద్రాచలం లో కంటే..! నీళ్ళు కూడా దూరం నుంచి నీలం రంగు లో మెరుస్తున్నట్లు అగుపిస్తుంటాయి. బోటు మీద అటూ ఇటూ తిరిగే సౌకర్యం కూడా ఉంది.అప్పటికీ కొంతమంది యాత్రికులు గోదారి పడవ లో హాయిగా విహరిస్తున్నారు.

అవతల వైపు పెద్ద గుట్టలు పచ్చదనం తో అలరిస్తున్నాయి. మణుగూరు లో హెవీ వాటర్ ప్లాంట్ కి సంబందించిన గొట్టాలు పొగ ని విడుదల చేస్తున్నాయి.చాలా అందంగా ఉందీ దృశ్యం.నిజం గా సీతారాములు వారు ఇక్కడికి వచ్చారా అంటే ఏమో తెలీదు.కాని కొన్ని నమ్మకాలు ఉంటాయి.అంతే.వాటిని అంగీకరించడం లో నష్టం ఉండదు.కాస్తంత ప్రాణానికి ఊరట...బయట ప్రపంచపు రణగొణ ధ్వని నుంచి..!

పర్ణశాల గుడి ఎత్తు లో ఉంటుంది,గోదావరి కింద నుంచి ప్రవహిస్తూంది.ఒక మాదిరి వరద వచ్చినా సరే,పైన నిలబడి చూస్తుంటే వాతావరణం గంభీరం గా ఉంటుంది.ప్రాచీన తమిళ కవి తిరువళ్ళువర్ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ధనం సంపాదించిన తరువాత ప్రపంచం ఎలా కనపడుతుందీ అంటే లోయలో ఏనుగులు పోట్లాడుకుంటుంటే ఎత్తైన ప్రదేశం మీద నిలబడి చూస్తున్నట్లుగా ఉంటుందట.

సరే...అలా ఆనందిస్తూ ఊరు చివరి లో ఉన్న స్కూల్ వైపు నడుస్తున్నాను. ఆ స్కూల్ లో ఒక ఉపాధ్యాయ మిత్రుడు ఉన్నాడు.ఎలాగు వచ్చాం గదా...కలుద్దామని..! సరిగ్గా ఆ స్కూల్ దగ్గరకి వచ్చిన తర్వాత,అల్లంతదూరాన ఎడమ వైపు చూస్తే ఓ పెద్ద జువ్వి చెట్టు ఉంది.ఆ చెట్టు కింద ఇద్దరు లుంగీలు కట్టుకున్న వ్యక్తులు సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఒకరు మా గ్రామం లో దుఖాణం పెట్టి నడుపుతున్న వ్యక్తి.నివ్వెరపోయాను.

మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాను అటువేపు..!

" ఏంటండీ సేట్ గారూ,ఇక్కడ ఉన్నారేమిటి..?" అడిగాను. అతను ఏం చెప్పాలో తెలీక తత్తరపడి,మళ్ళీ సర్దుకున్నాడు. ఈ సేటు తో ఉన్న మనిషి మొహం డీలా పడి ఎటో చూస్తున్నాడు.

"ఏం లేదు సారూ...వీడు మా బావమర్ది. ఇంట్లో పెట్టిన డబ్బులు పోయాయి..." నీరసం గా చెప్పాడు సేటు.

"ఇక్కడే ఉంటాడా తను..?" అడిగాను.అవును అన్నట్లు తలూపాడు.

"ఎంత పోయినయ్" ప్రశ్నించాను.

"అదీ...అంటే...సంథింగ్ " అన్నాడు సమాధానం గా..!

"సంథింగ్ అంటే ఎంత..? వందలా... వేలా ...లక్షలా" రెట్టించాను.

దాంతో వాడు కుక్కలా గాయ్ మంటూ బామ్మర్ది తో ఏదో కోపంగా అరవడం ప్రారంభించాడు.అవతల వాడూ ఏదో అరుస్తున్నాడు పెద్ద సౌండ్ తో. నాకు అర్ధం అయింది ,నేనడిగిన ప్రశ్న వాళ్ళిద్దరికీ మండించిందని. అయినా దాంట్లో తప్పేముందని..? మీ చావు మీరు చావండి అని  ఇవతలికి వచ్చేశాను. 

మొత్తానికి వివిధ రాష్ట్రాల్ని సందర్శించే నా ప్రాజెక్ట్ నిరవధికంగా సాగిపోతూనే ఉంది.ఈ సారి మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల్ని చూశాను.తుల్జాపూర్ అనే శక్తిక్షేత్రాన్ని దర్శించాను.కొన్ని ఊరి పేర్లని విన్నప్పుడే ఓ వైబ్రేషన్ కలుగుతుంది.వాటితో మనకి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది.

అలాంటిదే ఈ తుల్జాపూర్. బస్సు దిగి ఫ్రెష్ అప్ అయినతర్వాత గుడికి బయలుదేరాను.ఈ గుడికి రావడం వెనుక ఓ చారిత్రక కారణం కూడా ఉంది.ఇది చాలా ప్రాచీన కట్టడం.శివాజీ మహారాజు కి ఈ గుడికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది.

ఆలయ ప్రాకారాలు అవీ దిట్టంగా కోటకి వాడే పెద్ద రాళ్ళని పేర్చి కట్టారు.లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా అనిపించింది.కారణం లోపల ఉన్న పెద్ద చెట్లు మాత్రమే కాదు,మెట్ల పైనుంచి పారే నీటి జల.ఆ నీటి మీదుగా మనం గుడి లోపలికి వెళ్ళాలి.

నిరంతరం పారే నీళ్ళ వల్ల ఆ మెట్లు కొన్ని జారుతున్నాయి.మిగతా వాళ్ళ లాగా వేగంగా వెళ్ళబోయి జారిపడ్డాను.ఇంతలో ఒకాయన లేపాడు.అడుగు ఎలా వేయాలో చెప్పాడు.ఆ విధంగా జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ ఆలయ మండపం లోకి వెళ్ళాను. అది రాతి తో ఎప్పుడో కొన్ని వందల ఏళ్ళ క్రితం కట్టినదే.

స్థంబాలు ఎక్కువ ఉండి మనుషులు నిలబడటానికి స్థలం తక్కువ ఉంది,దక్షిణాది దేవాలయాల తో పోల్చితే..!కాని నిర్మాణ కౌశలం అద్భుతం.దానిలో మరో మాట లేదు. భారత దేశం లోని ఏ రాష్ట్రాన్ని చూసినా ,అక్కడి ప్రాచీన ఆలయాల నిర్మాణం లో ఓ ప్రత్యేక సౌందర్యం మాత్రమే కాదు దానికే పరిమితమైన ఆత్మ కనిపిస్తుంది.ఒక దాన్ని ఇంకోదానితో పోల్చలేము.అది ఆ కాలం లో నివసించిన విశ్వకర్మల యొక్క ఆత్మ అని చెప్పాలి.

తుల్జా పూర్ తర్వాత ఔరంగాబాద్ వెళ్ళి,అలానే పూనా ఇంకా ముంబాయి వెళ్ళాను. తిరుగుతున్న కొద్దీ దేశ స్వభావం అర్థం అవుతూ వస్తోంది. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి ఎంత ఎడం ఉన్నదో అంత దగ్గరితనం ఉన్నట్లు అనిపిస్తోంది.ముంబాయి లోపలికి ప్రవేశించగానే దాదర్ కళ్యాణ్ వద్దనుంచే ఆ నగరానికే పరిమితమైన ఓ వాసన ముక్కుపుటాలకి గుప్పున తగిలింది.ఆ తరువాత మామూలే,అలవాటైపోయింది.ఆ మినీ భారతం లో రాత్రి,పగలు వేగంగా గడిచిపోతుంటాయి.ఇన్నాళ్ళు పేపర్ల లో చూసిన ఆ తాజ్ హోటల్,అరేబియా సముద్రం... వాటిముందు నిలబడినపుడు నా పెదాలపై చిరునవ్వు మెదిలింది.

  అలా కొన్ని రోజులు మహారాష్ట్ర లో గడిపి స్వరాష్ట్రం వచ్చేశాను. కొన్ని ట్రిప్పులు కుటుంబం తో కలిపి,మరి కొన్ని ప్రయాణాలు ఒంటరిగా అని విభజించుకోవడం జరిగింది. కాబట్టి ఆ విషయం లో వేరే గొడవలు లేవు.యథాప్రకారం మా గ్రామం లోని స్కూల్ కి వెళ్ళడం మొదలెట్టాను. దసరా సెలవులు మొత్తానికి నా ప్రయాణానికి ఉపయోగపడ్డాయి.

సైకిల్ దిగి స్టాండ్ వేసి స్కూల్ లోపలికి వెళ్ళగానే పిల్లలంతా ఆనందంగా అరిచారు.మళ్ళీ సెలవుల తర్వాత కదా.వాళ్ళకీ కొత్తే,నాకూ కొత్తే. ఎన్ని నెలలు గడిచినా ఓ రోజు సెలవొస్తే చాలు మళ్ళీ స్కూల్ కి వెళ్తే కొత్త లాగే అనిపిస్తుంది. కాసేపయితే మళ్ళీ మామూలు గా పాత అయిపోతుంది.మనసు చేసే మాయాజాలం.

దేశం లోని పలు ప్రాంతాలు తిరుగుతూ నేర్చుకుంటూ మళ్ళీ ఈ మూలకి ,నా గూడు లాంటి పాఠశాలకి రాగానే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.రైల్వే స్టేషన్ లలోనూ,ఇతరత్రా ప్రదేశాల్లోనూ కొన్న ఇంగ్లీష్ నవలలు ఒక్కొక్కటి బయటకి తీసి చదువుతుంటే నా తోటి ఉపాధ్యాయులు అదోలా చూసేవారు.ఇతను నిజంగానే ఇంత పెద్ద ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాడా లేకా మన ముందు బిల్డప్పా అని చూసేవారు.

చదివిన వాటి సారాన్ని నాదైన శైలి లో రాసిపెట్టుకుని వాటి వివిధ పత్రికలకి పంపించేవాడిని. కొన్ని ప్రచురింపబడేవి. కొన్ని నా చెక్క బీరువా లో అలాగే ఉండేవి.దానివల్ల తెలుగు,ఇంగ్లీష్ లోని సాహిత్యాన్ని తులనాత్మకంగా చదివే అవకాశం కలిగింది.అలా ప్రయాణాలు నాలోని ఇంకో మనిషిని తీర్చిదిద్దాయి.  

ఆ రోజున పర్ణశాల లో కనబడ్డాడు గదా,ఈ ఊళ్ళోని దుఖాణదారుడు ... అతని గురించి ఆరా తీస్తే కొన్ని రోజులనుంచి ఎక్కడకి వెళ్ళి రాలేదని చెప్పారు. వాళ్ళ బామ్మర్ది డబ్బులు పోయాయి అని చెప్పాడు గదా,అక్కడే ఉన్నాడేమో అనుకున్నా.అతగాడి పేరేమిటో కనుక్కోవాలని ప్రయత్నించా గానీ ఎవరూ పూర్తిగా చెప్పలేకపోయారు. తంబి అని ఒకరిద్దరికి చెప్పినట్లు అన్నారు గాని అది పేరు కాదుగదా అరవం లో తమ్ముడు అని అర్థం.

ఇంత లోపల ఎంత గుంభనం గా వ్యవహరిస్తున్నాడు..! కొన్ని రోజుల తర్వాత ఆ దుఖాణం చూస్తే కూలిపోయినట్లుగా ఉంది.అది తాటాకు తో వేసిన చిన్న గుడిసె.లోపల విలువైన సామాన్లు కూడా పెద్దగా ఏమీ లేవు.ఇక రానట్లే ఆ మనిషి అనిపించింది.తను చేసేది ఏదో రహస్యమైన పని ఇక్కడ..! ఏదో అనుమానం వచ్చి ఈ ఊళ్ళోనుంచి బిచాణా ఎత్తేశాడు. నా సిక్స్త్ సెన్స్ చెప్పింది.

ఒక నెలరోజుల తర్వాత ఆ మండలానికి చెందిన ఓ న్యూస్ రిపోర్టర్ చెప్పిన వివరాలు విని నాకు మతి పోయింది. ఏ ప్రాంతం నుంచి ఏ మూలకి వచ్చి ఎంత సొమ్ము కొల్లగొట్టుకు పోయాడు..?    

    అంతేలే...తెలివైనవాడు,చురుకైనవాడు లోకం లో ఎక్కడికైనా పోయి సొమ్ము చేసుకుంటాడు. అంత దూరాన ఖండాతరాల్లో ఉన్న డచ్,పోర్చుగీస్,ఫ్రెంచ్,బ్రిటీష్ వాళ్ళు మన దేశం దాకా రాలేదూ..?మన దేశాన్ని బ్రిటీష్ వాళ్ళు ఎక్కువ కాలం పాలించడం వల్ల వాళ్ళ గురించే తప్పా మిగతా యూరోపియన్స్ గురించి మన సామాన్యజనానికి తెలిసింది తక్కువ. ఇంచుమించు ప్రతి యూరోపియన్ దేశం అలా లోకం మీదికి వెళ్ళి సామ,దాన,దండోపాయాల తో ఇతర ఖండాల్లోని దేశాల్ని కబళించి కావలసినంత మేర పిండుకున్నవే..!

స్పానిష్ వాళ్ళు దక్షిణ అమెరికా లోని దేశాల్ని ఎలా పిండుకున్నారు, బెల్జియం వాళ్ళు కాంగో లాంటి ఆఫ్రికన్ దేశాల్ని ఎలా పీల్చిపిప్పి చేశారు అని మనకి పాఠాల్ని పెడతారే తప్పా అసలు అంత తక్కువ జనాభా తో అన్ని వందల ఏళ్ళ క్రితమే ఏ విధం గా ఇతర దేశాల్ని జయించగలిగారు..అని విశదీకరిస్తూ పాఠాలు పెట్టరు.పెట్టినా అవి మొక్కుబడిగా ఉంటాయి తప్పా నిజంగా గ్రౌండ్ లెవెల్ లో పరిశోధన చేసినవి గా ఉండవు.

ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే ఆ రిపోర్టర్ చెప్పిన దానికంటే సుబ్బారావు గారింట్లో ఉన్నప్పుడు ఓ కానిస్టేబుల్ వచ్చాడు.తను ఇంకా మంచి క్లారిటీ ఇచ్చాడు. సుబ్బారావు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అతను వచ్చి కలిసి వెళుతుంటాడు.వాళ్ళ నాన్నగారికి ఈయన వైద్యం మీద గురి ఎక్కువ.ఆ చనువు తో రావు గారి ఇంటికి ,స్టేషన్ దగ్గరే కనక వచ్చి కాసేపు కూర్చుని పోతుంటాడు.

ఆ తంబి అనే ఆగంతక దుఖాణదారుని అసలు పని వేరు. ఏదో ఆ లోపల గ్రామం లో ఉండాలి కాబట్టి పైకి కనబడ్డానికి ఓ కొట్టు లాంటిది పెట్టుకున్నాడు. గ్రామానికి చివరి లో దట్టమైన అడివి మొదలవుతుంది. ఆ అడివి లో ఈ తంబి గంజాయి సాగు చేసేవాడు.బయట వాడికి ఎంతమాత్రం అనుమానం రాకుండా ..!

మొక్కలు ఎదగగానే పర్ణశాల లో ఉన్న (బామ్మర్ది అని చెప్పబడే వ్యక్తి) మనిషి కి కబురు పంపిస్తాడు.వాడు పాత వస్తువులు కొనేవాడిలాగా,ప్లాస్టిక్ కుర్చీలు అమ్మేవాడి లాగా ఈ లోపల ఉన్న గ్రామం లో ప్రవేశించి చిన్న చిన్న మూటల్లో కట్టి ఆ మోపెడ్ మీద వేసుకుని వెళ్ళిపోతాడు.ఇక అక్కడనుంచి అది చెన్నై వరకు వెళ్ళిపోతుంది.అంచెలు అంచెలుగా.

ఈ నెట్వర్క్ చాలా పెద్దది.కాకపోతే పట్టుబడినా కిందివాళ్ళు పట్టుబడతారు.లీగల్ సెల్ వాళ్ళకీ ఉంటుంది గదా.చేయవలసింది చేస్తారు.మళ్ళీ కథ మామూలే.అట్లా ఈ తంబి అనేవాడు రెండేళ్ళలో ఐదు కోట్లు వెనకేసుకు పోయాడట.ఒక్కసారి సరుకు ఇక్కడి నుంచి బయటబడితే దాని విలువ ఒక్కొసారి పది రెట్లకి పైగా పెరిగిపోతుంది.

తమిళనాడు నుంచి స్మగ్లింగ్ ద్వారా ఇతర దేశాలకి పోతుంది.కొంత దేశం లోని ఇతర ప్రాంతాలకి పోతుంది.ఆ సేలం నుంచి ఇక్కడ మన రైల్వెయ్ స్టేషన్ లో కావలసిన వాళ్ళకి పంచదార చల్లినట్లుగా డబ్బులు చల్లుతారు.ఎవరు ఆపుతారు ఇక..? సాయం చేయడమే తప్పా. అయితే అప్పుడప్పుడు భద్రాచలం లో గంజాయి సీజ్ చేసినట్లు వార్తలు పత్రికల్లో వచ్చినా ఆగినట్లయితే లేదు.    ఈ లోపు మళ్ళీ ఓ టూరు వేశాను.

 ఈసారి ఒరిస్సా రాష్ట్రం లో కి వెళ్ళి అక్కడి నుంచి వంగ రాష్ట్రం లోకి వెళ్ళాలని..! వైజాగ్ వచ్చి, అక్కడ నుంచి భువనేశ్వర్ కి ఇంటర్ ఎక్స్ ప్రెస్ టికెట్ తీసుకున్నాను.ఒడియా,ఒరియా ఈ రెండు మాటలు ఆ రాష్ట్రం లో కూడా ఉపయోగిస్తారు. ఒరిస్సా అనే పేరుని ఒడిశా గా మార్చినపుడు ఆ రాష్ట్రం లోనే ఓ సెక్షన్ వ్యతిరేకించారు. దానికి అనుకూలంగా కొన్ని వ్యాసాలు కూడా ఇంగ్లీష్ పత్రికల్లో చదివిన గుర్తు.

ఇచ్చాపురం దాటిన దగ్గర నుంచి ఒరియా గ్రామాల సంస్కృతి కనబడుతుంది. బోర్డర్ లో ఉన్న తెలుగు గ్రామాల్లో కొన్ని ఆలయాలు ఒరియా నిర్మాణశైలి లో ఉన్నాయి.ఇప్పుడంటే విడిపోయాయి గాని,ఒకప్పుడు కళింగసీమ నే గదా ఇదంతా..! "చోటో మోరో గావో" అనే సచీ రౌత్రాయ్ ఒరియా పాట మదిలో కదలాడింది.రైలు లో జనాలు ఒరియా లోనూ తెలుగు లోనూ మాట్లాడుకుంటున్నారు.తెలుగు లో మాట్లాడే వ్యక్తి ఉన్నట్లుండి ఒరియా లోనూ,ఒరియా మాటాడే వ్యక్తి వెంటనే మరో వ్యక్తి తో తెలుగు లోనూ మాట్లాడటం గమ్మత్తు గా అనిపించింది.

ఇలా తమిళనాడు రాష్ట్రం లోని గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత రైలు లో తెలుగు వినిపించేది కాదు. తమిళమే వినిపించేది.అసలు నెల్లూరు దాటుతుంటేనే తమిళసోదరులు గట్టిగా అరుచుకుంటూ వాళ్ళ భాష లో మాటాడుకుంటారు. వాళ్ళనే ఫాలో అయిపోతారు అప్పటిదాకా తెలుగు మాటాడేవారు కూడా..!       

---------------------------- 6 -----------------------------------------

అలా దేశం అంతా తిరుగుతూ మళ్ళీ నేను ఉండే చిన్న పల్లె కి వచ్చేసరికి ఓ విచిత్రానుభూతి కలిగేది. విప్ప చెట్ల మీద నుంచి,కానుగ చెట్ల మీద నుంచి వీచే చల్లని గాలులు సేద తీర్చుతున్నట్లుగా అనిపించేది. వాటి నీడలో కూర్చున్నా ఇంకా అమోఘం. సమయం తెలియదు. సావాసగాళ్ళ తో ఎంతసేపు మాటాడినా కాలం ఎంత వేగంగా కదిలేదీ తెలియదు.

విప్ప చెట్టు ని ఈ ప్రాంత ఆదివాసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరు. వారికి అది దైవం తో సమానం.చలికాలం లో పొద్దు పొడిచీపొడవకముందే కిందపడ్డ విప్ప పూవుల్ని పిల్లలు,పెద్దలు ఏరుతూవుండే దృశ్యం చూస్తే అద్భుతం గా ఉంటుంది. తాజా గా అప్పుడే కిందపడిన విప్ప పువ్వు ని పరిశీలిస్తే,సుతిమెత్తగా మొగలి పువ్వు రంగు లో రమణీయం గా ఉంటుంది. ఉండబట్టలేక వేళ్ళ తో నలిపితే చక్కటి రసం వస్తుంది. 

ఇంత సుకుమారంగా ఉండే, ఈ విప్ప పువ్వులతో కాసే సారాయి లో ఎంత నిషా..! స్వచ్ఛంగా దాని ఆవిరి నుంచి కాసే సారాయి ఇంగ్లీష్ వాళ్ళ స్కాచ్ కి ఎంత మాత్రం తీసిపోదు. కాకపోతే బయట వాళ్ళు వ్యాపార దృక్పథం తో కాసే సారాయి లో లాభాల కోసం నానారకాల కల్తీ సరుకులు కలపడం తో విప్ప సారాయి కి ఉండే అసలు లక్షణం పోతుంది. యూరపు లోని చాలా దేశాల్లో ఇంట్లోనే రై ధాన్యం తోనూ ఇంకా ఇతరత్రానూ మద్యం తయారు చేసుకుంటారు. సరే...వాళ్ళ రిసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ పద్ధతులు వల్ల అంతర్జాతీయం గా వ్యాపారాల్ని విస్తరించుకుంటారు.       

 ఒకరోజు చిననల్లబల్లి గ్రామం లోని ఓ చిన్న హోటల్ లో టీ తాగుతుండగా, ఆ టీ కొట్టు యజమాని రాజయ్య చెప్పాడు. "సార్, మిమ్మల్ని వి.ఆర్.వో. గారు దుమ్ముగూడెం రమ్మన్నారు. నిన్న ఎవరితోనో జీపు లో వెళుతూ ఆగి, మీకు చెప్పమని అన్నారు" 

"ఎందుకు రాజయ్యా...?" అడిగాను.

"అదేం చెప్పలేదు మరి" అన్నాడతను.

ఆ తెల్లారి పొద్దునే సైకిల్ వేసుకుని దుమ్ముగూడెం వెళ్ళాను. వి.ఆర్.వో.గారు ఇంట్లోనే ఉన్నారు. తీరుబాటు గా టీ అదీ కానిచ్చి ఇద్దరం కలిసి కట్టా సుబ్బారావు గారి ఇంటికి బయలు దేరాము. నిజానికి ఆయన నాకు కబురు చేసిన కారణం రావు గార్ని కలవడానికే. ఆయన కర్నాటక రాష్ట్రం నుంచి ఈ ఊళ్ళో ఉన్న పాత ఇంటికి వచ్చారు. ఆయన కుమారులు ఆ రాష్ట్రం లో వ్యాపార రీత్యా సెటిల్ అయిపోవడం తో రావు గారు కూడా అక్కడే ఉంటున్నారు.ఎప్పుడైనా ఇక్కడ నుంచి పేషంట్లు కబురుపెడితే వస్తుంటారు.అంతే.

ఆయన పేషెంట్లు చాలా అసాధారణమైన వాళ్ళు. ఎవరూ బాగుచేయలేని స్థితి కి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తుంటారు.అంటే పరమ మొండి రోగాలతో ఉన్నవాళ్ళు అన్నమాట. కొన్నిసార్లు మానసిక రోగాలతో ఉన్నవాళ్ళు,దెయ్యాలూ అవీ పట్టినవి అనుకునే వాళ్ళు ...చిత్రాతి చిత్ర రోగాలతో బాధపడే వాళ్ళందరూ చివరి ఆశ గా ఈయన దగ్గరకి వస్తుంటారు. పబ్లిసిటీ అంటూ ఏమీ ఉండదు,ఆ నోటా ఈ నోటా ఈయన గురించి విన్నవాళ్ళు ఇంకా పాత పేషెంట్లు చెప్పగా వచ్చేవాళ్ళు ...అలా ఉంటారు.   

అంతవరకు పాతబడినట్లుగా ఉండే ఆ పెంకుటిల్లు కొద్దిగా జీవం సంతరించుకుంటుంది. ఆ ఇంటి ముందు ఉండే పెద్ద పెద్ద వృక్షాలు ...వాటి మీద వాలి కిలకిల రావాలు చేసే పక్షులు ఎవరో అనుకోని అతిథి వచ్చారే అని తొంగి చూస్తుంటాయి.పాపం నిన్న మొన్న పుట్టిన వాటికేం తెలుసు,ఇక్కడ ఎంత చరిత్ర జరిగిందో.అయితే ఆ ప్రాంగణం లో ఉన్న వేప,చింత చెట్లకి తెలుసు.అవి అక్కడ జరిగిన అనేక క్రియలకి సాక్షులు. 

రావు గారి ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఓ చెట్టు నీడలో పాతకాలపు పడక కుర్చీ లో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. మమ్మల్ని చూసి,చిరునవ్వుతో ఆహ్వానించారు. మేము ఆ చెట్టు కి చుట్టూరా కట్టిన దిమ్మె మీద కూర్చున్నాం.

"లోపలికి వెళదామా " అన్నారాయన.

"లేదులెండి...ఇక్కడ చల్లని గాలి...హాయిగా ఉంది" అన్నాం ఇద్దరం.

"సారీ ...మీకు అతిథి మర్యాదలు చేయలేకపోతున్నాను. ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను... ఏదో ఉన్నన్ని రోజులు ఉడకబెట్టుకుని తింటుంటాను, అంతే " అన్నారాయన.

"మీరు వచ్చేదే అప్పుడప్పుడు...అదీ జనాలు పిలిస్తే. నాకు తెలియనిదా ...అన్నట్టు ఈ మాటు ఎన్ని రోజులు ఉంటారు" వి.ఆర్.వో గారు అడిగారు.

"ఓ పదిహేను రోజులు దాకా ఉంటాను...లోపల ఉన్న అన్ని గదుల్ని కాదు గాని ఓ గది ని మాత్రం శుభ్రం చేసుకొని ఉంటున్నాను " అన్నారాయన.

వాతావరణం పరమ నిశ్శబ్దం గా ఉంది. చుట్టుపక్కల ఇళ్ళు కూడా కొద్ది దూరం లో ఉన్నాయి.పక్షుల చేసే సవ్వడి మాత్రం ఉంది. రావు గారి ఇల్లు పెద్ద స్థలం లో ఉంది.రాత్రి పూట ఒక్కరు ఎలా ఉంటారో ఇక్కడ అనిపించింది.ఆయన మొహం లో ఒక రకమైన నెమ్మెదితనం ఉంది. అన్ని తగినంత మేరకు ఉన్న మనిషి లో ఉండే స్థిమితత్వం అది. ఎన్నో తరాల నుంచి ఆస్థిపాస్తులు ఉన్న కుటుంబం...అయితే పాతబడిన ఈ ఇల్లు కూడా గత అస్తిత్వాన్ని లీలగా తెలుపుతున్నట్లు ఉన్నది.    
కాసేపు బయట కూర్చున్న తర్వాత చిరు ఎండ మొహాల మీద పడుతుండడం తో లోపలికి వెళ్ళాము. ఇంటి లోపల అంతా పాత తరం ఫర్నీచర్ ఉంది.కొన్ని గదులు తాళం వేసున్నాయి. ఎదుటి గది లో ఉన్న చెక్క కుర్చీల్లో కూర్చున్నాము. ఇంటి పై భాగం వేపు చూస్తే మొత్తం టేకు దిమ్మెలతో తాపడం చేసి ఉంది. కింద నేల మీద ఓ చాప పరిచి ఉంది.దాని మీద ఓ దిండు ,ఓ దుప్పటి ఉన్నాయి. ఓ మూలన బొగ్గుల కుంపటి,అన్నం అవీ వండుకోవడానికి కొన్ని గిన్నెలు ఉన్నాయి.దానితో బాటు ఓ బ్యాగు ఉంది.

"ఏవిటి సార్, మీరు కిందనే చాప మీదే పడుకుంటారా, మంచం ఏమీ లేదా" అడిగాను ఆశ్చర్యంగా.

"లేదు. నేను ఇంట్లో అక్కడున్నా చాప వేసుకునే పడుకుంటాను.శరీరం లో రక్తప్రసారం చక్కగా అయి ఆరోగ్యం గా ఉండాలంటే కింద పడుకోవటం కూడా ఒక సాధనం.మన దగ్గర అనే కాదు చైనా,జపాన్ దేశాల్లో కూడా ఆర్ధిక స్థాయి తో సంబంధం లేకుండా చాలామంది నేల మీద చాప వేసుకుని పడుకోవడానికే ప్రాధాన్యమిస్తారు..!" అన్నారు రావు గారు.

"ఓహో ...అలాగా...ఎక్కడా చదివినట్లు లేదు" అన్నాను.

"మన ప్రచార సాధనాలు పశ్చిమ దేశాల గురించి చెప్పినంతగా తూర్పు దేశాల విజ్ఞానం గురించి చెప్పవు.అదీ అసలు సమస్య" నవ్వుతూ చెప్పారు.

అలా అంటూనే వి.ఆర్.వో. గారి వైపు చూశాడాయన.

"ఈ మేష్టారు కి మన ఈ దుమ్ముగూడెం మండలం లో బ్రిటిష్ వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ వాళ్ళ సమాధులు,కొన్ని ఇళ్ళు ఉన్నాయి గదా..." అంటూ చెప్పారు వి.ఆర్.వో.గారు.

"ఆసక్తి ఉన్నవాళ్ళకి తప్పకుండా చూపించాలి. ఇవ్వాళ అవకాశం ఉన్నంతదాకా మీరు తిప్పి చూపించండి.రేపు మీతో నేను కూడా వస్తా...ఆ...ఓసారి ఇలా రండి" అంటూ మమ్మల్ని ఇద్దర్నీ లోపల ఉన్న ఓ గది లోకి తీసుకువెళ్ళారు. అక్కడ రెండు చెక్క బీరువాలు ఉన్నాయి.వాటి మీద దుమ్ము ,బూజు పట్టి ఉన్నాయి.కిటికీ తెరవడం తో బాగా వెలుతురు వచ్చింది.

ఆ చెక్క బీరువాల్లో ఒకదాన్ని తెరిచారాయన. పుస్తకాలు ...చాలా పాతకాలం వి అవి.ఒకలాంటి వాసన.కొన్నిటిని నేను కూడా ఆసక్తి గా లాగి చూశాను.ఎప్పుడో వంద ఏళ్ళ క్రితం ప్రచురించిన డిక్షనరీ ఒకటి...ఇంకా పాతకాలం ఆంగ్ల రచయితల యొక్క పుస్తకాలు ...కొన్ని తెలుగు పుస్తకాలు రకరకాలవి ఉన్నాయి.కొన్ని డాక్యుమెంట్లు లాంటివి ఉన్నాయి.బీరువా లోని ఓ అర లో కుండలినీ గురించి ఎవరో సింగపూర్ రచయిత రాసిన పుస్తకం ఒకటి కనబడింది.
  
కుండలిని అని రాసి ఉన్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలించాను. రచయిత పేరు భారతీయుని లా లేదు.మొదటి సారి రచయిత పేరు ,ఆ పుస్తకం పేరు చూడడం.చాలా పాత పుస్తకం. యాభై దశకం లో వేసిన పుస్తకం.లోపల మూడవ పేజీ లో కొన్ని వివరాలు ఉన్నాయి. బహుశా వంద పేజీలు లోపులో ఉంది.

"ఈ పుస్తకం దేని గురించి ..? రచయిత పేరు ఇండియన్ లా లేదే" అడిగాను.

"అది ఒక సింగపూర్ కి చెందిన ఒక యోగా మాస్టర్ రాసింది. కుండలిని సాధన లో తన అనుభవాల గురించి రాశారు" అన్నారు రావు గారు.

"కుండలిని అంటే ఏమిటండి..ఆసనాలు అవీ వేస్తుంటారు ...అలాగా..?" 

"లేదు. వాటన్నిటికంటే పై స్థాయి.మానసిక స్థాయిల్లో జరిగే ప్రక్రియ అది" 

"మరి ఆసనాలు అవీ దేనికి..?" 

"ఆరోగ్యానికి పనికి వస్తాయని,శరీరం దృఢం గా ఉంటుందని ఈ రోజుల్లో చాలామంది వేస్తున్నారు.ఇతర దేశాల్లో అయితే మరీ పెద్ద బిజినెస్ గా అయిపోయింది" 

"పతంజలి మహర్షి ఆద్యుడని అంటారు గదా..." 

"కుండలినీ ఉన్మిలీకరణ జరిగినపుడు శరీరం తట్టుకోవడానికి ఈ హఠ యోగాసనాల్ని వేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.అది ఒక పద్ధతి.పతంజలి మహర్షి కంటే ముందునుంచే ఉన్నాయి గాని ఆయన అన్నిటిని క్రోడీకరించి పెట్టారు..."    

"కుండలిని జాగృతం అయితే ఏమి జరుగుతుంది"

"అదంతా పెద్ద సబ్జెక్ట్. మీకు అవసరం అయినపుడు ఆ మేరకు ఎలా తెలియాలో అలా తెలుస్తుంది. అన్నట్టు బ్రిటిష్ వాళ్ళ పాతబడిన బిల్డింగ్ లూ అవీ చూద్దామన్నారు గదా ఆ మధ్య. ప్రస్తుతం ఈ పుస్తకాల్ని ఇక్కడ పెట్టేద్దాం.వచ్చిన తర్వాత దీంట్లోచి కొన్ని ఏరి మీకు ఇస్తాను.చదవండి" అన్నారు రావు గారు.

ఆయన ముందు గదిలోకి వచ్చి షర్ట్ మార్చుకున్నారు.లుంగీ ని అలాగే ఉంచేసుకున్నారు.

"వి.ఆర్.వో. గారు... నేనూ,మేస్టారు అలా తెల్లవాళ్ళ సమాధులు కేసి వెళ్ళివస్తాం...మీరూ వస్తారా ?" రావు గారు అడిగారు.

"మీ ఇద్దరూ వెళ్ళిరండి..నాకు కొద్దిగా పని ఉంది" అన్నారు వి.ఆర్.వో.గారు. అలా అనేసి ఆయన బయటకి వెళ్ళిపోయారు.

ఆయన వెళ్ళిన ఓ అయిదు నిమిషాలకి నేను,రావు గారు బయలుదేరాము. దాదాపు గా ఓ అర కిమీటరు నడిచిన తర్వాత ఊరిబయట ఓ చిన్న బ్రిడ్జ్ వచ్చింది.దానికి కింద భాగం లో నీటిని కంట్రోల్ చేసే లాకులు ఉన్నాయి.అవన్నీ కూడా బ్రిటీష్ వాళ్ళ టైం లో కట్టినవే. ఆ కింది భాగం లో ఉన్న కాలి బాట మీద కి మెల్లిగా దిగాము. 

అక్కడ నుంచి ముందుకు వెళుతుంటే రెండు వేపులా చాలా ఎత్తుగా పెరిగిన వృక్షాలు మా మీద ఎండ ని పడనివ్వకుండా కాపాడుతున్నాయి. చెట్ల కింద అక్కడక్కడ కొన్ని ఎద్దులు పడుకుని తీరుబాటుగా నెమరువేసుకుంటున్నాయి. మమ్మల్ని చూసి వీళ్ళెవరు అని అడుగుతున్నట్లు మొహాలు పెట్టాయి.
 
మెల్లిగా అలా నడుచుకుంటూ వెళుతుండగా కొద్ది దూరం లో నుంచి ఓ వెలిసిపోయిన తెల్లటి బిల్డింగ్ కనబడింది. బ్రిటన్ లోని ఏదైనా కంట్రీసైడ్ లో ఉన్నామా అనే భ్రమ కలిగింది.రావు గారు నాకు ముందు గా నడుస్తున్నారు. 

"చూశారుగా ఆ బిల్డింగ్. అది బ్రిటీష్ అధికారులు ఇక్కడ స్టే చేయడానికి కట్టిన నిర్మాణం" అన్నారు రావు గారు,వేలితో చూపిస్తూ.

"ఆ కట్టిన విధానమే తెలిసిపోతోంది అది వాళ్ళ శైలి అని, సార్...ఇది కట్టి ఎన్ని ఏళ్ళు అయి ఉండచ్చు" అడిగాను.

"రమారమి వందేళ్ళ క్రితమే అయి ఉండచ్చు.లోపల ఉండే ప్లేక్ లు విరిగిపోయాయి.దానిమీద కొన్ని వివరాలు రాసివుండేవి...నేను గతం లో చూసినపుడు లోపల భాగాలు దెబ్బతిన్నాయి...మరిప్పుడు ఎలా ఉందో" అనుమానం గా అన్నారాయన.

ఆ పాత భవనం దగ్గరకి వచ్చాము. ఆ భవనం చుట్టూరా చాలా ఎత్తైనా చెట్లు ఉన్నాయి, ఆకులు గలగల లాడుతూ శబ్దం చేస్తున్నాయి. మేము ఇద్దరం కలిసి లోపలికి ప్రవేశించాము.మరో ప్రపంచం లా ఉంది. ఎదురు గది దీర్ఘ చతురస్రాకారం లో చాలా పెద్దగా ఉంది. దానికి ఆనుకుని ఉన్న మరో గది లోకి వెళితే ముందు గది కన్నా పెద్దగా ఉంది. పై కప్పు చాలా ఎత్తు లో ఉంది.కిటికీలు విశాలం గా ఉన్నాయి.గాలి,వెలుతురు బాగా వస్తున్నాయి.

ఆ గది లో ఓ ఇరవై మంది కలిసి హాయిగా మీటింగ్ పెట్టుకోవచ్చు.మనో నేత్రం గతం లోకి వెళ్ళిపోయింది.అక్కడి గది లో తివాచీలు పరిచినట్లు,దానిమీద అనేక సోఫాలు గుండ్రంగా సర్ది ఉన్నట్లు కనిపించాయి. విచిత్రంగా ఆ గదికి ఆనుకుని అటువేపు,ఇటువేపు పొడుగ్గా ఉండే గదులున్నాయి. లోపలికి గాలి రావడానికి సగం వరకు ఇనుపచువ్వలు జాలీ గా అమర్చారు.ఆ రెండవ గది ని దాటి వెళితే కిచెన్ ఇంకా స్టోర్ రూం లు కనిపించాయి.

"పైకి వెళదాం రండి,దీనికి ఇంకో అంతస్తు ఉంది " అన్నారు రావు గారు.

"మరి మెట్లు ఎక్కడున్నాయి" ప్రశ్నించాను.

"ముందు గది లోనే ఆ మూల నుంచి చెక్క మెట్లు మీరు సరిగ్గా గమనించలేదనుకుంటా.." అంటూ అటువేపు తీసుకెళ్ళారు.దుమ్మూ,ధూళి ఉందిలే గానీ పెద్దగా బూజు పట్టి లేవు గదులు.గోడ పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి.

"దీనికి కొద్ది దూరం లో ఓ చర్చ్ ఉంది. వాళ్ళకి సంబందించిన హోం ఏదో పెట్టుకున్నారిక్కడ. ఆ పిల్లలే అప్పుడప్పుడు దీన్ని శుభ్రం చేస్తుంటారు. అయితే దీంట్లో కొన్ని గదులు కూలే అవకాశం ఉందని ఇక్కడి నుంచి మార్చి వేరే చోట పెట్టారు" రావు గారు వివరించారు.

"ఎంత శిథిలావస్థ కి వచ్చినా ఇంకా కాలం తో పోరాడుతూనే ఉందీ భవనం.దీన్ని కట్టడానికి ఏం ఉపయోగించారండి" అడిగాను.

"అప్పట్లో సున్నం ఆడించి ...అంటే ఇంకా రకరకాల పదార్థాలు కలిపి ...దానితో కట్టారని చెబుతారు. ఆ సున్నాన్ని ఆడించడానికి ప్రత్యేక గ్రామాన్నే సృష్టించారు.సున్నంబట్టీ అనే పేరు తో ఇప్పటికీ ఉందది.కొద్దిగా దూరం లో ఉంటుంది" నా అనుమానాన్ని తీర్చారు రావు గారు.

చెక్క మెట్లు మెల్లిగా ఎక్కి పైకి వెళ్ళాము. డూప్లెక్స్ ఇల్లు లా అనిపించింది. ఆ రోజుల్లోనే ఇంత మారుమూల ప్రదేశం లో ఇలాంటి భవంతి ని కట్టినందుకు ఆశ్చర్యమనిపించింది. పైన కూడా గదులున్నాయి.ఆ భవంతికి మూడు వైపులా , పై అంతస్తు లో నుంచి చూడటానికి అక్కడక్కడా జాలీలు పెట్టారు.ఓ మైలు దూరం లో జరిగే దాన్ని ఇక్కడ నుంచి చక్కగా చూడవచ్చు.పై అంతస్తు లో కూడా లెట్రిన్ లు కట్టారు. టేకు కలప ని బాగా ఉపయోగించారు నిర్మాణం లో..!
     
" ఇంత భవంతి ని ఇక్కడ కట్టారు గదా...దేని నిమిత్తం అంటారు...అంటే ఎవరు ఉండేవాళ్ళు..?" అనుమానం కలిగింది నాకు.

"మా తాతగారు చెప్పిన దాని ప్రకారం ...నేవిగేషన్ కి సంబందించిన అధికారులు ఉండేవారట. పై నుంచి ఎవరైనా అధికారులు వచ్చినా ఇక్కడ ఉండేవారట...ఇది కాస్త ఫర్లేదు, అవతల కొద్ది దూరం లో అద్దాల మేడ అని ఒకటుండేది,అదయితే బాగా ధ్వంసం అయిపోయింది.మొండి గోడలు మాత్రం ఉన్నట్లు గుర్తు " చెప్పారాయన.

"అక్కడికి వెళదామా " ఉత్సాహంగా అన్నాను.

"తప్పకుండా...పదండి" అంటూ ముందుకు నడిచారు రావు గారు.అయిదు నిమిషాలు నడిచి అద్దాల మేడ దగ్గరకి వెళ్ళాము. పేరుకి అద్దాలమేడ తప్పా ఒక్క అద్దమూ కనిపించలేదక్కడ. అదే అడిగాను రావు గారి ని.

"ఆ అద్దాలన్నిటిని జనాలు పీక్కుపోయారు.ఆ బిల్డింగ్ కంటే ఇది లోపలికి ఉండటం వల్ల ఇంకా పొదలూ అవీ చుట్టూతా ఉండటం వల్లా దీని సంరక్షణ ఎవరూ చూడలేదు.దీనిమీద ఒకసారి పిడుగు కూడా పడింది.దానితో ఇదిగో ఇలా శిథిలాలు మిగిలాయి" అన్నారాయన.

అంత శిథిలమైనా నించుని ఉన్న మొండి గోడలు దాని ఒకప్పటి వైభవాన్ని చెబుతూనే ఉన్నాయి.చుట్టుపక్కల ఎలాంటి ఇళ్ళు గానీ,మనుషులు గానీ లేరు. అంతా భయంకరమైన నిశ్శబ్దం. దానిమీదట ఎప్పటి నుంచి పెరుగుతున్నాయో ఆ చెట్లు , కొన్నయితే బలమైన ఊడలు వేసుకుని కొండచిలువల్లా ఉన్నాయి. వాటికే నోరు వస్తే ఎన్ని కథలు చెబుతాయో ఇక్కడ ఒకప్పుడు నివసించిన వాళ్ళ గురించి.  

అద్దాల మేడ నుంచి వెనక్కి తిరిగి కాలిబాట గుండా ములకపాడు కి బయలుదేరాం. ఈ గ్రామం ఓ రెండు కిమీటర్లు ఉంటుంది ఇక్కడినుంచి. అయినా అలసట ఏమీ అనిపించడం లేదు.లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. దారి కి అటూ ఇటూ పులిచేరు మొక్కలు ఎక్కువ గా ఉన్నాయి. వీటి పుల్లల్ని గ్రామీణులు పళ్ళు తోముకుండానికి వాడతారు. వగరు గా ఉంటుంది వాటి రుచి.వేప పుల్ల తర్వాత పళ్ళు తోముకుండానికి వీటినే ఎక్కువ గా వాడతారు.ఔషధ గుణాలు ఉన్నాయంటారు. అదే విషయాన్ని రావు గారిని అడిగాను.

"ప్రకృతి లో ఉండే ప్రతి మొక్క మనిషికి దేనికో ఓ దానికి పనిచేస్తుంది.కాకపోతే ఏది దేనికి పనిచేస్తుందో చాలామందికి అవగాహన ఉండదు.ప్రకృతి తో మమేకం అయి బతికిన రోజుల్లో చాలా మొక్కల్ని దేనికి ఎలా ఉపయోగించాలో మనిషికి తెలిసేది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఆ జ్ఞానానికి దూరం అవుతూ వచ్చాడు. సరే...సైన్స్ నీ మనం వ్యతిరేకించకూడదు.

 అటు చూడండి తిప్పతీగె,ఉత్తరేణి మొక్కలు.ఉట్టి పిచ్చి మొక్కల్లా ఉంటాయి గాని కొన్నివాటికి అవి అమృతం లా పనిచేస్తాయి..." అన్నారాయన. రావు గారి లో ఉండే గొప్పదనం ఏమిటంటే పాతకాలం లోని , ఆధునిక కాలం లోని మంచి విషయాల్ని సమానం గా మెచ్చుకుంటారు. ఏదో సైడ్ తీసుకుని వాదన కోసమే వాదించాలని ప్రయత్నించరు.      

మొత్తానికి తారు రోడ్డు మీదికి వచ్చాము. దాన్ని అడ్డంగా దాటి ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా పొలాల మధ్య లో ఉన్న ప్రాగణం లోకి అడుగుపెట్టాము. ఇక్కడ కూడా చెట్లు పొడవు గా,దట్టం గా ఉన్నాయి.నీడ లో కొన్ని పశువులు, సేద తీర్చుకుంటూ మమ్మల్ని చూసి మొహం తిప్పుకున్నాయి. తప్పనిసరిగా ఈ చెట్ల ని ఆ రోజుల్లో విత్తింది నాటి తెల్లవాళ్ళేననిపించింది.

"ఇవి అన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు నాటినవే. వాటి నీడలో మనం ఇప్పుడు ఉన్నాం" అన్నారు రావు గారు. ఏమిటి ఈ మనిషికి ఎదుటి మనిషి మనసు ని చదివే విద్య ఏమైనా వచ్చా అని ఆశ్చర్యపోయాను. చుట్టూ ఉన్న ప్రహరీ బాగా పాతబడి అక్కడక్కడ విరిగిపోయింది.కొన్నిచోట్ల పుట్టలు పెరిగాయి. గడ్డి కూడా బాగా మొలిచింది. స్మశాన భూమి అతి ప్రశాంతం గా ఉంది. మానవ సంచారం ఎక్కడా లేదు.

సరిగ్గా మధ్య లో రమారమి రెండు అడుగుల ఎత్తు తో ఓ సమాధి నిర్మించబడి ఉంది. దగ్గరకి వెళ్ళి అక్కడ అడ్డం గా ఉన్న గడ్డిని తొలగించాను. పాలిష్డ్ రాయి ఆ సమాధి కి తాపడం చేసి ఉంది. దాని మీద ఇంగ్లీష్ లో కొన్ని అక్షరాలు కనిపించాయి. ఆసక్తి గా చదివాను. అది ఒక అమ్మాయి సమాధి. ఆ అమ్మాయి పేరు లీజా చార్లోట్. 1918 వ సంవత్సరం లో మరణించింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సరం అన్నమాట. వయసు 16 గా నమోదు చేశారు.అలాగే ఆమె తండ్రి పేరు,వివరాలు కూడా ఉన్నాయి. అతను ఇన్స్పెక్టర్ జెనెరల్ ఆఫ్ హాస్పిటల్స్,మద్రాస్ అని రాసి ఉంది.

మరి ఆ లిజా చార్లోట్ అంత చిన్న వయసు లో ఏ కారణం తో మరణించి ఉంటుందో...ఆ మద్రాస్ లో తండ్రి ఉంటే ఈ అమ్మాయి ఇక్కడ కి ఎందుకు వచ్చిందో... ఇక్కడ సమాధి ఎందుకు చేశారో ...ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. నాలో నేను రకరకాల కారణాలు ఊహించుకోసాగాను. కానీ ఈ తెల్లవాళ్ళలో ఓ లక్షణాన్ని మెచ్చుకోవాలి. ప్రతిదాన్ని సాధ్యమైనంతవరకు అక్షరబద్ధం చేస్తారు.ఈ అమ్మాయి సమాధి మీద ఉన్న రాతల్ని బట్టే గదా నాకు ఇన్నేళ్ళ చరిత్ర తెలిసింది.         

ఈ లోపులో రావు గారు మిగతా సమాధుల మీద ఉన్న దుమ్ము ధూళిని శుభ్రం చేశారు. పక్కనే పెరిగిన పొదల్ని కూడా పీకేశారు. ఇప్పుడు అక్కడ రెండు సమాధులు కనిపిస్తున్నాయి.ఇవి అంత ఎత్తుగా లేవు.వాటి మీద కూడా పాలిష్డ్ రాయి తాపడం చేశారు. కొన్ని వివరాలు చెక్కి ఉన్నాయి.ఒకదాని మీద సారా కెయిన్ అని,మరో దాని మీద డొరోతి అని ఇద్దరి ఇంగ్లీష్ స్త్రీల పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఇద్దరు ఆనాడు ఇక్కడ నెలకొల్పిన స్కూల్ కం హాస్టల్ లో టీచర్లు అని అర్ధమయింది.

"ఇక్కడ ఈ ప్రాంతం లో ఉన్న వెనుకబడిన,నిరక్ష్యరాస్య వర్గాల కోసం విద్యాసంస్థ ఒకటి నెలకొల్పి వీళ్ళిద్దరూ ఇక్కడే పనిచేసేవారట. విద్య తో బాటు కుట్లు,లేసు అల్లికలు ఇలాంటివి కూడా నేర్పేవారట.మా పెద్దలు చిన్నప్పుడు చెబుతుండగా విన్నాను.."
రావు గారు చెప్పారు.

"అలాగా...చూడండి...ఆ వైపు కి కూడా ఒక సమాధి కనిపిస్తోంది" అన్నాను. 

ఇద్దరం అక్కడికి వెళ్ళి చేతులతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేస్తే మరోటి బయటపడింది.ఆ సమాధి మీద అంగస్ అల్స్టైర్ ఫెర్నాండెజ్ అనే పేరు ఉంది. బ్రిటిష్ వారి కాలం లో భద్రాచలం ఏజెన్సీ కి స్పెషల్ ఏజెంట్ గా పనిచేశాడు. అతని క్వాలిఫికేషన్ చూస్తే ఐ.సి.ఎస్. అని రాసి ఉంది.అంటే ఇప్పటి మన ఐ.ఏ.ఎస్. అన్నమాట. మరి ఇక్కడ అతడిని సమాధి చేశారు.ఎందుకో..అర్థం కాలేదు.భద్రాచలం లో బ్రిటిష్ వారు కట్టిన సబ్ కలెక్టర్ ఆఫీస్,నివాస నిర్మాణం అన్నీ ఇప్పటికీ ఉన్నాయి.రాతి తో కట్టడం వల్ల దిట్టం గా ఉన్నాయి.ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే రావచ్చు గాక..!

కాని బ్రిటిష్ వాళ్ళ సమాధులు భద్రాచలం లో నాకు తెలిసీ ఎక్కడా లేవు. కాని రమారమి పాతిక మైళ్ళ పైగా ఉన్న ఈ మారుమూల గ్రామం లో సమాధుల్ని ,ముఖ్యం గా కేవలం బ్రిటీష్ వారి మృతదేహాల్ని ఎందుకు పాతిపెట్టి ఉంటారు...పైగా చక్కటి పాలిష్డ్ రాళ్ళు వేసి దాని పైన వాళ్ళ వివరాలు కూడా రాశారు.ప్రస్తుతం ఈ గ్రామానికి అంత ప్రాధాన్యత లేకపోవచ్చు గాని ఆ రోజుల్లో ఏదో మంచి ప్రాముఖ్యత ఉండి ఉంటుంది.లేకపోతే ప్రత్యేకంగా ఇంతవరకు తీసుకొచ్చి ఉత్తరక్రియలు చేయరు గదా.  
  ఆ ఆవరణ లో ఉన్న సమాధుల్ని ఫోటోలు తీశాను. ఎంత వాళ్ళు మనల్ని దోపిడి చేసినా ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు వదిలివెళ్ళారు. అది మనం చరిత్ర లో ఓ భాగంగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని చేతనైనత వరకు భద్ర పరచాలి.రానున్న మరియు ఇప్పుడున్న తరాలకి వీటిని తెలియపరచాలి.ఈ ప్రదేశం దాకా విదేశీయులు వచ్చారు.ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు సాగించారు.ఇప్పుడు ఇక్కడకి రావాలంటే కొంతమంది ఉద్యోగులు అమ్మో ఏజెన్సీ అంటారు. ఏదీ...ఇప్పుడు ఇంత రవాణా సౌకర్యాలు అభివృద్ది చెందిన ఈ రోజుల్లో..!మరి ఆ రోజుల్లో అంత అరణ్యం ఉండి పెద్దగా రోడ్లు లేని కాలం లో బ్రిటీష్ వాడు ఇక్కడకి వచ్చి తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. దేశం కాని దేశం లో ఈ చోట సమాధి చేయబడ్డాడు.

అతను ఒక ఉద్యోగి నే గదా. బ్రిటీష్ సామ్రాజ్యం అనే ఓ పెద్ద రథం కి ఓ చిన్న నట్టు లాంటివాడు.ఆ ప్రజల్లో అలాంటి ఒక అంకితభావం ఉన్న పౌరులు ఉన్నందువల్లనే సునాయాసం గా సగానికి పైగా ప్రపంచాన్ని పాలించారు,అంత తక్కువ జనాభా తో..!ఈ రోజున వాళ్ళు లేరు.కాని వారు నెలకొల్పిన కొన్ని వ్యవస్థలు అలానే నడుస్తున్నాయి.కొన్ని కొద్ది కొద్ది మార్పులోతో..! నేను ఫోటోలు తీసుకున్నది ఎందుకంటే ఏదైనా ఓ పత్రిక కి పంపించి న్యూస్ రాయించాలని.దానివల్ల మరింతమందికి విషయం తెలుస్తుందని. రావు గారు, నేను వచ్చిన పని చూసుకుని ఆనందంగా తిరుగుపయనం లో ఉన్నాం.

"మీకు ఓ సంఘటన చెప్పనా...? అదే...ఆ రోజుల్లో జరిగింది...ఇదంతా మా పెద్దలు చెప్పిందే" అన్నారు రావు గారు.

"అయ్యో...తప్పకుండా చెప్పండి...ఎంత వివరాలు చెబితే అంత మంచిది" అన్నాను.

"ఇక్కడ సమాధి కాబడ్డ ఫెర్నాండెజ్ గారు,ఆ రోజుల్లో భద్రాచలం లో స్పెషల్ ఏజెంట్ గా ఉండేవారు. అంటే ఇప్పటి మన సబ్ కలెక్టర్ లా అన్నమాట. మేజిస్టీరియల్ అధికారం తో పాటు పోలీస్ పవర్స్ కూడా ఉండేవి వాళ్ళకి. ఇక్కడ సమాధి కాబడ్డ ఆ ఇద్దరు బ్రిటీష్ పంతులమ్మల్ని స్థానిక జమీందార్ ఒకతను వేధిస్తూండేవాడట. వాళ్ళ విధుల్ని అంటే...ఇక్కడి స్కూల్ కం హోం పనుల్లో అడ్డుతగులుతూ ఉండేవాడట..." అంటూ అంతలోనే తనపై పైనుంచి పడిన ఎండుటాకుల్ని దులుపుకోసాగారు రావు గారు. 

"అప్పుడు ఏమయింది" ఆసక్తిగా ప్రశ్నించాను.

"వీళ్ళిద్దరూ భద్రాచలం వెళ్ళి ఆ ఫెర్నెండెజ్ గారికి విషయం అంతా వివరించారు. దానితో ఆ తెల్ల అధికారి వెంటనే ఒక ఆర్డర్ వేశాడట. 48 గంటల్లోగా ఆ జమీందార్ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని,అతనికి రావాలసిన పన్నుల్ని సేకరించడానికి తను చెప్పిన రెండు నెలల్లో మాత్రమే ఈ ఏరియా లోకి రావలసి ఉంటుందని ఆర్డర్ వేశాడుట. అంటే చూశారా...సాటి బ్రిటీష్ వాళ్ళు ఒక మాట ని చెబితే వాళ్ళ పై అధికారులు ఎంత వేగంగా స్పందిస్తారో...!" 

రావు గారి మాటలు విన్న నా మొహం లో చిరునవ్వు విరిసింది. అదీ విషయం అన్నట్లుగా ఆయన కూడా నవ్వారు.  

"మరి అంత చురుకుదనం, తెలివి ఉండబట్టే గదా మన దేశం లో అటు మొగలాయిల్ని,ఇటు స్థానిక పాలకుల్ని బురుడీ కొట్టించి సుమారు రెండు వందల ఏళ్ళు ఏలింది. మన శత్రువు నుంచి కూడా మనం నేర్చుకోవాలసిందే కొన్ని"  నా మనసు లో ఉన్న మాట బయటకి అనేశాను.

"మీరు చెప్పింది అక్షరాల నిజం మేష్టారు...మన లోపాల్ని నిష్కర్షగా ఒప్పుకున్నప్పుడే మనం ఒక దేశం గా ఎక్కడ దెబ్బ తిన్నామో తెలుస్తుంది. వాటి నుంచి గుణపాఠాల్ని కూడా మనం నేర్చుకోవాలి" అన్నారు రావు గారు. అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ దుమ్ముగూడెం గ్రామం లోకి వచ్చేశాం.

బోసు బాబు బొమ్మ పక్కనే ఉన్న రోడ్డు మీదినుంచి నడుచుకుంటూ రావు గారి ఇంట్లోకి ప్రవేశించాం. కూర్చుని ఓ రెండు గ్లాస్ లు మంచి నీళ్ళు త్రాగాను. ఆయన కూడా త్రాగేసి,లోపలికి వెళ్ళి కొన్ని పాత పుస్తకాలు తీసుకొచ్చారు. అవి ఎప్పుడు ప్రచురించినవో చెప్పడం కష్టం.కొన్ని వాటికి ముందు పేజీలు చినిగిపోయాయి.

"మేష్టారు...ఇదిగో చూడండి. ఇది కెప్టెన్ గ్లాస్ ఫోర్డ్ అనే బ్రిటీష్ అధికారి రాసిన పుస్తకం. నాకు తెలిసి ఇది ఇప్పుడు ఎక్కడా దొరకదు. రమారమి వంద ఏళ్ళ క్రితం ఈ దుమ్ముగూడెం కి అవతల ఉన్న నూగూరు వెంకటాపురం నుంచి అటు వైపు వి.ఆర్.పురం దాకా ఎన్నో సర్వేలు చేసి రాసినటువంటిది. ఆ రోజుల్లో ఏ ఏ గ్రామాల్లో ఎలాంటి సాంఘిక, వాణిజ్య,సాంస్కృతిక పరిస్థితులు ఉండేవో ఎలాంటి భూములు,పంటలు ఉండేవో చాలా పరిస్థితుల్ని కళ్ళకి గట్టినట్లుగా రాశాడు. మీరు తప్పకుండా చదవాలి దీన్ని" అంటూ రంగు వెలిసిపోయి,దుమ్ము అక్కడక్కడ అంటుకుని ఉన్న పుస్తకాన్ని నా చేతికిచ్చారు రావు గారు.

"తప్పకుండా...సరే ఆ మిగతా పుస్తకాలు ఏమిటండి...?" అడిగాను.

"ఇవి ...యోగసాధన కి సంబందించినవి... తర్వాత చదువుదురు గాని" అంటూ వాటిని తీసి కిటికీ తలుపు దగ్గర పెట్టారాయన. అలా పెట్టి కింద ఉన్న చాప మీద కూర్చున్నారు. గది లో కి కాంతి సన్నగా వస్తోంది. రావు గారి వెనక నుంచి ఏదో జీవి పాకుతూ రావడం లీలగా కనబడింది. అరే...పాము లా ఉన్నదే...పాము లా ఏమిటి...నిజం గా అది పామే. నిగ నిగ మెరుస్తోంది.

వెంటనే నేను పక్కనే ఉన్న వెదురు కర్ర తో టపా టపా అంటూ బాదేశాను ఆ పాము ని. సరిగ్గా దెబ్బలు తల మీద బలం గా తగలడం తో పాపం ఆ సర్పం చచ్చిపోయింది. అసలు నాకు అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు.  
  
చచ్చిపోయిన ఆ పాము ని అలాగే చూశాను. అది కట్ల పాము లా అనిపించింది. ఏదో తప్పు చేసిన భావన కలిగింది. అంతలోనే నన్ను నేనే సమర్థించుకున్నాను. ఒకవేళ అదే గనక రావు గార్ని కరిచి ఉంటే ఎంత ప్రమాదం..? ఆయన కి చాలా దగ్గర లోనే ఉంది. అయితే రావు గారి వదనం మాత్రం కాస్త విచారం గా అనిపించింది.

"ఎందుకు మేస్టారు కొట్టారు..? ఇక్కడ అలాంటి జీవాలు తిరుగుతూనే ఉంటాయి. వాటి జీవితం వాటిది... సరే అయినదేదో అయింది" అన్నారాయన నింపాదిగా. నాకు ఆశ్చర్యం కలిగింది. ఓ ప్రమాదం తప్పిందని నన్ను అభినందిస్తారనుకున్నాను. తీరా ఈయన ఇలా అన్నారేమిటి అనుకున్నాను. జీవహింస తప్పే గాని అది విషం ఉన్న పాము గదా అని నాలో నేను గొణుక్కున్నాను. 

"మరి నేను వెళ్ళొస్తాను రావు గారు"అంటూ లేచాను. ఆయన నాతో బాటు గేటు దాకా వచ్చారు. "అప్పుడప్పుడు వస్తూండండి.." అని చెప్పి లోనికి వెళ్ళిపోయారు. నేను మెల్లిగా అటూ ఇటూ చూసుకుంటూ బస్ స్టాప్ కి వచ్చాను.ఆ పాము ని చంపిన అలజడి ఎక్కడో మారుమూల నాలో ఏవో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక జీవి ని చంపిన విజయుడివి నువ్వు, అదే సమయం లో ఓ నిండు ప్రాణాన్ని తీసిన నీచుడివి నువ్వు అంటూ ఎవరో నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు అనుభూతి కలిగింది.    

  బస్ స్టాప్ లో కూర్చుని బోరు గా అనిపించి టీ తాగుదామని చూస్తే, చిన్న హోటల్ కనిపించింది. వెళ్ళి కూర్చుని ఓ టీ ఇవ్వండి అన్నాను. నా ముందు ఉన్న ఓ వ్యక్తి నన్ను ఓ క్షణం చూసి కొద్దిగా దూరం గా ఉన్న కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు.హోటల్ కౌంటర్ లో ఉన్న మనిషి కూడా ఏదో ఇబ్బంది గా మొహం పెట్టి అటూ ఇటూ చూస్తున్నాడు.

"టీ చాలా బాగుంది సేటు గారు" అన్నాను,ఇచ్చిన టీ గ్లాస్ ని కొద్దిగా ఖాళీ చేస్తూ. నవ్వు లాంటిది పులుముకున్నారు ఇద్దరూ తమ మొహాల మీద..! ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు గాని మొహమాటం ఏదో అడ్డువస్తున్నట్లున్నది.

"మీరు మేష్టారే కదండీ " ఉన్నట్టుండి కౌంటర్ లో ఉన్న మనిషి అడిగాడు.

"అరే...భలే కనిపెట్టారే...మీ అనుమానం నిజమే " అన్నాను.

"సుబ్బారావు గారి తో వెళుతుంటే చూశాను. మీకు ఎంత కాలం గా తెలుసండీ ఆయన" అనుమానం గా అడిగాడు.

" ఇటీవల నుంచే...ఎందుకని అలా అడిగారు?" తిరిగి ప్రశ్నించాను.

"మీకు ఆయనతో ఎందుకు మేష్టారు..? మంత్ర తంత్రాల మనిషి. కొన్ని దెయాల్ని కూడా బంధించి వాళ్ళ ఇంటి ముందు ఉన్న చింత చెట్టు కింద పాతిపెట్టాడని అంటారు" అన్నాడతను.

"నాతో ఎవరూ అనలేదే ఇంతవరకు. అయినా నాకు ఆయన అలా కనిపించలేదు" అన్నాను.

"ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికీ తెలుసండి. ఎందుకైనా మంచిదని మీకు చెప్పా...తర్వాత మీ ఇష్టం" తెగేసినట్టు చెప్పాడతను. నేను నవ్వేసి ఏ బదులూ చెప్పకుండా టీ కి డబ్బులు ఇచ్చేసి బయటపడ్డాను. బస్ రావడం తో వెంటనే ఎక్కేశాను.  
కాళ్ళు కడుక్కుని ఇంటిలోకి వెళ్ళగానే వేడి వేడిగా భోజనం వడ్డించారు ఇంట్లో..! అవీ ఇవీ లోకాభిరామాయణం ముచ్చటించుకున్నాక ఓ పావుగంట చదివానో లేదో నిద్ర ముంచుకొచ్చింది.మరి పొద్దంతా తెల్ల వాళ్ళ స్మశానాలు ,పాడుబడిన బిల్డింగ్ లు తిరిగిన అలసట ఎక్కడికి పోతుంది..? అయితే, ఒకటి... నేను తిరిగిన ఈ ప్రదేశాల గురించి మాత్రం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఎందుకని అలాంటి చోట్లకి పోవడం అని మళ్ళీ అదో టాపిక్ మొదలవుతుంది.

విచిత్రం. ఆ రాత్రి ఒక్క పీడ కల కూడా రాలేదు. అసలైతే అలాంటి ప్రదేశాలకి వెళితే వచ్చితీరాలి. అది చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పే మాట. నిజంగా ఆమే గనక జీవించి ఉంటే ఈపాటికి దిష్టి తీయడం లాంటి తంతులు కొన్ని చేసేది. తలకి స్నానం చేసిన తర్వాత బయట తిరగాడానికి వెళ్ళేప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆమె నాకు కొబ్బరినూనె రాసేది తలకి..! లేకపోతే ఏదో గాలి సోకుంతుందిరా అనేది. మరి చిన్నప్పుడు నూనె తలకి రాయడానికి అలా చెప్పేదా లేక నిజమేనా ...ఏమో దాని గురించి ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు.

పొద్దుటే భక్త హనుమాన్ గారి పటానికి దండం పెట్టుకోవడం లేదా ఆయన నామస్మరణ చేసి ఇంట్లోచి బయటకి రావడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అది తాతయ్య నేర్పిన అలవాటు. ప్రత్యేకించి పెద్ద పెద్ద పూజలు గాని ,తీర్థయాత్ర లు చేయడం అలాంటివి నాకు అంతగా ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి..! నేను తీసిన ఫోటోల్ని ఓ విలేకరి మిత్రుడికి ఇచ్చి ఒక దినపత్రిక లో వేయించాను. మండలం లో చదువుకున్న యువత కొంతమంది ఈ వార్త ని చదివి అభినందించారు. ఇంకా కొంతమంది కూడా మన చుట్టూరా ఇంత చరిత్ర ఉందా అని నివ్వెరబోయారు.       

--------------------------------- 7 ---------------------------------

ఈ లోపులో నాకు మరో గ్రామానికి ట్రాన్స్ ఫర్ అయింది. అది భద్రాచలం కి దగ్గర కావడం తో నా మకాం ని శ్రీరామక్షేత్రమైన భద్రాచలానికి మార్చాను. వచ్చీపోయే భక్తులతో ఎప్పుడూ కలకల లాడే పట్టణం ఇది. ఈ ఊరి బ్రిడ్జ్ దాటితే అవతల సారపాక. అది పారిశ్రామిక ప్రాంతం. ఆసియా లో కెల్లా అతి పెద్ద పేపర్ మిల్లు ఐటిసి పేపర్ బోర్డ్స్ అక్కడే ఉంది.దానివల్ల కూడా భద్రాచలం జనాభా పెరిగిందని చెప్పాలి. కొంత ఉపాధి కూడా ఒనగూరింది,ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగాలు..! పై పోస్టుల్లో వేరే రాష్ట్రాల వారే ఎక్కువ.

ప్రతిరోజు టివిఎస్ మోపెడ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళేవాడిని. ఈ కొత్త స్కూల్ రమారమి 13 కి.మీ. ఉంటుంది. ఎప్పుడైనా మోపెడ్ పాడయితే బస్ ఎక్కి వచ్చేవాడిని. ఇది ప్రాథమికోన్నత పాఠశాల. సీనియర్ ని కావడం వల్ల నాకే హెడ్ మాస్టర్ బాధ్యతలు ఒప్పజెప్పారు.కాబట్టి అటు ఊళ్ళో వారితోనూ,ఇటు స్టాఫ్ తోనూ చాలా సమ్యమనం తో మెలిగేవాడిని.అప్పటికీ ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినా వాటిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలిసిపోతుండేది. అసలు సమస్యలు వచ్చినప్పుడే మనిషి నిజంగా ప్రపంచం లో నేర్చుకోవడం మొదలుపెడతాడు.

వచ్చే ముందర కట్టా సుబ్బారావు గారికి చెప్పి రాలేకపోయానే అని బాధనిపించింది. సరే ఒకరోజు వెళ్ళి ఆయన్ని కలుద్దాం అనుకున్నాను. నేను పనిచేసే స్కూల్ నుంచి ఇప్పుడు దుమ్ముగూడెం కొద్దిగా దూరమైంది.భద్రాచలం నుంచి అయితే 30 కి.మీ. దూరం అయింది.ఆయన ఇచ్చిన పుస్తకాన్ని చదివాను. ఆ కెప్టెన్ గ్లాస్ ఫోర్డ్ రాసిన ఈ ప్రాంతపు చరిత్ర కొత్త ద్వారాలు తెరిచింది.వాటి గురించి కూడా రావు గారితో చర్చించాలి అనుకున్నాను. ప్రధానోపాధ్యాయుల సమావేశం మండల కేంద్రం లోని ఆఫీస్ లో జరిగినప్పుడు వి.ఆర్.వో. గారు కలిశారు.

"ఏమిటి సార్ విశేషాలు...ట్రాన్స్ ఫర్ అయ్యారని తెలిసింది. ఎలా ఉందీ కొత్త ప్రదేశం..?" అడిగారాయన.

"బాగానే ఉంది సార్. కాకపోతే అక్కడ స్టాఫ్ ఇద్దరం. ఇక్కడ అయిదుగురం. అంతే..! అన్నట్టు సుబ్బారావు గారికి,మీకూ వచ్చేప్పుడు చెప్పలేకపోయాను.క్షమించాలి..!" బదులిచ్చాను.

"ఆ ...దానిదేముంది లెండి. ఫర్లేదు ... సుబ్బారావు గారు ప్రస్తుతం ఊళ్ళో లేరు. ఏదో అర్జెంట్ పని ఉండి కర్నాటక స్టేట్ వెళ్ళిపోయారు" చెప్పారు వి.ఆర్.వో.గారు.

"ఓహ్...అలాగా..! మీకో సంగతి చెప్పనా...రావు గారి ఇంటికి వెళ్ళి తిరిగివస్తూ హోటల్ లో టీ తాగుదామని వెళ్ళా...ఆయన్ని ఒక మంత్రాలు చేసే వ్యక్తిగా కొంతమంది చెప్పారు...అదెంతవరకు నిజం...?" ఆసక్తి గా ప్రశ్నించాను. ఆయన పెద్దగా నవ్వారు.

"ఆయన గూర్చి రకరకాలుగా చెబుతారు...గ్రామాల్లో అవన్నీ సాధారణం లెండి" ఆయన దాన్ని తేలిగ్గా కొట్టిపారేశారు. వి.ఆర్.వో. గారు స్వతహగా నాస్తికులు.ఆయనిలా అంటారని ముందే ఊహించాను.      

     ప్రస్తుతం స్కూల్ లో హెడ్మాస్టర్ గా ఉండటం వల్ల అదనపు బాధ్యతలు వచ్చాయి. తాళాలు తీసిన దగ్గర నుంచి మళ్ళీ వేసే వరకు జవాబుదారి గా ఉండాలి. ఊళ్ళో వాళ్ళు గాని,బయట నుంచి వచ్చే ఏ అధికారి గాని మొట్ట మొదటిగా కలిసి ఏ విషయాన్నైనా చర్చించేది హెడ్మాస్టర్ నే. గతం స్కూల్ తో పోల్చుకుంటే ఈ ప్రాంతం లో రాజకీయ నీడలు ఎక్కువ. ఒక పార్టీకి చెందిన వారి ని కాసేపు కూర్చొబెట్టి మాట్లాడటం చేస్తే మరో పార్టీ వారు అనుమానం తో చూసేవారు. ఏదో కంప్లైంట్ పై అధికారి కి పెట్టేవాళ్ళు. మొదట్లో ఇవన్నీ తెలిసేవి కావు.

మనం మన పని చేసుకుంటూ పోతే చాలు అనుకునేవాణ్ణి. కాని అలా చేసుకుపోయినా వెనకనుంచి పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు. అందుకే హెడ్మాస్టర్ అనే వ్యక్తి బయట వాళ్ళని కూడా కొంతమందిని మచ్చిక చేసుకోవాలి. స్కూల్ కి వ్యతిరేకం గా జరిగే విషయాల్ని తెలుసుకోవడానికి...ఇలాంటివి కొన్ని అనుభవం మీద గానీ తెలియవు. గ్రామీణులకి వీళ్ళకేం తెలుసు అనుకుంటారు గానీ,గ్రామాల్లోని రాజకీయ నాయకులకి ఆ పరిసర ప్రాంతాల్లో చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలిసిపోతుంది. కార్యకర్తల నెట్ వర్క్ అలా ఉంటుంది.

వీటన్నిటికి తోడు కొంతమంది ఉపాధ్యాయ నాయకులు ఉంటారు. వీళ్ళు ఏదో పార్టీకి అనుసంధానం గా పనిచేస్తుంటారు. బయటకి మాత్రం అబ్బే మాకు అలాంటివి ఉండవు అంటూనే తమకి అనుకూలం గా లేని ఉపాధ్యాయుల్ని వేధించడానికి స్థానిక రాజకీయ నాయకత్వాన్ని వాడుకుంటారు. ఆ విధంగా వీళ్ళు తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటూంటారు. ఒక్కోసారి అసలు పొలిటీషియన్స్ కంటే వీళ్ళే ఎక్కువ డేంజరస్ అనిపిస్తారు.    

సర్పంచ్ తోనూ ఇంకా ఊళ్ళో పెద్దల్ని కలిసి మర్యాద గా మాట్లాడటం మొదలుపెట్టాను. మరీ కంప్లైంట్ చేసినట్టు కాకుండా స్కూల్ కి చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో సహకారం ఇవ్వవలసిందిగా కోరేవాడిని.ఇతర పార్టీ వాళ్ళు కలిసినా వాళ్ళకంటే ముందు విష్ చేసి మంచీ చెడూ మాటాడేవాడిని. క్రమేణా అలాంటివి అన్నీ ఫలితాలు ఇచ్చాయి.

 మనిషి కొన్నిసార్లు ఈగో చంపుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి. ఇంత పుస్తకజ్ఞానం ఉంది అనుకుంటూ పక్కవాళ్ళతో రిజర్వ్ గా ఉంటే గ్రామాల్లో నివసించేవారు దాన్ని గర్వంగా భావించి కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే కాస్త పలుకుబడి ఉన్నవాడయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

కనక సందర్భానుసారం గా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. రాబర్ట్ మేష్టారు కొన్నిసార్లు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి చాలా అనుభవం మీద చెప్పాడు మహానుభావుడు అనుకునేవాణ్ణి. రాజకీయాలు తెలియనివాడికి కూడా రాజకీయ పాఠాలు నేర్పిస్తారు గ్రామీణులు. ఆ విషయాన్ని గ్రహించి తెలివిగా మసలుకుని బయటపడేవాడే ఉత్తమ ఉపాధ్యాయుడు. 

సరే...మొత్తానికి అలా సాగిపోతోంది స్కూల్ వ్యవహారం. వరదలు వచ్చినపుడు మాత్రం కొంత ఇబ్బంది గా ఉండేది. స్కూల్ కి కొద్దిదూరం లో ఒక వాగు ఉండేది. అది అలాంటిసమయం లో మహోగ్రరూపం దాల్చేది. లోపలికి వెళ్ళనిచ్చేది కాదు.అయినప్పటికీ నేనూ మరో ఉపాధ్యాయుడు రతన్ కుమార్ ధైర్యం చేసి మొలబంటి నీళ్ళ లో ఈదుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇది చూసి జనాలు మా మీద జాలిపడేవాళ్ళు. ఇలాంటప్పుడు ఎందుకు సార్ రావడం అనేవాళ్ళు. మేము నవ్వేసి వెళ్ళిపోయేవాళ్ళం స్కూల్లోకి..!   
 
ఉండేది భద్రాచలం లో నైనా ఎప్పుడో ఓ సారి మాత్రమే గుడి కి వెళ్ళేవాడిని. నాలో నాకు అంతర్మథనం జరిగే దశ అది.దేవుడు కేవలం విగ్రహాల్లోనే ఉండాలా..? ఈ సృష్టి అంతటిని నడిపించే శక్తి ఏదో ఉంది...అయితే ఆ శక్తి ఒక విగ్రహానికి మాత్రమే ఎందుకు పరిమితం అవుతుంది. అంతటా నిండి ఉండాలి.కనక నేను నా హృదయం లో తలుచుకుంటే సరిపోదా అనిపించేది.

సాయం వేళ శ్రీ సీతారామచంద్ర స్వామి వారు రాజవీథి లో ఊరేగుతూ ప్రధాన ఆలయం నుంచి తాతగుడి వరకు వచ్చేవారు. రోడ్డుకి ఇరువేపులా ఉన్న ఇళ్ళలోని వారు ఇంకా ఇతర భక్తులు నమస్కరిస్తూ హారతులిచ్చేవారు. నేను చూస్తూ... నా ప్రమేయం లేకుండానే నమస్కరించేవాడిని. రాజవీథి గుండా చప్టా దిగువ కి వచ్చి ...ఆ మీదట గోదావరి ఒడ్డుకి చేరుకునేవాడిని.

గోదావరి లో ఏదో మహిమ ఉంది. ఆ ఇసక లో ఎక్కడికో పోయి దూరంగా కూర్చునేవాడిని. హృదయం ఉల్లాసం తో నిండిపోయేది. అస్తమిస్తున్న ఆ సూర్యుణ్ణి చూస్తుంటే ఏదో అలౌకికానందం లో తెలిపోయేది మనసు.ఎప్పుడో చదివిన కొన్ని కవితాపంక్తులు గుర్తుకు వచ్చేవి.అవి సరికొత్త రూపం దాల్చి ఎదుట నిల్చున్నట్లు తోచేది.గోదావరి కి కవిత్వానికి ఉన్న సంబంధం ఇప్పటిదా..!     

ఉన్నట్టుండి కట్టా సుబ్బారావు గారు గుర్తుకు వచ్చారు. ఆయన కుండలినీ సబ్జెక్ట్ గురించిన పుస్తకాలు ఇస్తామన్నారు. అయితే ఏదో అర్జంట్ కబురు రావడం వల్ల దుమ్ముగూడెం నుంచి కర్నాటక రాష్ట్రం వెళ్ళిపోయారని వి.ఆర్.వో.గారి వల్ల తెలిసింది. ఇదివరకు ఆయనిచ్చిన పుస్తకం ఇప్పటికే చదివేశాను. వాళ్ళ అత్తగారిది ఆ రాష్ట్రం కావడం వల్ల ఆయన అక్కడే స్థిరపడిపోయి,ఎప్పుడైనా పాత పేషెంట్లు అవసరం నిమిత్తం ఫోన్ చేస్తే వస్తుంటారని కూడా వి.ఆర్.వో.గారు తెలిపారు.

బాగా గుర్తు. ఆయన దగ్గర ఉన్న ఓ పుస్తకం లో నాడీ వ్యవస్థ గురించి వర్ణిస్తూ ఓ బొమ్మ చిత్రించి ఉంది. అది కుండలినీ జ్ఞానానికి  సంబంధించిన పుస్తకమే. వెన్నుబాము కి ఇరువైపుల నుంచి దారాల మాదిరిగా విస్తరించి పైకి కపాలం లోకి ఇంకా ఇతర అవయవాల లోకి వెళుతున్నటుగా ఉన్నది. చిన్నప్పుడు ఎప్పుడో కేంద్ర నాడీమండలం గురించి చదువుకున్నది గుర్తుకువచ్చింది.

కప్పని డిసెక్షన్ చేసినట్లుగా మానవ దేహాన్ని కూడా అలా చేసి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది గదూ అనిపించింది.అలాంటివి మెడికల్ కాలేజీ ల్లో అయితే వీలవుతుంది. ఇక్కడెలా ...అనుకుంటూ నాలో నేను నా ఊహలకి నవ్వుకున్నాను. దూరంగా చూస్తే పేపర్ బోర్డ్స్ నుంచి వచ్చే పొగ మేఘాలుగా మారి పైకిపోతోంది. వెనక్కి తిరిగి చూస్తే గోదావరి వంపు తిరుగుతూ కూనవరం వైపు వెళుతోంది. నలుదిక్కులా చూస్తే పిట్టా కూడా కనిపించడం లేదు.

వెళదామని లేచి, పేంట్ కి అంటిన ఇసుక ని దులుపుకున్నాను. మెల్లిగా నడుస్తున్నాను. అల్లంత దూరం లో శవం లాంటిది కనబడింది.దగ్గరకి వెళ్ళి చూస్తే,నిజంగా మనిషి శవమే. అప్పటికి నెల క్రితం గోదావరి వరదలు భీకరంగా వచ్చాయి.మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బహుశా ఆ సమయం లో కొట్టుకువచ్చినది అనుకుంటా.ఇసుక లో కూరుకుపోయి ఉంది ఆ శవం.కొన్ని భాగాలు కనబడడం లేదు.అయితే వెనక భాగం మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. 

నరాలు అవన్నీ వైర్ల లాగా కనబడుతున్నాయి.మాంసం చాలా వరకు చేపలు తిన్నాయేమో, ప్రధానమైన వైరు లాగా ఒకటి ఇంకా మరి కొన్ని చిన్న తాళ్ళ లాంటివి నరాలు కపాలం లోకి వెళుతూ అగుపించాయి.ఇంత దగ్గరగా మనిషి లోపలి భాగాలను చూడటం ఇదే మొదటిసారి. చాలా ఆసక్తిగా అనిపించి అలాగే పరిశీలించాను. ఏ మెడికల్ కాలేజి లోనో చూడాలనుకున్న దృశ్యం ఇక్కడ కనిపించింది. అదీ కాసేపటి క్రితం తలవని తలంపు గా అనుకోవడం ఏమిటి...ఇక్కడ ఇదేమిటి, అర్థం అవక ముందుకి సాగిపోయాను.               
 
ఇంటికి వచ్చిన తరువాత కూడా అదే దృశ్యం పదే పదే గుర్తుకు వస్తోంది.చూడాలి అనుకుని సంకల్పించినది, ఉన్నట్టుండి అలా తారసపడితే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఆ దృశ్యం కూడా ఉంది కాబట్టి నాకు అప్పుడు చూడాలనే కోరిక పుట్టిందా లేక నేను అనుకున్నాను కాబట్టి నాకు కనిపించిందా అని తర్కించుకోసాగాను. భయం వల్లనో,కంగారు వల్లనో నిన్న అంత ఎక్కువసేపు చూడలేదు.ఈరోజు సాయంత్రం ప్రయత్నిద్దాం అనుకున్నాను.

స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకుని టీ తాగి మళ్ళీ గోదావరి వైపు బయలుదేరాను.భక్తులు స్నానాలు చేసే మెట్ల రేవు వైపు దిగాను.రకరకాల భాషల్లో ఏవేవో రాష్ట్రాలకి చెందిన భక్తులు ఒడ్డు మీద జేరి మాట్లాడుకుంటున్నారు.కొంతమందు గుండు కొట్టించుకుని ఉన్నారు. ఆడ,మగ అనే బేధం లేకుండా గోదావరి నీళ్ళలో బుడుంగు మని మునిగి వస్తున్నారు.కొంతమంది ఈత కొడుతున్నారు.

రామాలయం లో నుంచి ఏదో రామదాస కీర్తన సన్నగా వినిపిస్తోంది.వీటన్నిటిని ఆస్వాదిస్తూ ఇసుక లో నడుచుకుంటూ దక్షిణ దిశ వైపు ఓ అరకిలోమీటరు నడిచాను. నిన్న శవదర్శనం అయినచోటికి. తీరా చూస్తే ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. అంతా ఇసక మయమే. ఏమయిందో అంతు చిక్కలేదు. సరే...చేసేదేమీ లేక ఇంకొద్దిగా ముందుకు నడిచి అక్కడి ఇసుక దిబ్బల మీద కూర్చుని ,గల గల ప్రవహిస్తోన్న గోదావరి ని చూడసాగాను.మనసు నిండా ఏవో ఆలోచనలు. ముందున్న గోదావరి ప్రవాహం లాగే,లోపల ఆలోచనల ప్రవాహం.

ఉన్నట్టుండి భౌ అని ఓ కుక్క అరుపు వినిపించింది. ఒళ్ళు జలదరించింది. వెనక్కి తిరిగి చూశాను. ఎక్కడో ఒడ్డు మీద నుంచి కుక్క పరిగెడుతోంది. దాని శబ్దం పక్కనే అరిచినట్లయింది...చీకటి పడుతోంది. గోదావరి మసకబారుతోంది.ప్రవాహ శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తోందిప్పుడు.కనుచూపు మేరలో ఎవరూ లేరు. లేచి నడవడం మొదలెట్టాను. ఉన్నట్టుండి ఎవరో పక్కనుండి వేగంగా వెళ్ళినట్లు అనుభూతి కలిగింది.

 బహుశా రివ్వున వీస్తున్న గాలి వల్ల అలా అనిపించి ఉండవచ్చు. నాలో నేనే జవాబిచ్చుకుని వేగంగా నడిచి ఒడ్డుకి చేరాను. శ్రీవల్లీ సహిత సుభ్రమణ్యేశ్వర స్వామి గుడి ముందుకి చేరుకున్నాను. నమస్కరించుకుని,ఆ గుడికి ముందున్న ఆంజనేయ స్వామి వారికి కూడా నమస్కరించి నా మోపెడ్ ఎక్కి ఇంటి వేపు బయలుదేరాను.

ఆ మరుసటి రోజు కూరగాయలు తెద్దామని బజారు కి నడుచుకుంటూ వెళ్ళాను. ఎందుకో గాని నా మనసు లో ఒక ఆలోచన వచ్చింది. నాలుగు ఏడు అంకెలు ఉన్న కారు నా ముందు నుంచి పోతున్నట్లు అనిపించింది.దానికి కారణం ఇదీ అని చెప్పలేను.అలా తోచింది అంతే.సరే...కూరగాయలు కొని ఆ షాపతనికి డబ్బులిచ్చి ముందుకు కదలబోతుంటే అడ్డంగా ఓ కారు వచ్చింది.రోడ్డు ఇరుకు గా ఉండటం వల్ల కొద్దిగా స్లో అయింది కారు. అనాలోచితంగా ఆ కారు వైపు కిందికి చూసి ఖంగు తిన్నాను.

ఆ కారు నెంబరు 7777. అరే ఇందాక ఈ నెంబర్ గురించి నా మనసు లో అనుకున్నాను గదా. నోట మాటరాలేదు.ఏమి జరుగుతోంది..? ఇది ఏ కారణం వల్ల జరుగుతోంది...అర్థం కాలేదు. మళ్ళీ అదే సాయంత్రం ఇంకో విచిత్రం. కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాను. ఉన్నట్టుండి ఎప్పుడో పదవ తరగతి చదివిన వెంకటేశ్వర్లు గుర్తుకు వచ్చాడు. హైస్కూల్ అయిపోయిన తర్వాత వాడిని కలిసింది లేదు.కానీ ఆ రోజుల్లో ఇద్దరం కలిసి తెగ సినిమాలు చూసేవాళ్ళం. ఆ సన్నివేశాలు గుర్తొచ్చి నవ్వుకున్నాను.

ట్రింగ్ ...ట్రింగ్ ...అంటూ ఫోన్ మోగింది. లేచి రిసీవర్ తీసి "హలో...ఎవరు"  అన్నాను.

" నా పేరు వెంకటేశ్వర్లు. మనం పదో తరగతి కలిసి చదివాం...గుర్తుందా...నీ నెంబర్, ప్రసాద్ ఇచ్చాడు.నువ్వూ,తనూ బి.ఈడి.లో క్లాస్ మేట్స్ అట గదా...భద్రాచలం గుడి కి వస్తున్నా రేపు...కలుద్దామా " అన్నాడు అవతలి నుంచి. నా గుండెలు గుభేలుమన్నాయి. వాడు ఫోన్ చేయబోతున్నాడు కాబట్టి అది నాకు ముందు మనసు లో మెదిలిందా లేదా నేను అనుకోవడం వల్ల వాడు ఫోన్ చేశాడా...? ఏమి జరుగుతోంది.మతి పోయినంత పనయింది.

"సరే...రేపు రా...కలుద్దాం" అన్నాను పొడిపొడిగా.       

ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు మీద నడుస్తున్నాను. ఇడ్లీ బండి కనిపించింది.ఈ తమిళం వాళ్ళు చేసిన చెట్నీ కోసమైన తినాల్సిందే.ఓ ప్లేట్ ఇడ్లీ ఇమ్మన్నాను. బడ్డీ దగ్గర ఇద్దరు ముగ్గురు అక్కడక్కడ ఉన్నారు.ఏవో మాటాడుకుంటున్నారు. ఇంతలో ఇడ్లీ వచ్చింది,తింటున్నాను.

అంతలో ఓ వ్యక్తి తన పక్కనున్న వాడితో నా అనుభవాల గురించి చెబుతున్నాడు. వాడికి నా విషయాలు ఎలా తెలిసినవి..? అవి నేను ఎవరికీ చెప్పలేదే...వెంకటేశ్వర్లు అనే వాడి ఫ్రెండ్ అనుకోకుండా వాడికి ఫోన్ చేశాడట, నాలుగు ఏడు లు వచ్చేలా కారు నెంబర్ తీసుకున్నానని,గోదావరి దగ్గర ఆ ఇసుకు మీద తిరుగుతుంటే ఆ హాయి వేరు గా ఉంటుందని ఇలా చెబుతున్నాడు.

ఆ చెప్పేవాడి మొహం లోకి కాసేపు అలాగే చూశాను. వాడు పక్కనున్న వాడితో మామూలు గానే మాటాడుతున్నాడు. ఇంకొకడిని ఆట పట్టించడానికి చెబుతున్నట్లుగా లేదు.నాలో ఏదో తెలియని అలజడి మొదలయింది.ఏదో జరుగుతోంది.అది ఏమిటో అర్థం కావట్లేదు.ఇదివరకు ఎప్పుడు అనుభవం కానిదిది.ఎక్కడ కూడా చదవలేదు.

దీని గురించి బయటకి ఎవరికైనా చెబితే నీకు పేరా నోయా,స్కిజొఫ్రెనియా లక్షణాలు ఉన్నాయంటారు. వాటిగురించి కొన్ని పుస్తకాల్లో చదివాను.సిగ్మండ్ ఫ్రాయిడ్,కారల్ జంగ్,విలియం జేంస్,అబ్రహాం మాస్లో లాంటి మానసికవేత్తల పుస్తకాలు అప్పటికి చదివి ఉన్నాను. వాటి వెలుగు లో ఈ స్థితి ని అవగాహన జేసుకోవడానికి ప్రయత్నించసాగాను.    

ప్రతిరోజు ఇదే విధం గా ఏదో జరగడం మొదలుపెట్టింది. అంతా అతీంద్రియం. ఏ విధంగా ఆలోచించినా కారణం అందేది కాదు. కొన్నిసార్లు భయం గానూ, కొన్నిసార్లు ఆసక్తి గానూ తోచేది. ఆ రోజుల్లో దుమ్ముగూడెం దగ్గర్లో ఉన్న సమాధుల్ని దగ్గర నుంచి చూశాను.వాటిని ముట్టుకోవడం,ఫోటో తీయడం చేశాను. ఆ దాపుల్లోనే ఉన్న పాత బిల్డింగ్స్ లోపల అంతా ...అక్కడ సొంత ఇల్లు లా తిరిగాను. ఆ విధంగా చేయడం వల్ల ఆనాటి ఆత్మలకి కోపం వచ్చి ఇలా పీడిస్తున్నాయా అనే అనుమానం తొలిచింది.

అయినా అప్పటి బ్రిటీష్ వాళ్ళ ఆత్మలు ఇంకా అక్కడే తిరుగుతుంటాయా...ఎక్కడో ఓ చోట జన్మ తీసుకుని ఉండవా...ఇలా పరిపరి విధాలా ఆలోచనలు సాగుతున్నాయి. ఒకవేళ దాని ప్రభావం అయితే మరి ఇంత కాలం ఏమీ కాలేదే...కనీసం ఒక్క పీడ కల గాని రాలేదే. ఎక్కడికి వెళ్ళినా ఎవరో నన్ను ఉద్దేశించినట్లు మాటాడినట్లు అనిపించేది.తీరా ఆ మాటాడిన వారిని పరిశీలిస్తే వాళ్ళు వాళ్ళ మానాన ఏదో మాటాడినట్లు అనిపించేది తప్పా నన్ను అఫెండ్ చేయాలని కాదని కూడా తోచేది.

భరించలేని మానసిక ఘర్షణ.ఎవరికీ చెప్పుకోలేని స్థితి.ఇంతకంటే నరకం ఎక్కడా ఉండదు. ఒక్కో రాత్రి ఈ ఆలోచనలతోనే మంచం మీద కి చేరేవాడిని. లోపల పురుగులు తొలిచినట్లు ఏవో ఆలోచనలు సాగుతుండేవి. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ లోనుంచి వెలుతురు కనిపించేది. బయటకి వచ్చి చూస్తే సూర్యదర్శనం. ఏమిటి ఇంత తొందరగా తెల్లారిపోయిందా అనిపించేది. కళ్ళు నొప్పిగా అనిపించేవి. ఆలోచనలు తప్పా... నిద్ర లేక పోవడం చేత...! ఎంత నిద్ర పోదామని ప్రయత్నించినా నిద్ర వచ్చేది.

దేనిమీదా ఆసక్తి లేకుండా పోయింది. నడుస్తున్న శవం లా ఉంది పరిస్థితి. ఇంట్లో నా భార్య ని వాళ్ళ పుట్టింటివారు తీసుకుపోయారు. మరీ ఒంటరిగా అయిపోయింది. ఇంట్లో మిగిలిన వృద్ధ మాతృమూర్తి తప్పా ఎవరి తో ఏమీ మాటాడలేని పరిస్థితి. ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఏదో లా ఉంటున్నావు మనిషివి అంటూ మా అమ్మ తరచి తరచి అడిగేది. నన్ను విసిగించకు అంటూ ఏమి చెప్పకుండా వెళ్ళిపోయేవాడిని.

ప్రతిరోజూ ఈ నరకం ని భరించేకంటే ఒక్కసారిగా ఈ ప్రాణం పోతే అసలు ఏ బాధ ఉండదు. అన్ని ఆలోచనల నుంచి,ఈ మానసిక చిత్రహింస నుంచి విముక్తి లభిస్తుంది. అలా ఆత్మహత్య గురించి ఆలోచించడం మొదలుపెట్టాను.ఒక్క సారి ధైర్యం చేస్తే శాశ్వత విముక్తి.అన్నిటి నుంచి...! పిరికివాడు ఆత్మహత్య చేసుకుంటాడు అని బయట జనాలు అంటారు గాని, అసలు కనుచూపు మేర లో ఒక సమస్యకి పరిష్కారం లేదు అనుకున్నప్పుడే మనిషి చివరి చర్య గా ఆ పని చేస్తాడు.

నేను పోయిన తర్వాత ఈ ప్రపంచం ఆగిపోతుందా...లేదు. ఎవరు పోయినా ఆగదు. బాగా కావలసిన వాళ్ళు,అదీ ఎంతో ప్రేమించినవాళ్ళు...కొన్ని రోజులు బాధపడవచ్చును. ఆ తరవాత కాలమే ఆ బాధ ని మానుపుతుంది. ముసురుకుంటున్న ఆలోచనలు తల ని వేడెక్కిస్తున్నాయి. ఒక్క మారు శరీరం కేసి చూసుకున్నా,ఇన్ని రోజులు ఎన్నో అనుభూతులు ఇచ్చావు. మిత్రమా ...నువ్వు మట్టిలో కాలిపోతావో...లేక అగ్ని కి ఆహుతి అవుతావో ...ఏమో నాకు కూడా తెలీదు. అవును నా పిచ్చిగాని...బొంది లో ఉన్న ఈ ప్రాణం అనబడే  విద్యుత్ కట్ అయినతర్వాత రోడ్డు మీద లారీ గుద్దితే అడ్డంగా పడివున్న ఆ వీథికుక్క బాడీ కి, మనిషి బాడీ కి తేడా ఏమిటి. ఎవరూ తియ్యకపోతే రెండూ మట్టిలో మట్టిగా కలిసిపోతాయి.  

బయటకి వెళ్ళాను. బ్లేడు కొన్నాను. ఆ తర్వాత నా రూము లోకి వచ్చాను. ఆ బ్లేడు తో మణికట్టు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలి.అది నా ప్లాన్.అసలు అంత తెగువ నాకెలా వచ్చింది.ఏమో తెలీదు.చిన్న రాయి చెప్పులో పడితే దాన్ని తీసేదాకా విల విల లాడేవాడిని.మరి ఇంత రక్తపాతం అయినా సరే చావాలని ఎలా నిర్ణయించుకున్నాను..? ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది,నా మానసిక వేదన అంత స్థాయి లో ఉందన్నమాట. ఎంత బాధ నైనా తట్టుకుని ముందు ఈ స్థితి నుంచి బయటపడాలి.అదొక్కటే మనసు లో ...అది తప్పా మరొకటి లేదు.

ఎడమ చేతి మణికట్టు ని కోసుకున్నా.రక్తం చిమ్మింది. ధారలై పారుతున్న్నది. ఇక కొద్దిగా ఆపాను.మెల్లిగా పోతుంది రక్తం. పోనీ...అలాగే...కొద్ది కొద్దిగా అంతా... లోపల ఉన్న రక్తం...అంతా పోనీ...చివరకి ఈ ప్రాణం పోనీ. అలా ఈ నరకం నుంచి విముక్తి కలగనీ. అలా ధ్యానిస్తూ పడుకున్నా ...ఎంత హాయిగా ...శాంతి గా ...ఉందీ ఈ ప్రాణం పోతుందన్న అనుభూతి. ఎక్కడెక్కడి విషయాలూ గుర్తుకువస్తున్నాయి. బాల్యం నుంచి ఇప్పటిదాకా పొందిన తీపి జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయి. ఇలాంటి వాటిని అన్నింటినీ ఈ లోకం లో విడిచిపెట్టి ...ఎక్కడికో వెళ్ళబోతున్నా.  

ఏంటి...ఇంత సమయం తీసుకుంటున్నది.చావు కూడా అంత తొందరగా రావడం లేదే.ఇంకా స్పృహ లో నే ఉన్నాను.లేదు ...ఇంతసేపా...ఒసే మొండి ప్రాణమా...ఇంకానా...పో ఈ శరీరం నుంచి త్వరగా పో...విముక్తి పొందు...ఎక్కడికి పోతావో తెలీదు...ఇక్కడ మాత్రం ఉండకు. నాలో నేనే మాట్లాడుతున్నాను.ఏదీ ..ఇంకా పోదే...ఈ శరీరం ఇంత గట్టిదా...ఏమైంది దీనికి...రక్తం ధార ఎక్కడ నో గడ్డ కట్టినట్టుంది...నీకు ఇలా కాదు,ఈ పీక చూడు ...ఎవరో చెప్పినట్లయింది. వెంటనే కంఠం చుట్టూ బ్లేడ్ తో గట్టిగా గీరాను.అక్కడా రక్తం బయటకి వచ్చింది.

వెచ్చగా కారుతున్నది. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ అలాగే ఉన్నాను. చావు కొరకు ఎదురు చూస్తూ..! కళ్ళు మూసుకుని గోడకి ఆనుకుని కూర్చున్నాను.ఇంతలో తలుపు ని ఎవరో దబదబ బాదారు.అవతల నుంచి మా అమ్మ. తలుపు తియ్యి అంటూ గట్టిగా అరిచింది. నేను ఇంత రక్తం కార్చే పని చేస్తానని ఎంతమాత్రం ఆమె ఊహించి ఉండదు. అయితే కొన్ని రోజులుగా డల్ గా ఉన్నదాన్ని బట్టి ఆమె నా అనారోగ్యాన్ని ఊహించి ఉండవచ్చు.

ఎందుకో తెలియదు,వెంటనే లేచి తలుపు తెరిచాను. నా కంఠం దగ్గర నుంచి,చేతి నుంచి కారే రక్తం ని చూసి ఆమె ఒక్కసారిగా బిత్తరపోయింది. గొల్లుమన్నది. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రి కి తీసుకువెళ్ళింది.మొత్తానికి డాక్టర్లు నా ప్రాణాన్ని కాపాడారు. ఎందుకు నన్ను కాపాడారు...అని గట్టిగా అరవాలని ఉన్నా ఓపిక లేక అలాగే పడుకున్నా.మళ్ళీ ఏం చేసుకుంటానో అని ఆమె నన్ను కనిపెట్టుకుని ఉండేది.  

దేని గురించి ఆలోచించడం లేదు. వాన కురిసి వెలిసిపోయింట్టు ఉంది. డాక్టర్ రాసిన మాత్రలు ,మందులు వేసుకుంటున్నాను. మనిషిని ఉరికించి పడవేసేదీ కాలమే,మళ్ళీ మెల్లిగా స్వాంతన చేకూర్చేదీ కాలమే.కొన్ని రోజులు పూర్తిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాను. నెమ్మిదించిన తర్వాత బయటకి వెళ్ళడం ప్రారంభించాను. ఒక రోజున మిత్రుడు ఒకాయన కనిపించి ఓ పుస్తకం నాకు ఇచ్చి చదవమన్నాడు. ఎన్నో రకాల పుస్తకాల్ని ఇప్పటిదాకా చదివాను. అటు పశ్చిమ దేశ రచయితలవి,ఇటు తూర్పు దేశ రచయితలవి. ఇప్పుడు ఇది చదవాలా..?! సరే...అన్నాను ముక్తసరిగా..!

ఇంటికి వచ్చి మంచి నీళ్ళు తాగి కుర్చీలో కూలబడ్డాను. కాసేపు అలాగే కళ్ళు మూసుకున్నాను. నేను తీసుకొచ్చిన పుస్తకం గుర్తుకు వచ్చింది. చేతిలోకి తీసుకుని,అన్యాపదేశం గా ఏదో పేజీ తీసి చదవసాగాను. ఆ పేజీ లో ఉన్న రెండు లైన్లు చదవగానే కరెంట్ షాక్ కొట్టినట్లయింది. మళ్ళీ చదివాను. మళ్ళీ మళ్ళీ...చదివాను.ఒంట్లో ఏదో నూతన శక్తి ప్రవేశించింది. ఆ వాక్యాల్లోంచి అది ప్రవహించింది.శరీరం లోని ప్రతి అణువు లోనూ అది నిక్షిప్తమైన అనుభూతి కలిగింది. 

   ఆ వాక్యాల్లోని అంతరార్థం ఇది. వేర్ అవుట్ దేన్ రస్ట్ అవుట్ ...అంటే ఏదీ చేయకుండా తుప్పు పట్టి పాడవడం కంటే ఏదో పని చేస్తూ మరణించడం మంచిది.అవును...జీవిత సారం అతి చిన్న మాటలో ఎంత అందంగా,ఎంత శక్తివంతం గా చెప్పారు. నిజం...నేను ఎందుకు చావాలి. ఎంత కష్టమైన దాన్ని ఎదుర్కుంటూ ఆ క్రమం లో చస్తాను తప్పా నాకై నేను ఆత్మాహత్యా యత్నం చేయనుగాక చేయను. నాలో సంకల్పం పాదుకుంది. అతి కొత్తగా...నా మనసు లో ఏదో జరుగుతోంది.

ఇంతకీ ఎవరిదీ పుస్తకం అని అట్ట చూశాను. పుస్తకం పేరు "ప్రాక్టికల్ వేదాంత", స్వామి వివేకానంద యొక్క రచన. శ్రీరామకృష్ణ పరమహంస గారి శిష్యుడు. ఇద్దరి పేర్లు విని ఉన్నాను గాని వారి గురించి తెలుసుకున్నది తక్కువ. ఇక వరసబెట్టి ఆయన కంప్లీట్ వర్క్స్ అన్నీ చదివాను.మహేద్రనాథ్ గుప్తా గారు రాసిన కథామృతం చదివాను. కొత్త కిటికీలు తెరుచుకున్నాయి.స్వామి వివేకానంద అనగానే చాలామంది చికాగో లో హిందూ ధర్మం గురించి ప్రచారం చేశారని,గొప్ప దేశభక్తులు,సంఘసంస్కర్త ఇలా అనుకుంటారు గాని ఆయన లో బయటకి ప్రచారం కాని అంశాలు అనేకం ఉన్నాయి.

ఇప్పుడు బయట నుంచి వినబడే ఏ మాటలూ, ఎవరి మాటలూ నన్ను బాధించడం లేదు. కొన్నిసార్లు విని చిరునవ్వు తో వాటిని తిరస్కరిస్తున్నాను.ఇదంతా అప్రయత్నంగా జరిగిపోతోంది. ఆరోగ్యం బాగా కుదుటబడింది. దాదాపుగా రెండు నెలలబాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు.లాస్ ఆఫ్ పే పెట్టేశాను. అసలు ఇంత రక్తాన్ని కార్చింది నేనేనా..అని నాకే సందేహం వచ్చేది ఒక్కోసారి. మణికట్టు పైన,గొంతు పైన గల గాయాలు తగ్గాయి. కాని ఆ గుర్తులు మాత్రం అలాగే ఉన్నాయి.జీవితం కొనసాగుతూనే ఉంది.

ఎందుకో గోదావరి వైపు గాలి మళ్ళింది. ఒకసారి అటువెళ్ళాలని అనిపించింది. నా కాళ్ళు అప్రయత్నం గా అటు సాగిపోతున్నాయి.చప్టా దిగువ మీదుగా, నడుచుకుంటూ వెళుతున్నాను.యాత్రికులు ఎదురవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో భద్రాద్రి రాముడిని దర్శించుకోవడానికి..! గోదావరి లో స్నానం చేసి వస్తున్నారు. గుడి వైపు వెళ్ళడానికి..! నేను గోదావరి లోని ఇసుక లో సేద తీరడానికి వెళుతున్నాను.

మెట్లు దిగి గోదావరి లో స్నానించే మనుషుల్ని చూసుకుంటూ ఆ చివరి కంటా సాగిపోతున్నాను. ఓ అరమైలు నడిచాను. అంతటా పరమ నిశ్శబ్దం గా ఉంది. సాయం వేళ... ప్రవహిస్తూన్న గోదావరి ని తదేకంగా చూస్తూ ఓ మనిషి ఇసుక లో కూర్చుని ఉన్నాడు. ఇంత చివరకి ఒంటరి గా కూర్చున్నాడు, ఎవరబ్బా అనుకుంటూ ముందుకు వెళ్ళాను. ఆ వ్యక్తి నన్ను చూసి చిన్నగా నవ్వాడు. ఆయన ఓ సన్యాసి అని అర్థం అయింది. జటాజూటాలు ...కుడి చేతికి ఓ వైపున చిన్న త్రిశూలం ...దాపునే ఉన్న ఇసుక లో పాతి ఉంది.    

ఆయనకి కొద్ది దూరం లో కూర్చున్నాను. తను నాకేసి ఓ మారు మళ్ళీ చూసి ఏం మాట్లాడకుండా అటు వేపు తిరిగి నదీప్రవాహాన్ని తదేకంగా గమనిస్తున్నాడు. రెండు నిముషాలు గడిచాయి. నేనే చివరకి చొరవ తీసుకుని, నమస్కారం స్వామి అన్నాను. ఆ మాట ఎందుకో చాలా కొత్తగా అనిపించింది. అదివరకెన్నడూ నేను ఇలాంటి స్వామీజీ లని ఎప్పుడూ పలకరించింది లేదు. నా వైపు అలాగే కాసేపు చూసి ,తన చూపుడు వేలితో ప్రవహించే గోదావరి ని చూపించాడు.

"కాలం కూడా అలా ప్రవహిస్తూ ముందుకు పోతూనే ఉంటుంది. మళ్ళీ వెనక్కి రాదు. జరిగినదాన్నే పట్టుకుని బాధపడకు. ప్రతిదీ ఒకందుకు,కొన్ని మార్పులు నిమిత్తం జరుగుతుంది..!" అన్నాడాయన నిగూఢంగా. ఎవరిని ఉద్దేశించి ఏం మాటాడుతున్నాడీయన. ప్రశ్నార్థకంగా చూశాను.

"అంటే ...మీరంటున్నదీ..." అడగబోయి ఊరుకున్నాను.

"సుబ్బారావు గారిని మీరు కలిసింది ...పూర్వ జన్మల సంస్కారం వల్లనే" తాపీ గా చెప్పాడాయన. నాకు బాంబు పేలినట్టయింది. ఈయనకి ఆ విషయాలన్ని ఎలా తెలుసు..?!

"స్వామీ... మీరు ఎక్కడనుంచి వచ్చారిక్కడికి...తెలుసుకోవచ్చా ...నా సంగతులు మీకు ఎలా తెలుసు..?" ఆసక్తి గా అడిగాను.

"నేను హిమాలయాల నుంచి బయలు దేరి...దేశం లోని పుణ్యస్థలాలను దర్శిస్తూ తిరుగుతున్నాను, ఆ క్రమం లోనే ఇక్కడికి వచ్చాను. మీరు నేనూ కూర్చున్న ఈ గోదావరి ఒడ్డున గతం లో ఎందరో తపశ్శక్తిసంపన్నులు కూర్చున్నారు. తపమాచరించారు. తెలిసినవారికి తెలుస్తుంది "  నిర్వేదంగా సమాధానమిచ్చాడు.    

  నా గతాన్ని అంత చక్కగా తెలుసుకున్నాడంటే ఈయన ఎవరో సిద్ధపురుషుడు అనే ఆలోచన కలిగింది. ఎందరో మహానుభావులు ఇలా అనామకంగా తమ పనులు చేసుకుపోతుంటారు. ఎలాంటి ప్రచారం అదీ లేకుండా. ఒకానొకప్పుడు భద్రాచలం లో కొన్ని దశాబ్దాల క్రితం సాధువుల మండపం అని ఓ పాత భవనం ఉండేది. 

ఇప్పుడు కళ్యాణం జరిగే మండపానికి వెనక వైపు ఉండేది. దాంట్లో ఎప్పుడూ ఎవరో సాధువులు కనిపించేవారు,ముఖ్యంగా దేశాటనం చేస్తూ ఇక్కడకి వచ్చినవాళ్ళు. మధ్యలో హోమగుండం ఇంకా త్రిశూలం లాంటివి చూసిన గుర్తు. ఒకసారి చిన్నప్పుడు ఎందుకో ఆ చోటికి వెళ్ళిన గుర్తు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తారు...అని అనుకునేవాడిని.  

ప్రస్తుతం కొంచెం అవగాహన కలిగింది. ఇలా దేశాటనం చేసే సాధుసజ్జనుల కోసం ఆనాడు ఎవరో దాత నిర్మించి ఉంటారు. ఈ మహానుభావుడి గురించి కొద్దిగా తెలుసుకోవాలనిపించింది.సన్యాసులు వారి గతం గురించి చెప్పరని ఎక్కడో చదివిన గుర్తు.అయినా ప్రయత్నిద్దాం అనుకున్నాను.

"స్వామీ, మీరు ఏమీ అనుకోకపోతే తమరి పేరు ఏమిటి...అసలు ఏ ఊరు మీది " మర్యాదగా ప్రశ్నించాను.

"నా పూర్వ నామం బయ్యారెడ్డి...మాది కడప జిల్లా ...సన్యసించి చాలా కాలం అయింది. అయినా ఇవన్నీ మేం చెప్పకూడదు కాని మిమ్మల్ని చూస్తే చెప్పాలనిపించింది.ఇహ ఇంతకుమించి నా గతం గురించి అడగవద్దు" అన్నాడాయన. ఇంకా ఏదో అడగాలని అనిపించినా వద్దులే అని సముదాయించుకున్నాను.

"మీరు ఇలా ఒంటరిగా తిరుగుతుంటారు గదా...భయం అనిపించదా" నా అనుమానం ని ఆయన ముందుంచాను.

"దేనికి భయపడాలి..? ఎక్కడకి వెళ్ళినా పంచభూతాలే గదా ఉన్నదీ" నవ్వాడాయన. ఎంత సూక్ష్మంగా చెప్పాడీ మహానుభావుడు. 

"ఎందుకని నా జీవితం లో ఎవరికీ లేని ఈ వింత అనుభవాలు...దానివల్ల చెప్పలేనంత వేదన సంభవించాయి" నా అంతరంగాన్ని బహిర్గతం చేశాను. అప్పటికే ఆయన నా జీవితాన్ని చదివినట్టుగా ఓ విషయాన్ని చెప్పాడు. ఇక దాయటానికి ఏముంది..!

"ప్రతి అనుభవానికి ఓ అర్థం ఉంటుంది. మీకు కలిగిన అనుభవాలు ...మీ పూర్వ జన్మ వాసనల వల్ల కలిగాయి. గత జన్మ లో చేసిన కుండలినీ యోగ సాధన ...కొనసాగించే ప్రక్రియ లో భాగం గానే ఇవన్నీ జరిగాయి. మీరు ఆ సుబ్బారావు గారిని కలవడం...అక్కడ ఆయనతో కుండలినీ గురించి ప్రస్తావించడం..!" అద్దం లో చూసినట్టుగా చెబుతున్నాడీయన. నివ్వెరబోయాను.

"మరి నేను అంత చిత్రహింస అనుభవించాను మానసికంగా..." ఏదో చెప్పబోయాను.

"మనిషి విపరీతమైన బాధ కి లోనయిపుడే తన లోపలికి దృష్టి సారిస్తాడు.అది ఒక్కొక్కరికి ఒక్కోలా జరుగుతుంది...అవి కొన్ని బయటకి చెప్పడానికి కూడా భాష చాలదు...ఎవరి అనుభవం వారిదే. మీ రాక లోని ఆంతర్యాన్ని సుబ్బారావు అనే ఆ సాధకుడు గ్రహించాడు. మీ లోని కుండలినీ ప్రక్రియ వేగవంతం కావాలని మిమ్మల్ని ఆశీర్వదించాడు. అది నేటికి కార్యరూపం దాల్చి కొద్దిగా కదలడం తో మీ లోపలి ప్రపంచం అంతా అతలాకుతలం అయింది. కొత్త లోకాల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళింది..." 

"మరి స్వామీ...రకరకాల భ్రాంతులు ఎందుకు కలిగాయి...నేను అనుకున్న మాటలు ...ఎదుటి మనుషుల నోళ్ళ లోనుంచి రావడం...అలాగే...ఏవైతే దృశ్యాలు కనిపించాయో ...అవన్నీ ముందుగానే నాలో స్ఫురించడం ఇలాంటివి అన్నీ..." 

" మనకి కనిపించే ఇంకా కనిపించని ప్రపంచం అంతా ఒకటే పదార్థం నుంచి వచ్చింది. నేను,నువ్వు ,అతను అని గానీ...నిన్న,నేడు,రేపు అని గాని ఏమీ లేదు. ఈ జగన్నాటకం లో అన్నీ పాత్రలే...అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు సృష్టి కారణం తెలుస్తుంది.ఎవరూ ఎప్పుడూ పుట్టలేదు,మరణించలేదు అని ఇదంతా పరమాత్మ యొక్క లీలా వినోదమని అర్థమవుతుంది. మీకు ముందుగా కనిపించినవి,వినిపించినవి అంటున్నారే...అవన్నీ చిన్న చిన్న మెరుపులు లాంటివి... గత జన్మ లో చేసిన సాధనల వల్ల అవి కలిగాయి..."

"మీరు చెప్పేవి కొన్ని అర్థమవుతున్నాయి. కొన్ని నాకు తికమక గా ఉన్నాయి స్వామీ" 

"సాధన లో కి వెళ్ళినపుడు అన్నీ క్రమేపీ అర్థమవుతాయి.ఇవన్నీ చాలా సావధానం గా జరిగేవి. కొందరికి కొన్నేళ్ళు తీసుకోవచ్చు,కొందరికి కొన్ని జన్మలు తీసుకోవచ్చు...కంగారు వద్దు..."   

" ఇపుడు నేను ఏం చేయాలి, పూజలు పునస్కారాలూ లాంటివి"

"ఆ మెట్లు అన్నీ గత జన్మ లోనే దాటేశారు. ఇక అవసరం లేదు. ప్రతిరోజు కాసేపు ప్రాణాయామం చేసి, తర్వాత ధ్యానం చేస్తూండండి. చాలు. ఆ తర్వాత ఎప్పుడు ఏది చేయాలో కొంతమంది గురువుల కృప వల్ల మీకే తెలుస్తుంది.దాని గురించి బెంగ వద్దు...కలకత్తా వెళ్ళి బేలూరు మఠం లో ధ్యానించండి...మీ గత జన్మ మీకు గుర్తుకు వస్తుంది..!" అన్నాడాయన.

"మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎలా స్వామీ" గౌరవంగా అడిగాను.

"నన్ను కలవ వలసిన అవసరం మీకు ఇక ఏర్పడదు" అని ఆయన ఇసుక లోనుంచి లేచాడు. ఆయనకి నమస్కారం చేసి నేను కూడా సెలవు తీసుకున్నాను. ఆ తర్వాత గోదావరి తీరానికి వెళ్ళినపుడు ఆ మహాత్ముడు ఇక ఎప్పుడు నాకు కనబడలేదు. కాని ఆయన నా జీవితం లో ఓ ముఖ్యమైన ఘట్టం లా మిగిలిపోయాడు.
 
ఆ తర్వాత గతం లో ఎదురైన భ్రాంతి దర్శనాలు తగ్గిపోయాయి. నాలో నీరసం,భయం పూర్తిగా తొలగిపోయాయి. ప్రతి నిమిషం ఏదో ఆనందం...ఉత్సాహం. ఒక్కోసారి జరగబోయేవి ముందు అనిపించినా,కనిపించినా నా పెదవులపై ఓ చిరునవ్వు కదిలి మాయమయ్యేది. ఈ విశాలమైన ప్రపంచం రకరకాల పాత్రల తో నా ముందు జీవిస్తున్నట్లు కనిపించేది.

ఉద్యోగం లో జాయిన్ అయ్యాను. ఒకరోజు స్కూల్ లో ఉండగా ద గాస్పెల్ ఆఫ్ శ్రీ రామకృష్ణ అనే లావుపాటి ఇంగ్లీష్ పుస్తకాన్ని చూశాను. ఎక్కడా...ఒకరోజున పిల్లలకి క్విజ్ పోటీ పెట్టడానికి ఓ స్వఛ్చంద సంస్థ వాళ్ళు వచ్చారు. గెలిచిన వాళ్ళకి వివేకానంద స్వామి వారి రచనల్ని బహుమతి గా ఇచ్చారు. అవి కాకుండా స్కూల్ కి ప్రత్యేకంగా ఆ లావుపాటి పుస్తకాన్ని ఇచ్చారు.   


------------------------------- 8 -----------------------------------------

ద గాస్పెల్ ఆఫ్ శ్రీ రామక్రిష్ణ అనే పుస్తకం రమారమి వెయ్యి పేజీలకి పైగా ఉన్న పుస్తకం. మహేంద్రనాథ్ గుప్తా అనే రామకృష్ణుల వారి గృహస్థ శిష్యుడు తన గురువు గారి బోధనలని అన్నిటినీ దీనిలో పొందుపరిచాడు. ప్రతిరోజు ఏదో సమయం లో ఆయనకి చేరువ గా ఉంటూ ఆయన జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఆ పుస్తకాన్ని రాశాడాయన. దాన్ని చదువుతూండేవాడిని.

అది కేవలం రామకృష్ణుల వారి జీవితం మీద రాయబడినది మాత్రమే కాదు. అంతకి మించి చాలా ఉన్నది.బ్రిటీష్ వారి హయాం లో కలకత్తా నగరం ఎలా ఉండేది,అప్పటి బెంగాలీ ప్రజల సాంఘిక,సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేది కూడా తెలుస్తుంది. తన ప్రత్యక్ష శిష్యులతో,బయట ప్రజలతో రామకృష్ణులు ఎలా వ్యవహరించేవారు ,ఏం మాట్లాడేవారు పూసగుచ్చినట్లుగా విపులంగా వర్ణించారు మహేంద్ర నాథ్ గుప్తా గారు. ఓ విద్యాలయం లో ప్రిన్సిపాల్ గా ఉన్న ఆయన కృషి అజరామరం గా నిలిచిపోయింది. 

ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్ర సేన్ ఇలాంటి లబ్ద ప్రతిష్టులు ఇంకా అనేక రంగాలకి చెందిన బెంగాలీ ప్రముఖులు మనకి ఈ పుస్తకం లో దర్శనమిస్తారు. వాళ్ళతో రకరకాల అభిప్రాయాలు ...చర్చించుకోవడాలు ...అలా ఆ కాలం లోకి వెళ్ళిపోతాము.బలరాం బోస్ ఇంట్లోనూ,గిరీష్ ఘోష్ అనే నటుడి సాంగత్యం లోనూ,నాస్తికుడైన డాక్టర్ సర్కార్ తోనూ, బాఘ్ బజార్ లోనూ ఎన్నో అనుభవాలను పొందుతాము.ఇక దక్షిణేశ్వర్ గురించి చెప్పేది ఏముంది... ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోగాలకు నెలవు. చాలా చిన్న చిన్న మాటల్లో జటిలమైన సత్యాల్ని రామకృష్ణులు వారి శిష్యులకు ఇంకా ఇతరులకు బోధించారు.      
     
 ఆధ్యాత్మికంగా వచ్చే ఎన్నో సందేహాల్ని ఆ పుస్తకం నుంచి నివృత్తి చేసుకున్నాను. నిజానికి ఆధ్యాత్మికం,లౌకిక జీవితం వేరు కాదు.రెండూ ఒకదానికొకటి ప్రభావితమౌతూంటాయి. ప్రతి మనిషి జీవితం లోనూ అవి రెండూ ఉంటాయి.కాని వాటి విలువని గుర్తించే తీరిక ఉండదు.తీరిక అని కూడా కాదు.ప్రతి దానికి ఓ సమయం ఉంటుంది. అది సమీపించేవరకూ మన పక్కనున్నది మనకే కనిపించదు.

ప్రాణాయామం చేస్తూన్నాను. అలాగే ధ్యానం కూడా..! మనసు కి ఏదో విముక్తి దొరికిన అనుభూతి.శరీరం లో కూడా మార్పు వచ్చింది.స్వరం లోనూ మార్పు వచ్చింది.నా ఆలోచనా విధానం లోనూ మార్పు వచ్చింది.అంతా అలవోకగా జరిగిపోతూంది. నిజమైన ఆర్తి మొదలైనపుడు దాహం తీర్చడానికి ఎవరో మహానుభావులు మనకి తారసపడుతుంటారు. అపుడు గోదావరీ తీరం దగ్గర ఆ స్వామీజీ...! ఇపుడు నాకు అవసరమైన ప్రతిదీ నావద్ద కి ఎవరో పంపిస్తున్నట్లు వస్తున్నాయి. అవి పుస్తకాలు గానీ,మనుషులు గానీ. ఇంకా సంఘటనలు గానీ..!

ధ్యానం లో ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు లభిస్తున్నాయి. ఇదొక విచిత్ర లోకం.మనం దీనిలోకి అడుగు పెడితే తప్పా ఈ అనుభవాలసారం అర్థం కాదు. మాటల్లో ఏమీ లేదు. బోలుతనం తప్పా అని తోచేది.అవసరానికి మించి మాట్లాడటం బాగా తగ్గిపోయింది.ఇది ఇలా ఉండగా శంకరం గారు అనే ఓ పెద్దాయన మిత్రుడు సురేంద్ర ద్వారా పరిచయం అయ్యాడు. నా కంటే వయసు లో ఇరవై ఏళ్ళు పెద్ద. ఎంతో అనుభవం ఉన్న సాధకుడు. ఆయన ధ్యానం గురించి ఇంకా రకరకాల మార్మిక విషయాల గురించి చెప్పేవారు.
   
గోదావరి తీరం దగ్గర జరిగిన అనుభం గురించి ఆయనకి తెలిపాను.

 "సాధన లో పురోగమింపజేయడానికి అనేకమంది మహానుభావులు అలా కలుస్తుంటారు. ఆయన చెప్పినట్లుగానే కలకత్తా వెళ్ళి దక్షిణేశ్వర్ ని,బేలూరు ఆశ్రమాన్ని దర్శించండి. సాధన లో కలిగే అనుభవాల్ని కూడా అందరికీ వెల్లడి చేయకూడదు.అలా చేయడం వల్ల నష్టం కలుగుతుంది" అన్నారు శంకరం గారు.

"మీరు చెప్పిన విధంగానే శ్రీరామకృష్ణ పరమహంస కూడా ఓ చోట అన్నారు.అలా ఎందువల్లనంటారు..?" ఆసక్తి గా అడిగాను.

"సాధనలో వచ్చే అనుభవాలు బయట వినేవారికి తలా తోకా లేనట్లుగా ఉంటాయి.ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికీ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆలోచించలేరు. అది వాళ్ళ లోపం కాదు. ప్రకృతి రహస్యాలు అర్థం చేసుకునే సమయం ఒక్కొక్కరికి ఒక్కో దశ లో వస్తుంది" టూకీగా చెప్పారు.  

   మనం అనుకున్నప్పుడు కొన్ని జరగవు. ఎదురుచూడని సమయం లో అకస్మాత్తుగా కొన్ని మిస్టీరియస్ విషయాలు జరుగుతాయి.అవి నూతన ద్వారాలు తెరిచి సాధన పట్ల నమ్మకం కలిగేలా చేస్తాయి.ఆ తర్వాత కొన్ని నెలలు లేదా ఏళ్ళు ఎలాంటి అనుభవాలు కలగకపోవచ్చును.ఇది ఒక ప్రయాణం.అంతకు ముందు పోని తలాల వైపు సాగే ప్రయాణం.దీనిలో ఎవరికి వారే ఒంటరి.ఎవరి దారి వాళ్ళది.సహ ప్రయాణీకులు ఏవైనా సలహాలు ఇవ్వవచ్చునేమో గాని,మనతో బాటు రాలేరు.

ఒకరోజు ధ్యానం ముగించి కిటీకి ముందు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాను.అప్పుడు సాయంత్రం సరిగ్గా ఏడు గంటలు అవుతోంది.శీతాకాలం అవడం వల్ల తొందరగానే పొద్దుపోయింది. నా ముందు ఉన్న కిటికీ మూసి ఉంది.అయినా అవతల వస్తువులు కనబడుతూనే ఉంటాయి. ఉన్నట్టుండి ఏదో ఓ రూపం అస్పష్టంగా గోచరించింది. అలాగే చూశాను...ఎవరైనా వచ్చినవారు పిలుస్తారేమోనని...అలాంటిది ఏమీ లేదు. రూపురేఖలు స్పష్టంగా లేవు గాని ఒక వెలుతురు మనిషి రూపం లో ఉన్నట్లుగా తోచింది.

భయం వేయలేదు ... ఆశ్చర్యం కలిగింది. అలాగే చూస్తూండగా,ఆ వెలుతురు రూపం లో ఉన్న ఆకారం తన చేతిని ముందుకు చాచింది.ఇప్పుడు అరచేయి చాలా స్పష్టంగా కనిపించింది. టాటా చెప్పినట్లుగా చెయ్యి ఊపింది. వెంటనే నేను లేచి కిటికీ అవతలకి వెళ్ళాను.ఎవరో చూద్దామని. విచిత్రం ఎవరూ లేరు. ఒక్క పిట్ట అలికిడి కూడా లేదు.మళ్ళీ నేను గది లోకి వచ్చి కూర్చున్నాను. ఆ ఆకారం కనబడుతుందేమోనని చూశాను. ఎంతసేపు చూసినా కనబడలేదు.

ఆ మరునాడు కూడా చూశాను. నాకు నిరాశే ఎదురయింది. ఆ తర్వాత ఎన్నో రోజులు అదే స్థానం లో కూర్చుని అదే ప్రదేశం వేపు చూశాను. మళ్ళీ నాకు ఎప్పుడూ ఆ అనుభవం కాలేదు. ఈ విషయం ఎవరకి చెప్పినా చిలవలు పలవలైపోయి ఏ వార్త బయటకి వస్తుందో తెలియదు. కనక ఆ విషయాన్ని నాలోనే దాచుకున్నాను.శంకరం గారు కలిసినపుడు ఈ ఘటన ని ప్రస్తావించాను. ఆయన ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసివేశారు. 

"ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. సాధన లో ముందుకు పోతున్నపుడు ఇలాంటి సంఘటనలు సహజం గానే జరుగుతుంటాయి.మన గురుపరంపర కి సంబంధించిన శక్తులు గాని లేదా ఒక్కోసారి ఆటంకపరిచే ఇతర శక్తులు గాని అనేక రూపాల్లో ఎదురవుతాయి. వాటికి ఎలాంటి ప్రాధాన్యత నివ్వకుండా మీ దారి లో మీరు వెళ్ళండి, వాటివల్ల ప్రమాదం ఏమీ లేదు" అన్నారాయన.  

మళ్ళీ ప్రయాణాల్లోకి మళ్ళే దశ వచ్చింది. కన్యాకుమారి కి వెళ్ళి అక్కడ వివేకానందస్వామి కూర్చుని ధ్యానించిన రాక్ మీద కాసేపయినా కూర్చోవాలి అనిపించింది. ఆ తర్వాత కలకత్తా వెళ్ళి దక్షిణేశ్వరం,బేలూరు మఠాలు దర్శించాలి. నా లోపలి ప్రణాళిక అలా రూపుదిద్దుకుంది. కన్యాకుమారి చూస్తే దేశానికి దక్షిణం లో, ఇటు కలకత్తా చూస్తే దేశానికి తూర్పు వైపు. సంకల్పించిన మనసు ముందుకు పోతూనే ఉంది. ఇంతంత దూరాలు ఒంటరిగా ఎందుకు...అనేవాళ్ళు కొంతమంది మిత్రులు.

అనుభవించవలసిన నరకప్రాయాపు కష్టాలన్నీ అనుభవించాను. ఇంతకంటే ఏముంటుంది. ఈ శరీరం అంత తొందరగా పోయేది కాదు.ఇంకా రాసిపెట్టి ఉంది.ఇది చేయవలసిన పనులు మిగిలే ఉన్నాయి.అంతదాకా దీనికి ఏమీ కాదు. చావు వైపు ప్రయాణించి మళ్ళీ జీవితం లోకి వచ్చినవాడిని. ఇక భయపడటానికి ఏముంది.ఒకవేళ పోయినా ఒక ప్రయత్నం చేస్తూ దానిలో అరిగిపోయినంత సుఖమూ,తృప్తీ దేనిలోనూ ఉండదు. Worn out than rust out. వివేకానందుని ఆ మాటలే నిరంతరమూ నాలో ధ్వనిస్తూండేవి.

మొత్తానికి ఓ శుభోదయాన చెన్నై, ఎగ్మోర్ స్టేషన్  లో దిగి  ఒకరోజు ఉన్నాను.డైరెక్ట్ గా కన్యాకుమారి వెళ్ళే రైలు లో రిజర్వేషన్ దొరకలేదు. మిగతా స్టేషన్ లతో పోల్చితే సమాచారం దొరకడం గానీ,క్యూ లో నిల్చుని టికెట్ తీసుకోవడం గానీ ఈ నగరం లో చాలా ఈజీ. గతం లో నేను తిరిగిన రాష్ట్రాలతో పోల్చితే అలా అనిపించింది. రిజర్వేషన్ కౌంటర్ ఉన్న బిల్డింగ్ కి కాస్తా ముందుకి వస్తే అక్కడ చాలా ఇంగ్లీష్ నవలలు కుప్పలుగా పోసి అమ్ముతున్నారు.

 అయితే అవి కొత్తగానే కనిపిస్తున్నాయి,సెకండ్ హేండ్ అయినా..! కొన్ని పుస్తకాలు కొన్నాను.      
నాగర్ కోయిల్ మీదుగా కన్యాకుమారి చేరుకున్నాను. స్టేషన్ నుంచి సముద్రం దగ్గరకి వచ్చి అక్కడకి చేరువ లో ఉన్న ఓ లాడ్జ్ లో దిగాను. ఆ చుట్టుపక్కల వాతావరణం చాలా కోలాహలం గా ఉంది. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన స్వదేశీయులే గాక, విదేశీయులు కూడా బాగా కనిపిస్తున్నారు. స్నానం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత హాయిగా అనిపించింది. బయటకి వచ్చి లైట్ గా టిఫిన్ చేశాను. కాసేపు ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ తిరిగి సముద్రం ఒడ్డు దగ్గరకి వచ్చాను.

హిందూ మహాసముద్రం బ్లూ రంగు లో ఆహ్లాదంగా ఉంది. ఎగిసిపడే అలలు. ఎక్కడో దూరంగా అల మొదలై తీరానికి వస్తుంటే అలాగే చూడా లనిపిస్తుంది.ఎంత దూరం చూసినా ...ఎటు చూసినా నీళ్ళే.అవతల తీరం కనబడదు. సముద్రం ఒక్కొసారి ఊగుతున్నట్లుగా ఉంటుంది...పైకి కిందికి ఊగే అలలతో. ఎక్కువసేపు సముద్రాన్ని చూసినా ఏదో తెలియని భీతి గొలుపుతుంది.మరి ఇలాంటి సముద్రాల మీద కొన్ని వందల ఏళ్ళ క్రితమే చోళులు దక్షిణాసియా లోని దేశాలకి వెళ్ళారు. ఆ తర్వాత మన దేశం వచ్చిన యూరోపియన్ల గురించి చెప్పేదేముంది..?

      కన్యాకుమారి లో ఉన్న రాక్ మెమోరియల్ పై ఆనాడు ఏక్ నాథ్ రనడే అనబడే మహానుభావుడి చొరవ తో వివేకానందుల వారి స్మృతి నిలయం వెలిసింది. ఎందరో యాత్రికులు... దేశవిదేశీయులు. ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నారు. తీరం వద్దనున్న ఫెర్రీ ఎక్కి నేను కూడా ఆ రాక్ వద్దకి చేరుకున్నాను. ఫెర్రీ సముద్రజలాల్లో రమారమి పది నిమిషాల పైనే సాగింది. ఆ రోజున ఆ మహానుభావుడు అమెరికా లోని సర్వమత మహాసభ కి వెళ్ళబోతూ ఇంత దూరం ఈ నీళ్ళ లో ఈతకొట్టి ఆ రాక్ మీదికి చేరుకోవడం గుర్తుకి వచ్చి ఒళ్ళు పులకించింది. 

కాసేపు ఆ రాక్ మీదినుంచి సముద్ర సౌందర్యం తిలకించాను. అద్భుతం. నోటితో వర్ణించలేము ఆ అనుభూతి.కొద్దిసేపు గడిచిన తర్వాత జనాలు కొద్దిగా పలచబడ్డారు. ఆ గుడి లోని మహా తపస్విని దర్శించుకుని,కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాను. మనసు కి కొత్త ఉత్సాహం వచ్చింది. అలౌకిక ఆనంద పారవశ్యం ఎక్కడ చూసినా గోచరిస్తున్నది. ఆ దూరంగా ఎక్కడనుంచో ఒక ఓడ ...సముద్ర జలాల్లో పయనిస్తోంది. సముద్రాలు దేశాల్ని విడదీస్తాయి అదే సమయం లో కలుపుతాయి కూడా..!
కన్యాకుమారి లో ఆ పేరు మీదనే ఉన్న అమ్మవారి కోవెల ని కూడా దర్శించుకుని ఓ మూడు రోజుల పాటు ఉండి తిరిగి వచ్చేశాను. సాధన లో ముందుకి పోతూనే ఉన్నాను. కొన్నిసార్లు కొత్త అనుభవాలు ...దర్శనాలు కలిగేవి. మరి కొన్ని రోజులు అసలు ఎలాంటి అనుభవాలూ కలిగేవి కావు. సామాన్యం గా రోజులు గడిచిపోతున్నాయి. ఏ పని చేసినా శ్రద్ధ తో చేసే గుణం పెరుగుతోంది. ప్రతిరోజు పడుకునే ముందర మహాత్ములు కొందరు రాసిన పుస్తకాల్ని చదివేవాడిని. చాలా విషయాలు కొత్త కోణం లో అర్థమయ్యేవి.

పగటిపూట అంతా లౌకిక పరమైన పుస్తకాలు ఇంగ్లీష్ ఇంకా తెలుగు సాహిత్యం చదివేవాడిని. ఇదివరకటి కంటే ఇంగ్లీష్,తెలుగు భాషల్లో జ్ఞానం బాగా పెరిగింది. తెలుగు భాష మాట్లాడిన లేదా రాసిన విధంగానే ఇంగ్లీష్ లో కూడా చేయగలిగేవాడిని. రెండు భాషల్లోనూ బ్లాగులు తెరిచి నా ఆలోచనలు రాసేవాడిని. నా తెలుగు మిత్రులు కొంతమంది మీరు ఇంగ్లీష్ మీడియం లో చదివారా అని అడిగేవారు. లేదని చెబితే అబద్ధం చెబుతున్నానని అనుకునేవారు.

 ప్రతిదీ ఒకందుకు జరుగుతుందని, నా ఇంగ్లీష్ బ్లాగుల్లోని రాతల వల్ల అనేకమంది ఇతర రాష్ట్రాల ఇంకా ఇతర దేశాల సృజనకారులైన మిత్రులు చేరువ అయ్యారు. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ లోకం లో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఉన్నారని , మనం తెలుసుకోవలసింది ఎంతో ఉందని అనిపించేది.     
ఇంగ్లీష్ లో ఉన్న కొన్ని మంచి పుస్తకాలు తెలుగు లోకి రాకపోడం వెలితి గా అనిపించింది. వాటిని తెలుగు లోకి అనువాదం చేయడం ప్రారంభించాను. అనువాదం పేరు కోసమో,డబ్బు కోసమో గాక ఒక మంచి గ్రంథాన్ని సాటి వారికి అందించాలనే తపనతో చేయడం వల్ల అవి చక్కని క్వాలిటి తో బయటకి వచ్చాయి. పాఠకుల అభిమానాన్ని పొందాయి. నాకు తెలియకుండానే తెలుగు పాఠకుల ఇంకా రచయితల సర్కిల్ లో ఓ గుర్తింపు వచ్చింది. నా ఫోన్ నెంబర్ తెలుసుకుని చాలామంది మాట్లాడేవారు. అది నేను ఏ మాత్రం ఊహించలేదు.

అయితే సాధ్యమైనంత వరకు నా కృషి నేను చేస్తూ సభలు,సమావేశాలకి వెళ్ళేవాడిని కాను. అంత వ్యవధి ఉండేది కాదు. సాహితీ వ్యవసాయం తో బాటూ ఉద్యోగం,ప్రయాణం...ఇవీ జీవితం లో చాలా సమయాన్ని తీసుకుంటాయి. చూస్తుండగానే ఏళ్ళకి ఏళ్ళు గడిచిపోతున్నాయి.ఓ పది పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. మరో చోటకి బదిలీ కాబడ్డాను.కొత్త జనాలు...కొత్త గ్రామం...కొత్త అనుభవాలు. పిచ్చిగానీ మనిషి అనే వాడు ఎక్కడున్నా ఒకటే...కొన్ని కొన్ని తేడాలతో..!

ప్రస్తుతం నేను భద్రాచలానికి దక్షిణదిశలో ఉన్న నందిగామపాడు అనే గ్రామానికి బదిలీ కాబడ్డాను. గ్రామ రాజకీయాలు ప్రతి చోటా ఉండేవే.ఇక్కడి స్థానికులు చాలామంది ఏదో కాలం లో కోస్తా జిల్లాలనుంచి వచ్చి స్థిరపడినవారే.పేరు కి తెలంగాణా జిల్లా లో ఉన్నా, ఏదో ఆంధ్రా ప్రాంతం లోని గ్రామం లాగానే అనిపిస్తుంది.అన్ని వ్యవహారాల్లోనూ..!

తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది. ఈసారి కెసియార్ సారథ్యం లో...విన్నుత్న పోకడలతో...రోడ్ల పై వంటకాలు,బతకమ్మలు పేర్చి ఆటలు,మిలియన్ మార్చ్,సబ్బండ వర్ణాలతో నిరసనలు...ఇటువంటి వార్తలు ప్రతి రోజూ పేపర్లలో చదువుతుండేవాళ్ళం. స్థానికం గా మాకు అలాంటి వాతావరణం కనిపించేది కాదు. కారణం తెలిసినదే. తెలంగాణా వస్తుందా ...రాదా...గతం లో లాగే కొన్నాళ్ళుసాగి ఆగిపోతుందా అని చర్చలు స్కూల్ లో సాగేవి.      
     
డివిజన్ కేంద్రమైన భద్రాచలం లో కూడా అంత ఉధృతం గా తెలంగాణా పోరాటం సాగుతున్నట్లు తోచేది కాదు. అయితే ప్రెస్ సంఘాలు,లాయర్ల సంఘాలు,కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇలాంటి వారు అడపా దడపా నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు. కొంతమంది భద్రాచలం ఆంధ్రా లో కలిస్తే లాభం చేకూరుతుందని అనేవాళ్ళు.ఇంకొంతమంది దాన్ని ఖండించేవాళ్ళు. ఇలా మిశ్రమంగా ఉండేది.

భద్రాచల వాసి గా నేను కొన్ని పరిస్థితులు చవిచూశాను. తెలంగాణా జిల్లా లోని మిగతా ప్రాతాలకి వెళితే మాటతీరు చూసి మీరు ఆంధ్రా వాళ్ళా అని అడిగేవాళ్ళు. అలాగే ఆంధ్రా కి వెళితే అక్కడి వాళ్ళు ప్రాంతాన్ని బట్టి చూసి మీరు తెలంగాణా వాళ్ళు గదా అనేవాళ్ళు. ఇలాంటి అటూ ఇటూ గాని పరిస్థితి భద్రాచలవాసులది. ఇదో వింత వ్యవహారం..!

   ఆ తర్వాత వేసవి లో కలకత్తా వెళ్ళాను.అప్పటికే కోల్కతా గా పేరు మార్చినా ఎందుకనో పాత పేరు బాగా అలవాటైపోయింది. హౌరా ఎక్స్ ప్రెస్ లో వెళ్ళాను. తూర్పు దిశగా వెళ్ళడం అదీ ఈ కలకత్తా వైపు వెళ్ళడం ఇదే ప్రథమం. హౌరా స్టేషన్ లో రైలు దిగేసరికి రాత్రి రెండు గంటలు దాటింది. ఇక్కడెవరు తెలుసని...ఎటూ వెళ్ళడం...? సరే...బేలూరు మఠం,దక్షిణేశ్వర్ లని సందర్శించాలి. అది మాత్రం పూర్తి క్లారిటీ ఉంది.

ప్రయాణీకులందరూ ఒక సముద్రం లాగా ప్రవేశ ద్వారం వేపు సాగిపోతున్నారు. అహా...ఏమి జనాలు..!అప్పటికి చెన్నై,బెంగళూరు,భుబనేశ్వర్ ,ముంబాయి లాంటి స్టేషన్ల లోని రద్దీ చూశాను గాని ఇక్కడ మాత్రం నిజంగా ఓ సముద్ర ప్రవాహమే ముందుపోతున్నట్లు తోచింది. ఇసక వేస్తే రాలదు అనే సామెత ఇక్కడ నూటికి నూరు పాళ్ళు నిజం.

రైలు స్టేషన్ దాటి బయటకి వచ్చాను. నగరం నిద్రపోతున్నది. ఎంతమంది మహానుభావుల పాదస్పర్శతో పులకించిన భూమి ఇది.లైట్లు వీథుల్లో అక్కడక్కడ వెలుగుతున్నాయి.ఎక్కడ చూసినా ఓ పాతదనం.ఒకప్పుడు గొప్ప జీవితం ని గడిపి ప్రస్తుతం సామాన్యం గా రోజులు గడుపుతున్న వృద్ధుని లా అనిపించింది, నా మొదటి చూపులో ఈ నగరం. సరే...ముందు ముందు చూద్దాం ..! 

బ్యాగ్ ని భుజాన వేసుకుని ముందుకు సాగిపోతున్నాను. జనాలు కనిపించడం లేదు. ఎవరిని అడగడం ..? బోర్డులు చూస్తే సాల్దియా అనే ప్రాంతం లో ఉన్నట్లు అర్థమయింది. లాడ్జ్ లు కూడా మధ్య రకానివి కనిపిస్తున్నాయి. ఒకటి, రెండు లాడ్జ్ ల్లో ప్రయత్నించినా ఎక్కడా సింగిల్ రూం ఖాళీ లేదు. మొత్తానికి ఎలాగయితేనేం...చటర్జీ పడా అనే బోర్డ్ పక్కనున్న డార్మిటరీ లో ఉన్న ఒకేఒక ఖాళీ గది నాకు దొరికింది.   

స్నానం కానిచ్చి కాసేపు పడుకున్నాను. ప్రయాణపు బడలిక కొద్దిగా తగ్గింది. కిందికి వచ్చి ఓ హోటల్ లో టిఫిన్ చేశాను. రేట్లు ఫర్వాలేదు. ఓ మాదిరిగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం పడి వెలిసినందువల్ల,వాతావరణం ఆహ్లాదం గా ఉంది.చాలామంది బెంగాలీ భాషలో మాట్లాడుకుంటున్నా, హిందీ కూడా బాగానే వినబడుతోంది. నాకు వచ్చిన కొద్దిపాటి హిందీ తో మామూలు వ్యవహారాలు నడుస్తాయి,కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. 

రోడ్డు మీద అలాగే నడుస్తూ పోతున్నాను. మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించిన ఓ నడికారు వ్యక్తిని ఆపి ఇంగ్లీష్ లో మాట్లాడాను. అతను ఆనందంగా సమాధానం చెప్పాడు. ఇక్కడ నుంచి దక్షిణేశ్వర్ కాళీమాత ఆలయం ఎంత దూరమని,అలాగే బేలూరు మఠాల గురించి ప్రశ్నించాను. క్యాబ్ తీసుకొని గాని, ట్రాం లో గానీ వెళ్ళవచ్చునని తెలిపాడు.సీల్డా పేలస్ కూడా చూడండి బాగుంటుంది అని సలహా ఇచ్చాడు.

ఒక క్యాబ్ తీసుకున్నాను. డ్రైవర్ తో కాళీఘాట్ కి పోనిమ్మాను.

"కలకత్తా లో వీథికో కాళీఘాట్ ఉంటుంది...మీరనేది...దేనిగురించి" అన్నాడతను.

"దక్షిణేశ్వర్ లో ఉండేది..." చెప్పాను,అప్పుడు గానీ స్ఫురించలేదు నా పొరబాటు.

 క్యాబ్ కదిలింది. కిషోర్ కుమార్ పాడిన ఫోక్ సాంగ్స్ అదీ బెంగాలీ పాటలు పెట్టాడు ఆ డ్రైవర్. 

"కిషోర్ కుమార్ బంగ్లా లో కూడా పాడాడా " అడిగాను.

"కిషోర్ దా బెంగాలీ వాడే గదా...కాకపోతే మధ్యప్రదేశ్ లో పుట్టాడు...ఆయనకి మా భాష రాకపోవడం ఏమిటి...చాలా బెంగాలీ సాంగ్స్ పాడాడు" గర్వం గా చెప్పాడు ఆ క్యాబ్ డ్రైవర్.

హౌరా బ్రిడ్జ్ దాటి సాగిపోతున్నాం. కలకత్తా లోకి ప్రవేశించి రకరకాల వీథుల గుండా రమారమి అరగంట పాటు మా క్యాబ్ ప్రయాణం సాగింది. ఎట్టకేలకు దక్షిణేశ్వర్ భవతారిణి (కాళీమాత) ఆలయానికి చేరుకున్నాను. భక్తులు బాగా ఉత్తరాది వారు కనిపిస్తున్నారు. బెంగాలీ బాబులతో బాటు..!   

జనాలు బాగా ఉన్నారే ...దర్శనం లేటవుతుందేమో అనుకుంటూ ఉండగా...

"ఇలా రండి...మీకు త్వరగా దర్శనం చేయిస్తాను" అన్నాడు ఓ పూజారి సమీపించి. నేను కొద్దిగా అనుమానం గా చూశాను.

"నూట యాభై రూపాయలు అవుతుంది. అలాగే మీకు పూజ,ప్రసాదం..అన్నీ నేను చూసుకుంటాను ...నన్ను నమ్మండి" అన్నాడతను. 

నిజానికి నేను వచ్చింది అలనాడు రామకృష్ణ పరమహంస నడయాడిన ఈ నేల లో ఒక్కసారి తిరగాలని...భవతారిణి తో, ఆయన శిష్యులతో , భక్తులతో గడిపిన ఈ ప్రదేశం లో ఓ నిముషం ప్రశాంతం గా గడపాలని...! తన జీవితకాలం లో ధనాన్ని తాకడాన్ని ఇష్టబడని ఆ మహాత్ముని పేరు మీద ఇక్కడ ఇప్పుడు ఎంత వ్యాపారం సాగుతున్నది..! నాలో నేనే నవ్వుకున్నాను.

"సరే" అన్నాను. మొత్తానికి తను చెప్పినట్లే దర్శనం అవీ తొందరగా అయ్యే ఏర్పాట్లు చేశాడు ఆ పూజారి. ప్రసాదానికి వాటికి కొంత అదనం గా ఇమ్మని వాటి ఖర్చు వేరేనని చెప్పాడు. సర్లెమ్మని చెల్లించాను. ఆ ప్రాంగణం లో అలాగే పచార్లు చేస్తున్నాను. దగ్గర్లో ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్న జంట తెలుగు లో మాట్లాడుకుంటున్నారు.

ఆశ్చర్యం గా చూశాను. వాళ్ళు నాకేసి నవ్వుతూ ...

"తెలుగు వాళ్ళా ..." అన్నారు. మగ మనిషి ఈ పక్కన కూర్చోమని సైగ చేశాడు. వెళ్ళి దగ్గర్లో కూర్చున్నాను.

"మీరు కూడా నాలాగే యాత్రకి వచ్చారా ..?" ప్రశ్నించాను.

"లేదు. మేము ఇక్కడే ...ఈ స్టేట్ లోనే ఉంటాం. టిటాగడ్ అని చెప్పి కలకత్తా కి దగ్గర గానే ఉంటుంది. అక్కడ ఉంటాం" అన్నాడాయన.

"మరి మీరు తెలుగు బాగానే మాట్లాడుతున్నారే" అన్నాను.

"మా పెద్దవాళ్ళు ఎప్పుడో ఇక్కడున్న జూట్ మిల్స్ లో పనిచేయాడానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. టిటాగడ్ లో చాలామంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు.." 

"చాలా ఆనందంగా ఉంది. మీరు ఏం చేస్తుంటారు ..?" 

"మన తెలుగు వాళ్ళు నెలకొల్పిన స్కూల్ ఒకటి ఉందక్కడ...అంటే ఎయిడెడ్ స్కూల్ ...దాంట్లోనే సోషల్ టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా బంధువులు ఒకరు వస్తే వాళ్ళని ఇక్కడకి తీసుకొచ్చాం...మీరు కలిశారు" అన్నాడాయన నవ్వుతూ. నా పేరు చెప్పి,షేక్ హేండ్ ఇచ్చాను ఆయనకి. 

"మరి ఈ మధ్యలో ఎప్పుడూ మన వైపు రాలేదా సార్.." అడిగాను.

"ఈ మధ్యన అంటే...సుమారు ఆరు నెలల క్రితం వచ్చాను. కాని ఓ గమ్మత్తు అనుభవం జరిగింది. రైల్లో నా సీటు పక్కన వ్యక్తి తో ఏదో పిచ్చాపాటి గా మాట్లాడాను. కాసేపయిన తర్వాత మీ కులం ఏమిటి ...అని చాలా కేజువల్ గా అడిగేశాడు" విస్తుపోతూ చెప్పాడు.

"ఈ మధ్య కులస్పృహ తెలుగువాళ్ళలో బాగా పెరిగింది లెండి...ఇక్కడ ఎవరూ అలా అడగరా..?" అడిగాను.

"ఏదో పెళ్ళిళ్ళప్పుడు...ఇంకా మిగతా సమయాల్లో అవసరాన్ని బట్టి అడుగుతారేమో గానీ, బయట వాళ్ళనెపుడూ ఈ బెంగాలీ సమాజం లో ఉన్నట్టుండి అలా అడగరు. నేను నా కుటుంబం తో మూడు దశాబ్దాల నుంచి ఒక ఇంటి లో ఉంటున్నాను. ఆ ఇంటి ఓనర్లు గానీ ,చుట్టుపక్కల వారు గానీ ఇంతవరకు నా కులం ఏమిటి అని అడగలేదు. ఈ విషయాన్ని మీరు నమ్మగలరా ...కానీ అక్షరాలా నిజం" సోషల్ మేష్టారు చెప్పిన విషయం విస్మయపరిచింది.    

  అంతలోనే మేష్టారి బంధువులు వచ్చారు. నాకు బాయ్ చెప్పి అంతా వెళ్ళిపోయారు. ఊరి కాని ఊరి లో మన భాష వాళ్ళు కలిస్తే ఆ మజా యే వేరు. ఠాకూర్ ఆయన శిష్యులు నడయాడిన ఆ పుణ్యప్రదేశం లో కాసేపు కళ్ళు మూసుకుని కూర్చొని ఒక హాయిని అనుభవించాను. వాళ్ళంతా అక్కడ సూక్ష్మరూపాల్లో ఉన్నారా అనిపించింది. పావుగంట అక్కడ అలాగే గడిపి ఆ తర్వాత లేచి ఆలయం బయటకి వచ్చి క్యాబ్ తీసుకుని సీల్డా ప్యాలెస్ కి వచ్చాను.

సీల్డా అనే ప్రదేశం లో ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. కలకత్తా నగరం కి నడిబొడ్డు లో ఉంటుంది. అక్కడ రైల్వే స్టేషన్ విపరీతమైన రద్దీ గా ఉంది. అక్కడనుంచి ఈ ప్యాలస్ ఓ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. విక్టోరియల్ మెమోరియల్ అనేది అసలు పేరు. మొత్తం పాలరాతి తో అరవై నాలుగు ఎకరాల్లో నిర్మించారు. బ్రిటిష్ వారి హయాం లో విక్టోరియా మహారాణి యొక్క జ్ఞాపకార్థం దీన్ని నిర్మించారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ చొరవ మేరకు ఈ మహాసౌధాన్ని నిర్మించారు.

కలకత్తా కి హాల్ మార్క్ గా నిలిచిపోయింది. ప్రతి వ్యక్తి చూడవలసిన నిర్మాణం ఇది. బ్రిటీష్ వారి నాటి శిల్ప విన్నాణం అంతా దీంట్లో చూడవచ్చు. అంతేకాదు బ్రిటీష్ వారి హయాం లోని భారతదేశ గత చరిత్ర ని ఇక్కడ ఉన్న పాతిక గేలరీల్లో కొన్ని రోజులు కూర్చొని చదువుకోవచ్చు.అప్పటి పుస్తకాలు,ఫోటోలు,ఆయుధాలు ఇంకా ఎన్నో అపురూపమైన వస్తువుల్ని దీనిలోని మ్యూజియం లో పొందుపరిచారు. ఎంతసేపు చూసినా తనివితీరదు. చిన్నా,పెద్దా అని లేకుండా ఎంతోమంది దర్శించడానికి వచ్చారు. పరిశోధకులకు ఈ ప్యాలస్ గొప్ప నిధి అని చెప్పక తప్పదు.

ఒకానొక సమయం లో లండన్ తర్వాత కలకత్తా గొప్ప వాణిజ్య కేంద్రం గా ఉండేది. 1772 నుంచి 1911 దాకా బ్రిటీష్ వారు తమ రాజధాని గా కలకత్తా నగరాన్నే ఉంచినా ఎందుకో ఆ తర్వాత సంవత్సరం మాత్రం ఢిల్లీ కి మార్చారు. అయిదవ కింగ్ జార్జ్ ఈ మార్పు ని మన దేశం వచ్చి మరీ ప్రకటించాడు. వైస్రాయ్ హార్డింజ్ సలహా మేరకు ఢిల్లీ దర్బార్ లో రాజధాని మార్పు ని ప్రకటించారు.         

కలకత్తా ప్రస్తుతం కోల్కతా గా మారినా కలకత్తా అని పిలవడానికే ఇష్టబడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదీ బెంగాల్ రాష్ట్రం లోనే..! వాళ్ళూ నాలాగే పాత తరహా అనుకుంటాను. సరే...ఏదైతేనేం...ఎవరికీ ఇబ్బంది లేనంత వరకు..! దక్షిణేశ్వరం,విక్టోరియా ప్యాలస్ ఆ తరవాత కొన్ని వీథుల్ని చుట్టి మళ్ళీ చీకటిపడే వేళకి సాల్కియా లో ఉన్న లాడ్జ్ కి చేరుకున్నాను. సమోర్ అనే లాడ్జ్ లో పనిచేసే కుర్రాడు రాత్రికి భోజనం తెచ్చిపెట్టాడు.చేపల కూర...ఫర్వాలేదు.

మరునాడు బేలూరు మఠం కి వెళ్ళాను. అక్కడ ఉన్న ఒక హాల్ లో ధ్యానించి ఆ తర్వాత లోపలే ఉన్న మ్యూజియం ని చూశాను. అప్పటికే గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ గ్రంథం లో ఏ విధంగా ఓ చినుకు లా ప్రారంభమై మహా సముద్రం లా ఆ సంస్థ విస్తరించినదీ చదివి ఉన్నాను. ఎందరో మహానుభావుల కృషిని కళ్ళకి కట్టినట్లుగా ఉంచారక్కడ. స్వామి వివేకానంద కోరిక మేరకు పాశ్చాత్య,తూర్పు దేశాల నిర్మాణ శైలి అక్కడి ప్రతి భవనం లోనూ ఉట్టిపడుతోంది. రెండు వైపులా ఉన్న విజ్ఞానాన్ని,ఒకరి కొకరు పంచుకోవాలని గదా ఆయన జీవితమంతా తపించినది.

బేలూరు మఠం నుంచి సిటీ బస్సు ఎక్కి సాల్కియా లో దిగాను. అదే లాడ్జ్ లో దిగిన రామన్ అనే యువకుడు కలిశాడు. అతను వాళ్ళ కంపెనీ తయారుచేసే గాడ్జెస్ ని ప్రమోట్ చేయడానికి ఇక్కడకి వచ్చాడట. కోయంబత్తూర్ లో వాళ్ళ కంపెనీ ఉంటుంది. మొత్తానికి తమిళులు వ్యాపారం చేయడం లో ఏ ప్రాంతానికైనా పోయి నెగ్గుకువస్తారు. ఎంతైనా అక్కడా బ్రిటీష్ వాళ్ళు పాగా వేశారు గదా...ప్రభావం ఎక్కడికి పోతుంది. భారతదేశం లో బ్రిటీష్ వాళ్ళు పాలించిన ప్రాంతాల్లోని ప్రజలు విద్యా,వ్యాపారాల విషయం లో ముందంజ లో ఉంటారు ...అది కాదనలేని నిజం.

ఆ రాత్రి హాయిగా నిద్ర పట్టింది. తెలవారబోతుండగా ఓ కల వచ్చింది. ఆ కల లో నేను విక్టోరియా ప్యాలస్ లో సంచరిస్తున్నాను. ఎంతో మంది సందర్శకులు అటూ ఇటూ తిరుగుతున్నారు. దాంట్లో నల్లవాళ్ళు,తెల్లవాళ్ళు అందరూ ఉన్నారు. ఆసక్తి గా ఓ ఫోటో గ్యాలరీ లో ఉన్న చిత్రాల్ని చూస్తున్నాను.ఇంతలో నా పక్కనే ఉండి నన్నే తదేకం గా చూస్తున్నాడు ఓ శ్వేతజాతీయుడు. అతని వైపు చిరునవ్వు తో చూశాను ...ప్రశార్థకంగా..!

"ఆ ఫోటో చూడు, గమ్మత్తుగా లేదూ..." అన్నాడతను.

దానివైపు చూశాను. ఆ ఫోటో లో ఓ బ్రిటీష్ అధికారి ఒక సంత లో నిలబడిఉన్నాడు. అతని చుట్టూ తలపాగా లు చుట్టుకున్న సామాన్య భారతీయులు గుమిగూడి ఉన్నారు. అతనికి తమ సమస్యల్ని వివరిస్తున్నారు వాళ్ళు. ఇంకొంతమంది కాగితాల్ని పట్టుకుని ఉన్నారు ...బహుశా వాళ్ళ విన్నపాల్ని దాంట్లో పొందుపరిచి ఉంటారు.

"బావుంది. మరయితే ఆ అధికారి ఏమి చేస్తాడు ఆ తర్వాత" అడిగాను.

"ఏముంది...తన అధికార పరిధి లో ఉన్నంతవరకు చేయవలసింది చేస్తాడు" అన్నాడతను.

"వాళ్ళు ఏమి కోరుతున్నారు " 

"తమ స్థానిక సమస్యలు గూర్చి ...ఇంకా రకరకాలుగా " 

"అదంతా నీకు ఎలా తెలుసు "

"ఎందుకంటే ఆ ఫోటో లో ఉన్నది నేనే గదా " నవ్వుతూ అన్నాడా శ్వేతజాతీయుడు. ఆశ్చర్యం తో నా కళ్ళు పెద్దవయ్యాయి. మరింత దగ్గరగా ఆ ఫోటో వైపు వంగాను.అలా కాసేపు చూసి ...గిరుక్కున ఈ మనిషి వైపు చూశాను. అవును నిజమే ఇద్దరూ ఒకరే...!

"అన్నట్లు నీ పేరేమిటి...తెలుసుకోవచ్చా " అడిగాను.

"అంగస్ అల్స్టైర్ ఫెర్నాండెజ్ ..."

"అ...అవును...ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే...భద్రాచలం ప్రాంతానికి ఐ.సి.ఎస్. అధికారిగా పనిచేశారు గదా...!" 

"బాగా గుర్తుపట్టారు. నేను పుట్టి పెరిగింది అంతా ఈ కలకత్తా లోనే..! తల్లి ఐరిష్,తండ్రి ఇంగ్లీష్ ...మా కుటుంబం ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడింది ...సరే ఇప్పటికీ మా బంధువులు కొంతమంది ఇక్కడ ఉన్నారు" 

"మరి..." అంటూ ఏదో అడగబోతుండగా ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బెల్ వినిపించింది. కల తేలిపోయింది. ఈ బెల్ కూడా ఇప్పుడే  కొట్టాలా..?! చ..! 

తలుపు తెరిచి చూస్తే డోర్ బాయ్ ఉన్నాడు.

"ఏమైనా టిఫిన్ కావాలా సార్" అడిగాడు తను.

"ఏదో తీసుకు రా..."అన్నాను. మంచి కల చెదిరిపోయిందే అని నీరసంగా అనిపించింది. మంచం మీద కూర్చున్నాను. ఆ కల గురించే ఆలోచించసాగాను. అసలు నాకు కలలు రావడమే తక్కువ. వచ్చినవి గుర్తుండడం ఇంకా తక్కువ. ఈ మధ్య కాలం లో తెల్లారిన తర్వాత గుర్తున్నది ఇది ఒక్కటే.

మళ్ళీ ఈ సారి కట్టా సుబ్బారావు గారు దుమ్ముగూడెం వచ్చినపుడు ఈ ఫెర్నెండెజ్ అనబడే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ గురించి అడిగి తెలుసుకుందాం అనుకున్నాను. అదే రోజు బేలూరు మఠం కి వెళ్ళాను. చాలా విశాలంగా ఉన్న నిర్మాణం అది...అనేకమంది మఠానికి చెందిన స్వామీజీలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.ఎక్కడా చీమ చిటుక్కుమన్నంత శబ్దం లేదు. అక్కడ కాసేపు ధ్యానించి వచ్చేశాను.

ఆ తర్వాత మరో రెండు రోజులు కలకత్తా లోనే గడిపి తిరిగి వచ్చేశాను. హౌరా రైల్వే స్టేషన్ లో తిరుగు ప్రయాణం నిమిత్తం కూర్చుని ఉన్నాను. స్టేషన్ మెయిన్ హాల్ లో ఒక పెద్ద వాల్ మీద శ్రీ రామకృష్ణ పరమహంస,శారదా మాత,వివేకానంద స్వామి వార్ల చిత్రాలు మెడ ఎత్తి చూడవలసినంత ఎత్తుగా చిత్రించారు. వాటిని అలాగే చూస్తుండగా చప్పున లాడ్జ్ కౌంటర్ దగ్గర జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. నేను గది ఖాళీ చేసి వచ్చేటప్పుడు డబ్బులు చెల్లించుదామని కౌంటర్ దగ్గరకి వెళ్ళాను.

"ఎందుకు..? మీ అమౌంట్ సరిపోయింది. చెల్లించనవసరం లేదు " అన్నాడు లాడ్జ్ మేనేజర్.

"అదేమిటి...అడ్వాన్స్ ఇచ్చాను తప్ప మిగతా రోజులకి ఇవ్వలేదు గదా " అన్నాను.

"గంట క్రితం ఖాళీ చేసి వెళ్ళిన ఆ తమిళ్ వ్యక్తి చెల్లించాడు...మీ దగ్గర తీసుకోవద్దన్నాడు" ఆ సమాధానం విని తల గోక్కుంటూ బయటకి నడిచాను. ఆ ముగ్గురు మూర్తులు ఆయనకి ఆ బుద్ధి ఎందుకు పుట్టించారో కానిమ్మని నవ్వుకున్నాను.   

--------------------------- 9 --------------------------------
 
ఆ విధంగా కలకత్తా ప్రయాణం ముగిసింది. అన్నిటికంటే పెద్ద ప్రయాణం జీవితం. ఇది ఆగదు గదా. దీని ప్రయాణాన్ని ఆపాలని ప్రయత్నించి ఓసారి విఫలమయ్యాను. దానంతట అది ఆగే వరకు ఇక ఆ జోలికి పోదలుచుకోలేదు.తిరిగి వచ్చి నా దైనందిన జీవితం లో నిమగ్నమయ్యాను. పాఠశాల కి వెళ్ళడం,రావడం ...అలా సాగిపోతోంది. ఉన్నట్టుండి దుమ్ముగూడెం వెళ్ళాను. ముఖ్యంగా వి.ఆర్.వో. గార్ని ఇంకా కట్టా సుబ్బారావు గారిని కలుద్దామని.

"హలో సార్...ఏమిటి ఈ మధ్య అసలు ఇటు రావడం లేదు" అంటూ వి.ఆర్.వో గారు సాదరంగా ఆహ్వానించారు ఇంట్లోకి.

"ఏముందండి...చిన్న టూర్ కి వెళ్ళా ... మీకు తెలుసుగా నా వ్యవహారాలు...స్కూలు,చదువు,ప్రయాణాలు ...ఇంతకంటే ఏముంటాయి" అన్నాను నవ్వుతూ.

"మీ ఉద్యోగమే హాయి ఓ రకంగా...సెలవులు ఉంటాయి...దసరా,దీపావళి ...అంటూ...మాకు తీరుబడి కాదు...పనిమీద పని" నిట్టూర్చారు వి.ఆర్.వో.గారు. ఇంతలోనే వారి శ్రీమతి గారు టీలు తీసుకొచ్చి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయారు.

"దేని కష్టాలు దానికే ఉంటాయి సార్...అన్నట్లు కట్టా సుబ్బారావు గారు ఊళ్ళో ఉన్నారా...కలుద్దాం " అన్నాను టీ తాగుతూ.

"ఆ మధ్య వచ్చి నాలుగయిదు రోజులు ఉండి వెళ్ళిపోయారు సార్. భద్రాచలం లో ఏదో లాండ్ అదీ ఉంటే అమ్మివేసి వెళ్ళిపోయారు. సరిగ్గా గుర్తు చేశారు. వెళ్ళే ముందు ఒక పాత పుస్తకాల కట్ట ,మీకు ఇమ్మని ఇచ్చారు...ఆగండి తెస్తా" అంటూ ఆయన లోపలి గది లోకి వెళ్ళారు.

నేను కూర్చున్న గది లో పై భాగం లో చూస్తే... మార్క్స్,ఎంగెల్స్ ఇంకా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వారి ఫోటోలు ఉన్నాయి. వి.ఆర్.వో.గారు వామపక్ష భావజాలం ఉన్నవారు కనక ఆశ్చర్యం అనిపించలేదు. కాసేపటిలో ఆయన పుస్తకాల కట్ట తో వచ్చారు. వాటిని ఓ ప్లాస్టిక్ సంచి లో వేసి ఇచ్చారు. 

"ఇంటికి వెళ్ళి జాగ్రత్త గా తీయండి పుస్తకాల్ని...పేజీలు చాలా వీక్ గా ఉన్నాయి...ఎప్పటివో గదా ...అవన్నీ" అన్నారాయన.

"సరే.." అని చెప్పి మరో గంట పాటు సాహిత్య విశేషాలు అవీ మాట్లాడి సెలవు తీసుకున్నాను.     
ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకాల కట్ట ని అల్మైర లో పెట్టేసి తర్వాత తీరిగ్గా చదువుదాం లే అనుకుని నిద్రపోయాను. ఆ తర్వాత కొన్ని రోజుల దాకా ఆ విషయమే మర్చిపోయాను. ఓ సాయంత్రం పూట మార్క్వెజ్ రాసిన "వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్"  అనే ఆంగ్ల నవల చదువుతున్నాను. మూల రచయిత అయిన మార్క్వెజ్ దీన్ని స్పానిష్ భాష లో రాశాడు. ఆ తర్వాత ఆంగ్లం లోకి అనువాదమైంది. దాన్నే ప్రస్తుతం నేను చదువుతున్నది.

శైలి కఠినతరం గానే ఉంది. ఓ పత్రికా విలేకరి పెద్ద న్యూస్ రాసినట్టుగా ఉంది. మరి మార్క్వెజ్ కూడా నిజ జీవితం లో రిపోర్టర్ గానే పనిచేశాడు. ఆ ప్రభావం అనుకుంటాను. కొలంబియా స్థానిక సంస్కృతి ని కొన్ని అది భౌతిక విషయాల తో కలిపి రాశాడాయన. మకాండో అనే గ్రామం ఎలా స్థాపించబడి కొన్ని తరాల తర్వాత ఎలా ఓ మనిషి మాదిరి గానే మరణించింది అనేది ఇతివృత్తం.

జోస్ ఆర్కాడియో బ్యుయెండియ  అనే వ్యక్తి తను గొడ్డలి తో నరికి చంపిన వాడి ఆత్మ పదే పదే కనిపిస్తుండడం తో , ఆ గ్రామం వదిలి అడవి లో బడి ఎంతో ప్రయాణం చేసి మొత్తానికి ఓ చోట తన తండా ని నెలకొల్పుకుంటాడు. క్రమేణా ఆ గ్రామం పెరిగి అయిదు తరాల తర్వాత మళ్ళీ నాశనమవుతుంది. ప్రధాన పాత్రలు ఒక్కరూ మిగలకుండా పోతారు.

లాజికల్ గా చూస్తే దాంట్లోని కొన్ని విషయాలు నమ్మలేము. కాని రచయిత ఒక గొప్ప కన్విక్షన్ తో ఎవరేమనుకున్నా ఫర్లేదు అని రాసినట్టుగా తోచింది. ఆ శైలి కి ప్రత్యేకమైన పేరు పెట్టారు మేజికల్ రియలిజం అని..!  దాన్ని 1962 లో రాసినా మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. నోబెల్ బహుమతి ఇచ్చినపుడు దీన్ని ప్రత్యేకం గా ప్రస్తావించడం తో బాగా ప్రాచుర్యం పొందింది.

ప్రపంచం లో ఎవరు,ఎప్పుడు ,ఏ పనిని తమ హృదయం తో ...ఏ మెప్పుని గాని తెగడ్తని గాని ఆశించకుండా చేస్తారో దానికి ఏదో ఓ రోజు రావలసిన గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఒక్కోసారి ఏడాది తర్వాత కావచ్చు,దశాబ్దం తర్వాత కావచ్చు,కొన్ని శతాబ్దాల తర్వాత కావచ్చు...అది అందవలసిన మనుషులకి అందుతుంది. వాళ్ళంతా నివ్వెరబోయి చూస్తారు అన్నేళ్ళ క్రితం ఓ మనిషి ఇంత గొప్పగా ఆలోచన చేశాడా అని..! 

ఆ బుక్ చదువుతూ ఆలోచన లో పడి కొట్టుకుపోతున్న నన్ను దుమ్ముగూడెం వద్ద ఉన్న వర్క్ షాప్ ప్రాంతం ఈ లోకం లోకి తెచ్చింది. తను నా ముందు నిల్చుని ఈ విధంగా అంటున్నట్లు తోచింది.

  "అవును...నేనూ ఒక మకాండో లాంటి గ్రామాన్నే గదా...కొన్ని తరాల క్రితం ...ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చినవాళ్ళు...నన్ను ఏర్పరిచారు. గొప్ప ఆలోచనలు ఇక్కడ సాగాయి. ఇప్పుడు నేనూ అంతిమదశ లో ఉన్నాను. ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యం లో వాళ్ళు చిన్న సైజు పనిముట్లు. దేశం స్వేఛ్చావాయువులు పీల్చకముందే ఇక్కడి లోపలి గ్రామాల్లో సైతం కొన్ని స్కూళ్ళు పెట్టి విద్య ని అందించారు. కనీసం దానికోసమైనా జ్ఞాపకం చేసుకోవచ్చు గదా..!    

నా మీద కూడా ఒక పుస్తకం రాయవచ్చు గదా...ఏమో ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా ఓ పిడికెడు పాఠకులయినా చదవకపోతారా...మార్క్వెజ్ ఆ పుస్తకం లో ఏమన్నాడు ఓ చోట...ఎప్పుడయితే నీకు చెందిన ఒక తరం ఏ వూళ్ళో పాతిపెట్టబడతారో అప్పుడు ఆ ఊరు నీ సొంత ఊరు కింద లెక్క. అదే గదా అన్నది. మరి ఆ లెక్కన ఆ తెల్లవాళ్ళ సమాధులు ఇంకా ఇక్కడేగా ఉన్నది. చరిత్ర... వాళ్ళని ఇక్కడి భూమి కింద కప్పివేసింది" అంటూ ఆ వర్క్ షాప్ ప్రాంతం నా ముందు కథ ని వినిపించసాగింది.    

" వద్దు...వద్దు...నీ చరిత్ర చాలా మటుకు నాకు తెలుసు. ఏదో ఓ రోజున కాలం కలిసి వచ్చినపుడు తప్పకుండా ప్రపంచానికి నీ గురించి ప్రత్యేకం గా ఓ నవల ద్వారా తెలియబరుస్తాను.మనకి లభించే పాఠకులు ...ఎక్కడో ఉండే ఉంటారు" అంటూ అనునయించాను. అంతటితో నా మనోపథం లో నుంచి ఆ ప్రాంతం కొద్దిగా పక్కకి తప్పుకుంది.

అంతలోనే గణగణ మని గంట మోగింది. బిల బిల మని పిల్లలు ఇళ్ళకి దౌడు తీస్తున్నారు. ఇక మేము కూడా కదిలాము.

"సార్...ఏమిటి ఆలోచిస్తున్నారు...కలకత్తా విశేషాలు ఏమిటి..?" అన్నారు మా స్టాఫ్ మెంబర్ ఒకరు.

"కలకత్తా కి మన మండలం లోని బ్రిటిష్ సమాధులకి ఏదో దగ్గరి సంబంధం ఉంది సార్...అదే ఆలోచిస్తున్నా" అన్నాను అన్యాపదేశంగా.

"అంటే ఎలా" 

"ఇక్కడ ములకపాడు దగ్గరున్న తెల్లవాళ్ళసమాధుల్లో...ఫెర్నాండెజ్ అనే సివిల్ సర్వెంట్ సమాధి ని చూశాను...ఇతన్ని పోలిన వివరాలు కలకత్తా మ్యూజియం లో కూడా ఉన్నట్లు అనిపించాయి" అన్నాను. నాకు వచ్చిన కల గురించి చెప్పలేదు.

"అయితే ఎక్కడో రాయబడే ఉండచ్చు. ప్రతీ చిన్నదాన్ని రాసి నిక్షిప్తం చేయడం వాళ్ళకి అలవాటు గదా... ఏమో మీరు చూసింది నిజం కావచ్చు" అన్నాడాయన.

"మా దుమ్ముగూడెం మిత్రుడు ఒకాయన కొన్ని పాత పుస్తకాల్ని ఇచ్చాడు ఇటీవల. వాటిని తెరిచి చూద్దాం...ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో..." అన్నాను సాలోచనగా..!

ఇంటికి వెళ్ళినదే తడవు గా కాస్తంత టీ తాగి, ఫ్రెష్ అప్ అయి ఆ పాత పుస్తకాల్ని ముందు వేసుకున్నాను. మొత్తం మీద చిన్నా,పెద్దవి కలిపి పది దాకా ఉన్నాయి. పేజీలు చాలా జాగ్రత్త గా తీయవలసి వస్తోంది. జీర్ణదశలో ఉన్నందువల్ల. 

 ఓ మూడు పుస్తకాలు యోగసాధన గురించి రాసినవి... అప్పటి కాలం లో వాళ్ళ అనుభవాల్ని నిక్షిప్తం చేసినవి. భాష కూడా పాత విధానం లో ఉంది. అన్నీ ఇంగ్లీష్ భాష లోనే ఉన్నాయి. స్పిరిచ్యువల్ ఎంక్వైరీ...అనే లావుపాటి పుస్తకం బాలానంద స్వామి అనే యోగి రాసినది. ఆయన ఏ మత గ్రంథాన్ని,ఏ పాత కాలపు శ్లోకాల్ని ఉటంకించకుండా కేవలం తన సాధన లో కలిగిన అనుభవాల్ని మాత్రమే ప్రశ్నా,జవాబు రూపం లో రాశారు. 

పైపైన తిరగేసి ...ఈ పుస్తకాన్ని రోజుకి ఓ మూడు పేజీల చొప్పున తీరిగ్గా ప్రశాంతం గా చదవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అది కథ లా చదివి అవతల పెట్టేసేది కాదు. చాలా నిగూఢంగా ఉన్న అంశాలు ఉన్నాయి. కొంచెం సమయం తీసుకునే చదవాలి ఇలాంటి వాటిని..! సరే...ఇంకో పుస్తకం భారతం లోని యయాతి పాత్ర ని తీసుకుని ప్రత్యేకం గా రాసినది. దాని కవర్ పేజీ సగం చినిగిపోయింది. మిగతా సగం లో చూసినా ఆ రచయిత పేరు ఏమిటో అర్థం కాలేదు. నిరాశ గా అనిపించింది.

మిగతా పుస్తకాలు రకరకాలుగా ఉన్నాయి. పేజీలు కొన్ని అతుక్కుపోయి ఉన్నాయి. ఏ మాత్రం లాగినా చినిగేలా ఉన్నాయి.అన్నట్లు కట్టా సుబ్బారావు గారి ఇల్లు ఓ సారి గోదావరి వరదల్లో మునిగిందట.బహుశా అప్పుడు ఇవి కూడా మునిగి ఉంటాయి. ఆ తర్వాత ఆరబెట్టి ఈ రూపం లోకి తీసుకొచ్చి ఉంటారు. కెప్టెన్ గ్లాస్ ఫోర్డ్ రిపోర్ట్ అని ఓ పుస్తకం కనిపించింది. లోపల పేజీల్ని జాగ్రత్త గా తీయసాగాను. చాలా అమూల్యమైన రికార్డ్ ఇది.

కెప్టెన్ గ్లాస్ ఫోర్డ్ అనే బ్రిటీష్ అధికారి ఈ ప్రాంతం మీద సర్వే చేసి చాలా వివరాల్ని దాంట్లో పొందుపరిచాడు. దుమ్ముగూడెం కి ఉత్తరం వైపు ఉన్న ఇప్పటి వాజేడు ఇంకా దాని అవతల ప్రదేశాల నుంచి ఇపుడు పునర్విభజన లో ఏ.ఎస్.ఆర్. జిల్లా లో కలిసిన దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు వి.ఆర్.పురం వంటి మండలాల వరకు ఆయన దీంట్లో సర్వే చేసి అనేక వివరాల్ని రాశాడు.

ఆయా ప్రాంతాల్లో గ్రామాల వారీగా ఉన్న వాగులు,చెరువులు,నదులు ,గుట్టలు, పండే పంటల వివరాలు, ఏ ఏ కులాల వారు ఏ గ్రామాల్లో ఏ సంఖ్య లో ఉన్నారు అనేది వివరంగా రాశాడు. అంతే గాక ఏ ఏ కులాల మధ్య అంతర్గతం గా పోటీ ఉంటుంది,సఖ్యత ఉంటుంది అనేది కూడా వివరించాడు. మన సమాజాన్ని అంత సూక్ష్మంగా ఆ రోజుల్లోనే అధ్యయనం చేసిన బ్రిటీష్ వాళ్ళు మరి ఆ వివరాలన్నిటిని ఏ లక్ష్యం తో సేకరించారో ఆ దేవుడికే తెలియాలి. ఇంకా ఎన్నో ఆశ్చర్యం గా అనిపించే అంశాలు ఉన్నాయి.

ఆ పుస్తకం కవర్ లేదు. లోపల అక్షరాల్ని పరిశీలనగా చూస్తే అది ముద్రించబడిన పుస్తకం కాదు. చక్కగా టైప్ చేయబడిన రిపోర్ట్ అది. పుస్తకం మాదిరిగా పేర్చి గట్టిగా దారం తో కుట్టారు. అక్షరాలు పాత గా అనిపిస్తున్నా అర్థమవుతూనే ఉన్నాయి. అదొక అదృష్టం ...! మొత్తం మీద నూట యాభై పేజీలు ఉన్నాయి. ఇదే రిపోర్ట్ మధ్య లో కొన్ని పాత ఫోటోలు కనిపించాయి. అంత క్లారిటీ గా లేవు గాని ...ఫర్వాలేదు ఓ మాదిరిగా అగుపిస్తున్నాయి.      

ఒక ఫోటోలో జాన్ కెయిన్,సారా కెయిన్ అనే ఇంగ్లీష్ దంపతులు ఉన్నారు. కింద అక్షరాలు చక్కగా కనిపిస్తున్నాయి. మరో ఫోటో లో ఉన్న ఇంగ్లీష్ యువకుడు అంగస్ అల్స్టైర్ ఫెర్నాండెజ్. ఆ రోజుల్లో భద్రాచలం తాలూకా కి స్పెషల్ ఏజెంట్. అంటే ఇప్పటి సబ్ కలెక్టర్ లా అన్నమాట. చటుక్కున కలకత్తా లో వచ్చిన కల గుర్తుకు వచ్చింది. మరింత పరిశీలనగా చూశాను. అవే పోలికలు...అయితే అప్పుడు ఫుల్ సూట్ లో కనిపిస్తే ఇప్పటి ఈ ఫోటో లో ఫుల్ షర్ట్, మెడ చుట్టురా ఉన్న బౌ ...పియానో ముందు ...కూర్చున్న ఫోటో ఇది. బహుశా ఈయన సంగీతాభిమాని కూడా...అనిపించింది.

ఈ ఫోటోల్ని కట్టా సుబ్బారావు గారు సేకరించి ఉండవచ్చును. చూసే ఆసక్తి ఎవరికి ఉంటుంది..? అందుకే ఈ పుస్తకాల దొంతరల్లో పడిపోయాయి ఇవి. ఎవరికి ఎప్పుడు ఏమి కనిపించాలో రాసిపెట్టి ఉండటం అంటే ఇదే..! అన్నిటినీ జాగ్రత్తగా అల్మైరా లో పెట్టేశాను. పుస్తకాల్ని ప్రతి రోజు కొన్ని పేజీలు చొప్పున చదవడం మొదలు పెట్టాను.ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోసాగాను. ఎన్నో దూర తీరాలు ఈ పేజీల గుండా ప్రయాణిస్తున్నాను.

ఏళ్ళు గడిచిపోతూనే ఉన్నాయి. రకరకాలా అనుభవాల్ని ప్రోది చేసుకుంటూ సాగిపోతునే ఉన్నాయి. వి.ఆర్.వో. గారు రిటైర్ అయిపోయారు. తమ సొంత ఊరి లో ఇల్లు కట్టుకుని స్థిరపడిపోయారు. మళ్ళీ కలవడం సాధ్యపడలేదు. ఆయన ఇచ్చిన పుస్తకాలు అన్నీ చదివేశాను. కొన్నిటి మీద నోట్స్ రాసుకున్నాను. ఎప్పటికైనా పనికి వస్తాయని..!ఏమో భవిష్యత్ లో ఎవరైనా నాలాంటి జిజ్ఞాసువు ఇటువైపు వస్తే ...వివరాలు తెలుసుకోవాలంటే ఇలాంటివి ఉపయోగపడతాయి గదా..!

కట్టా సుబ్బారావు గారు కాలం చేశారని తెలిసింది. బహుశా ఎవరో గ్రామస్తులు బస్సు లో చెప్పినట్లు గుర్తు. నా జీవితం లో తారసపడిన అతి ముఖ్యమైన పాత్ర ల్లో ఆయన ఒకరు. షేక్స్పియర్ చెప్పినట్లు ప్రతి ఒక్కరి జీవితం ఒక నాటకరంగం లాంటిదే. మనం ఊహించిన,ఊహించని ఎందరో మనుషులు మన జీవితం లోకి వచ్చి ప్రభావితం చేస్తారు.మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోతుంటారు.

నా రిటైర్మెంట్ ఇంకో ఏడాది ఉందనగా స్వఛ్చంద పదవీ విరమణ చేశాను. చాలు. ఇంతకాలం పరిగెత్తాము. ఇక ఆగాలి. కొన్ని పనులు తీరిగ్గా చేసుకోవాలి. మనసు కి నచ్చేవి. పరులకి తెలియబరిచేవి కొన్ని చేయాలి అని తీర్మానించుకున్నాను. అటు నగర వాతావరణం ఇటు తీరుబాటు జీవితం కలబోసిన భువనేశ్వర్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడకి మకాం మార్చాను. సంతానం కూడా ఆ దగ్గర లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండటం మరింత కలిసి వచ్చింది.  

     ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అప్పుడే యాభై ఎనిమిది ఏళ్ళు నిండిపోయాయి ఈ దేహానికి..!నిన్న గాక మొన్న ఉద్యోగం లో జాయిన్ అయినట్టు అనిపిస్తోంది.ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి.కొన్ని గుర్తుండేవి.కొన్ని మరిచిపోయేవి. ఈ భువనేశ్వర్ వచ్చి ఒక యేడాది గడిచిపోయింది. ఇక్కడ ఎంతో మంది తెలుగువాళ్ళు ఉన్నారు.అయినా ఎవరి జీవితం వారిది.ఎప్పుడైనా జయదేవ్ మంటప్ కో, మేఫెయిర్ హోటల్ కో వెళ్ళినపుడు కలుస్తుంటారు.

పాత ఆలోచనలు కలబోసుకోవడం...ఇంటికి చేరుకోవడం...అదీ జీవితం. ఈ భువనేశ్వర్ లో ఉన్నన్ని పాత తరం ఆలయాలు ఇంకే రాజధాని నగరం లోనూ బహుశా ఉండవు. వాటి నిర్మాణ శైలి కూడా చాలా ప్రత్యేకమైనది.కాని ఎందుకనో పెద్దగా ప్రచారం ఉండదు.కేదారేశ్వర్ ఆలయం,లింగరాజ ఆలయం,రాజా రాణి ఆలయం లాంటివి గొప్ప నిర్మాణ శైలి తో అలరిస్తాయి. మరి ఈ శిల్పులు ఎవరో కానీ,వాళ్ళ కంటూ ఓ పద్ధతి ని సృష్టించుకున్నారు.
  
------------------------------ 10 --------------------------

ఓ వెబ్ సైట్ ని ప్రారంభించి నా అనుభవాల్ని, ఆలోచనల్ని రాయసాగాను. దానివల్ల నాకూ కాలక్షేపం...ఇంకా కొన్ని విలువైన విషయాల్ని అందరకీ చెప్పి ఆనందించగలుగుతున్నాను. కొంతమంది బ్లాగర్ మిత్రులు కూడా ఏర్పడ్డారు. నేను ఉద్యోగం లో ఉన్నప్పటి ఓ అనుభవాన్ని రాశాను ఓ రోజు.

  ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుని గా ఓ హైస్కూల్ లో పనిచేస్తున్న రోజులు. వాళ్ళబ్బాయి కి టి.సి. అర్జంట్ గా కావాలని వచ్చాడు ఓ వ్యక్తి.

"ఒక్క గంట ఆగి రండి. రికార్డులు అవీ తీయాలి గదా...రాసి ఉంచుతాం" అన్నాను.

"అబ్బే ...మేము బస్ కి వెళ్ళిపోవాలి " అతని మాట అది.

"అంత అర్జంట్ అయితే ఎలాగయ్యా ...చూసి రాసే టైం అయినా ఇవ్వలా వద్దా" నాకు కొద్దిగా కోపం వచ్చింది.

"అసలు ఇంతంత జీతాలు తీసుకుంటూ ఏం పని మీరు చేసేది ..." అంటూ హద్దు మీరి మాట్లాడాడు.

"ఏం...ఇదే మాట...ఒక పోలీస్ స్టేషన్ కో,రెవిన్యూ ఆఫీస్ కో వెళ్ళి మాట్లాడగలరా...ఎన్ని రోజులు తిప్పితే అన్ని రోజులు తిరుగుతారు...స్కూల్ కి వచ్చేసరికి పంతుళ్ళ ని చూస్తే మర్యాద లేకుండా మాట్లాడుతారు..." సీరియస్ గానే అన్నాను.

"మీరు కాసేపట్లో టి.సి. ఇవ్వకపోతే మా పెద్దాయన కి చెపుతాను" బెదిరించాడు.

"పో...చెప్పుకో...! ఈరోజు జూనియర్ అసిస్టెంట్ రాలేదు. టి.సి. రేపు రాసిస్తాం" నాలో మరింత అసహనం పెరిగింది. నిజానికి ఆ ఉద్యోగి రాలేదు కనక నేనే టి.సి. రాసిద్దాం అనుకున్నాను. అవతల వ్యక్తి అమర్యాదని తట్టుకోలేకపోయాను. కనక బెట్టు చేయక తప్పలేదు.

వీళ్ళ ఉద్దేశ్యం లో బడి పంతుళ్ళకి ఆత్మాభిమానం అనేది ఉండదనుకుంటారేమో..! చదువు పరంగా, జ్ఞానం పరం గా ఎంతో ఉన్నత స్థానం లో ఉన్నప్పటికీ ,సామాన్య గ్రామీణుడు ని సైతం సగటు ఉపాధ్యాయుడు ఎంతో మర్యాదనిచ్చి వ్యవహరిస్తాడు. అది ఇలాంటి అటూ ఇటూ గాని రాజకీయ కార్యకర్తలనే వాళ్ళకి చులకన గా అనిపిస్తుంది.వీళ్ళని ఓ మాట అన్నా పీకేదేమిటి అనే చిన్న చూపు. సాయంత్రం బడి ముగిసే సమయానికి ఈ చోటా కార్యకర్త మరొకడిని తీసుకుని వచ్చాడు.

"ఇపుడు బడి టైం అయిపోయింది. రేపు రండి" అన్నాను.

"ఏమిటి ...మా వాడు టి.సి. అడిగితే ఇవ్వనన్నారట" ఆ కొత్త వ్యక్తి అడిగాడు.

"ఇవ్వను అనలేదు. రాసే ఉద్యోగి రాలేదు. రేపు రమ్మని చెప్పాను" తాపీ గా జవాబిచ్చాను.

"మీ జీతాలన్ని ...మేము కట్టే టాక్సు లే ...తెలుసా " అన్నాడు.

"అలాగా...మీరు ఏడాదికి ఎంత టాక్స్ కడతారేం...నేను నా ఒక నెల జీతం రమారమి టాక్స్ చెల్లిస్తాను...కావాలంటే కాగితాలు కూడా ఉన్నాయి..." అన్నాను. వాళ్ళకి ఉన్న ఆస్తులకి,ఆదాయానికి తెల్ల కార్డ్ ఉండకూడదు. కానీ వాళ్ళకవి ఉన్నాయి. పైగా అతి తెలివి మాటలు ..!

ఇద్దరూ ఖంగు తిన్నారు. వీడెవడో సామాన్యుడిలా లేడనుకున్నారు.

"సరే..రేపు ఇస్తా అంటన్నాడుగా...పద.." అంటూ కొత్త వ్యక్తి పాతవాడిని తీసుకెళ్ళిపోయాడు.  

ఆ తర్వాత రోజు వచ్చి టి.సి.తీసుకుని వెళ్ళిపోయారు. ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడలేదు. ఒకరోజు టైం తీసుకుని ఇక వాళ్ళ తడఖా చూపించడం మొదలెట్టారు. స్కూల్ గోడకి ఆనుకుని ఓ కుక్క మృతదేహం ఉంది. ఓ రోజు బడికి వెళ్ళేసరికి..! పరమ కుళ్ళు వాసన ...పిల్లలు,టీచర్స్ భరించలేక కర్చీఫ్ లు అడ్డుపెట్టుకున్నారు. విషయం అర్థమయింది. ఆ ఇద్దరు వెధవలు చేసిన కంపు పని ఇది. ఇలా కక్ష తీర్చుకుంటున్నారన్న మాట. బయటకి మాత్రం ఆ విషయాన్ని అనలేదు. గ్రామపంచాయితీ ఆఫీస్ కి వెళ్ళి ఫిర్యాదు చేశాను.

మధ్యానం కల్లా వాళ్ళు వచ్చి శుభ్రం చేశారు. ఆ రోజు తో ఆ సమస్య అయిపోయింది. మరో రోజు వచ్చేసరికి, ఓ క్లాస్ రూం అరుగు మీద మానవ మలం ఉంది. ఎంత సైకోపాత్ లురా మీరు. మిమ్మల్ని ఏం చేసినా ఫర్వాలేదు. ఇక లాభం లేదని చెప్పి ఊళ్ళో పేరెంట్స్ ని అందర్నీ పిలిచి మీటింగ్ పెట్టి ఈ దరిద్రపు వ్యవహారాల్ని వివరించాం. "సరే సార్...మేము ఓ కన్నేసి ఉంచుతాం ఈ కాణ్ణుంచి" అన్నారు వాళ్ళు. ఈ సారి స్టైల్ మారింది. మళ్ళీ ఓరోజు స్కూల్ కి వెళ్ళేసరికి స్టాఫ్ రూం కిటికీ బద్దలై ఉంది. లోపల బీరు సీసా పెంకులున్నాయి.    


చూస్తే పరమ అమాయకుల్లా కనిపిస్తారు. కాని ఎంత నీచమైన ఆలోచనలు ఉంటాయి ఈ మనుషుల్లో..! ఇతరుల్ని ఏడిపించి సంతోషించడం లో వీళ్ళ రూటే సపరేటు. అవతలి వాడు కాస్త మెతక, మనల్ని ఏం చేయలేడు అనుకుంటే ఇక ఆడుకోవడం మామూలు గా ఉండదు.

ఏ పుట్టలో ఏ పాము ఉందో చెప్పలేం అని ఓ సామెత. బజారు నుంచి ఆటో లో ఇంటికి వస్తున్నా ఓ రోజు. స్కూటర్ టైర్ పంక్చర్ అవడం తో తప్పలేదు మరి. తీరా చూస్తే ఆ ఆటో డ్రైవర్ నా దగ్గర అయిదవ తరగతి దాకా చదువుకున్నవాడే. గుర్తు పట్టి పలకరించాడు.

"సారీ బాబు. నిన్ను గుర్తు పట్టలేకపోయాను. చిన్నతనానికి ఇప్పటికి మీ రూపురేఖలు మారిపోతాయి గదా" అన్నాను.

"భలేవారే సార్. దానికే మీరు సారీ చెప్పాలా...మేము ఎప్పుడూ మీ ముందు పిల్లలమే " అన్నాడు వినయం గా.

"నీ పేరు ఏమిటి బాబూ ..." గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాను.

" వీరేంద్ర సార్. అంతా నన్ను వీరూ అని పిలిచేవారు ఆ రోజుల్లో " అన్నాడు తను.

"ఆ...ఆ...అవును. అప్పుడు బాగా టైర్ తిప్పుకుంటూ ఆడుకునేవాడివి. మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టం మీద నిన్ను బడికి తీసుకొచ్చేవాళ్ళు...ఇపుడు గుర్తుకు వచ్చావురా అబ్బాయ్ ...  అవును...మరి శేఖర్,రాజబాబు వాళ్ళంతా ఏం చేస్తున్నారు" ఆనందం గా అడిగాను.

"వాళ్ళంతా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లయి అమెరికా వెళ్ళిపోయారు సార్. నాకు చదువు అబ్బక... ఇలా ఆటో నడుపుతున్నాను. ఇంకా రెండు ఆటో లు ఉన్నాయ్ సార్...అవి అద్దె కి ఇస్తుంటాను...సొంత ఇల్లు కట్టుకున్నా...పిల్లలు చిన్నవాళ్ళు .." అంటూ వీరూ చెప్పుకుపోతున్నాడు. వాడి ఆనందం ఆ కళ్ళలో తెలిసిపోతూనే ఉంది. 

"చాలా సంతోషం నాయనా. ఏ వృత్తి తక్కువా కాదు ఎక్కువా కాదు. అలాంటివి మనసు లో పెట్టుకోకు. నువ్వు చెప్పిన వివరాల్ని బట్టి నువు పైకొచ్చినట్లే లెక్క. చిన్న వయసు లోనే సొంత ఆటోలు కొనుక్కున్నావు, అలాగే సొంత ఇల్లు నిర్మించుకున్నావు. అది మామూలు విషయం కాదు..." ఆ మాటలు నా గుండెలోనుంచి వచ్చాయి.

"ఇపుడెక్కడ చేస్తున్నారు సార్..." అడిగాడు వీరూ.

"నందిపాడు అని. అక్కడ హైస్కూల్ లో చేస్తున్నా. ఆ వుళ్ళో కొంతమంది ఉన్నారు...స్కూల్ ని చెండాలం చేస్తున్నారు..." లోపల ఉన్న భావం బయటకి అనాలోచితం గా వచ్చేసింది.

"ఏం చేస్తున్నారు..." ప్రశ్నించాడు.

"తాగి బీరు సీసాలు పగలగొట్టి స్కూల్ లో వేయడం...నానా అశుద్ధం అంతా చేసి బడి అరుగుల్ని పాడుచేయడం ...రోజూ ఒక్కో వెధవ పని చేస్తున్నారు " అంటూ వాళ్ళ పేర్లు కూడా చెప్పాను. వీరూ జాగ్రత్త గా విని ఏమి జవాబు చెప్పకుండా నన్ను మా ఇంటి దగ్గర దించేసాడు. డబ్బులిస్తున్నా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.  

తెల్లవారి స్కూల్ కి వెళ్ళాను. ఎలాంటి అశుద్ధం లేకుండా క్లీన్ గా ఉంది. హమ్మయ్యా అనిపించింది. ఎన్నాళ్ళకి ఇలా...అని నిట్టూర్చాను. స్టాఫ్ ఇంకా స్టూడెంట్స్ కూడా సంతోషించారు. ఈ మన బడి కి మంచి రోజులు వచ్చాయని..! దానికి కారణం ఏమిటో రమారమి ఇంట్రవెల్ సమయానికి గాని తెలిసింది.

పదకొండు గంటలు దాటిన తర్వాత ఇద్దరు యువకులు వచ్చారు. తమని తాము ఆ గ్రామస్తులు గా పరిచయం చేసుకున్నారు.

"సార్...మమ్మల్ని వీరూ అన్న పంపించాడు. స్కూల్ లో చెత్తా చెదారం వేసి మీకు ఎవరో ఇబ్బందులు కలిగిస్తున్నారట గదా...వాళ్ళకి మేం చెప్పాము. మీ జోలికి ఇక వాళ్ళు రారు. కాదని మళ్ళీ ఏమైనా చికాకు చేస్తే మాతో చెప్పండి...మేము చూసుకుంటాం..!" అని ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోబోతుండగా నేను అడిగాను.

"వీరూ ...అంటే ...తను ఆటో డ్రైవరే గదా..." అని.

"అవును సార్, ఆటో డ్రైవర్ల యూనియన్ కి డివిజన్ ప్రెసిడెంట్ కూడా..! తనకి ప్రతి గ్రామం లోనూ మనుషులున్నారు.ఎవరికి ఏది ఎట్లా చెప్పాలో అన్న కి బాగా తెలుసు. మీరింకా ఆ విషయాన్ని ఆలోచించడం మానేయండి.." అంటూ ఆ యువకులు వెళ్ళిపోయారు.

ఆ తర్వాత ఎవరూ మా స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఊళ్ళో వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టినా సమస్య పరిష్కారం లేదు. ఎంత మంచి గా చెప్పినా చేసేది చేసుకుంటూనే పోయారు. కాని నా కంటే అనుభవం లోనూ,వయసు లోనూ ఎంతో చిన్నవాడైనా వీరూ ఒక్క మూవ్ తో తన శక్తి ని చూపించాడు. 

కాబట్టి లోకం లో ఎవరినీ తక్కువ అనుకోకూడదు. ప్రతి మనిషి కి ఒక గొప్పతనం అంటిపెట్టుకుని ఉంటుంది. అది ఎక్కడ ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది. చిన్నప్పుడు వీరూ కి చదువు రావడం లేదని,స్కూల్ ఎగ్గొట్టి బలాదూర్ తిరుగుతున్నాడని వాళ్ళమ్మా నాన్న ఎంతో బాధ పడేవారు. కాని వీరూ లోకం పోకడని,మనుషుల తీరు ని బాగా చదివాడు. అందుకే కేవలం ఓ ఆటో డ్రైవర్ గానే అతను ఉండిపోలేదు...అక్కడ నుంచి కూడా తన నాయకత్వ లక్షణాల్ని ప్రసరించగలుగుతున్నాడు. 

నా ఈ బ్లాగ్ పోస్ట్ ని చదివిన ఓ వ్యక్తి కామెంట్ సెక్షన్ లో తన అభిప్రాయాన్ని పెట్టాడు. అది ఇలా ఉంది.

" సార్...మీరు రాసిన అనుభవం నూటికి నూరు పాళ్ళు నిజం. అది మీ ఒక్కరి అనుభవం మాత్రమే కాదు. ఇంచు మించు ప్రతి ఉపాధ్యాయుని ది కూడా. సమాజం పట్ల గౌరవం తో మెసిలే ఉపాధ్యాయుని కి ఇవ్వవలసిన గౌరవం తిరిగి ఇవ్వదు సమాజం. మరీ ముఖ్యం గా ఈ మధ్య కాలం లో విలువలు మరీ పతనం అయ్యాయి. ఏ జాబ్ రాక దీంట్లోకి వచ్చేవారే తప్పా ఒక పేషన్ తో ఈ వృత్తి లోకి వచ్చేవారు తగ్గిపోయారు. మీ బ్లాగ్ రాసే విధానం ఎంతో బాగుంది.అభినందనలు. ఇంకా రాస్తూండండి. మా లాంటి ఆసక్తిపరులం ఎందరో ఇలాంటి పోస్టులు చదివి ఎన్నో సంగతులు తెలుసుకోగలుగుతాం" అంటూ రాశాడు.

"తప్పకుండా...జీవన్ గారు. మీ అభిప్రాయాలతో కూడిన అభినందనకి చాలా కృతజ్ఞతలు.." అని సమాధానమిచ్చాను. అతని జీమెయిల్ ప్రొఫైల్ లో ఆయన పేరు ఉంది.కనక పేరు అడిగే అవకాశం లేకుండానే తెలిసిపోయింది.ఫర్వాలేదు. కొన్ని మంచి విషయాల్ని చదివే పాఠకులు ఇంకా ఉన్నారు.సంతోషమనిపించింది.

ఆ తర్వాత నా ఆధ్యాత్మిక,సాధనా పరమైన విషయాల్ని కూడా రాయసాగాను. మరీ లోతైనవి కాకుండా జనసామాన్యానికి సులభం గా అర్థమయ్యేవి. దానికి కూడా మంచి స్పందన వచ్చేది. కొన్ని ఇంగ్లీష్ పుస్తకాల మీద,తెలుగు పుస్తకాల మీద కూడా రివ్యూ లు రాసేవాడిని. నా యాత్రానుభవాలు సాగిన వైనం గురించి ఫోటోలతో సహా రాసినపుడు ఊహించని ప్రతిస్పందన వచ్చేది. వివిధ రాష్ట్రాల్లో ప్రతి యేటా పర్యటించే నా అలవాటు ని కొనసాగిస్తూనే ఉన్నాను.

ఒక బ్లాగు ఇంగ్లీష్ లోనూ ,మరో బ్లాగు తెలుగు లోనూ రాసేవాడిని. తెలుగేతర ప్రజల కోసం ఇంగ్లీష్ బ్లాగ్ బాగా ఉపకరించేది.వివిధ రాష్ట్రాల నుంచి మంచి బ్లాగర్ మిత్రులు ఏర్పడ్డారు.అక్కడి ప్రదేశాల గురించి ,ఆచార వ్యవహారాల గురించి తెలుసుకుని ఆనందించేవాడిని.అదే విధంగా మన విషయాలు రాసినపుడు వారి నుంచి చక్కని స్పందన వచ్చేది.నిజంగా బ్లాగింగ్ అనేది చాలా నేర్పిస్తుంది.మనకి తెలియకుండానే ఓ జాతీయ సమగ్రత ని మనలో కలిగిస్తుంది. 

కేరళ రాష్ట్రం లోని కొన్ని ప్రదేశాలు,అలాగే కర్నాటక రాష్ట్రం లోని కూర్గు ప్రాంతాన్ని సందర్శించాను. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రదేశాల్ని చూశాను. ఆ అనుభవాలన్నీ ఫోటోలు జోడించి బ్లాగ్ లో రాశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్లాగ్ యొక్క లింక్ ని ఫేస్ బుక్ లో కూడా ఇచ్చేవాడిని. అలా ఎక్కువమంది చూసే అవకాశం కలిగేది. వాళ్ళ అభిప్రాయాలు నేనూ తెలుసుకోగలిగేవాణ్ణి. 

ఒకసారి ఎందుకనో పాత సంగతుల్ని పోస్ట్ చేశాను. నాటి దుమ్ముగూడెం పరిసరాల్లోని, బ్రిటీష్ వారి వదిలిపెట్టి పోయిన ఆవాసాల గురించి రాశాను. అప్పటి ఫోటోల్ని కొన్ని పెట్టాను. దానికి జీవన్ వెంటనే కనెక్ట్ అయ్యాడు.అతను కూడా ప్రస్తుతం ఆ ప్రాంతానికి దగ్గర లో పనిచేస్తున్నానని, నివాసం భద్రాచలం అని రాశాడు. మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనే ప్రసిద్ధ స్వఛ్చంధ సంస్థ ఇక్కడ తమ బృందం తో పనిచేస్తోందని,దాంట్లో తాను స్థానిక ఉద్యోగి గా పనిచేస్తున్నానని రాశాడు. 

నేను నా ఫోన్ నెంబర్ పెట్టాను తర్వాత పోస్ట్ లో..! అనుకున్న విధంగానే జీవన్ ఫోన్ చేశాడు.

"హలో సార్...బావున్నారా...నేను జీవన్ ని. మీరు రాసిన పోస్టులు బావుంటాయి. బ్రిటీష్ వారి చరిత్ర ని వివరించే పోస్ట్ ఒకటి ఈ మధ్య పెట్టారు గదా...ఆ లొకేషన్స్ ని నేను చూశాను.అప్పటికీ ఇప్పటికీ చాలా దెబ్బతిన్నాయి సార్..." అంటూ మాట్లాడాడు.

"ఏమి చేయగలం జీవన్ గారు. జనాలకి చరిత్ర తెలియాలని ఏదో తాపత్రయపడుతూ...ఇలాంటివి రాస్తుంటాం. ఎవరి జీవితం తో వారు బిజీ...ఎవరు పట్టించుకుంటారు " అన్నాను నిర్వేదంగా.

"కనీసం ఆ విధంగా గుర్తు చేయడం కూడా అవసరం సార్. ప్రతి మండలం లోనూ ఉన్న చారిత్రక అవశేషాల్ని సంరక్షించడానికి స్థానికులు కూడా పూనుకోవాలి. ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావాలి" జీవన్ ఆవేశం గా చెప్పాడు.

"అన్నట్టు మీ సంస్థ చేసే పనులు ఏమిటి..?" ప్రశ్నించాను.

"మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ అనేది ఇంటర్నేషనల్ గా బాగా పేరున్న ఎన్.జి.వో. సార్..! ఈ డివిజన్ లోనే కాకుండా పక్కనే ఉన్న చత్తీస్ ఘడ్ లోతట్టు గ్రామాల్లోకి కూడా వెళ్ళి పేద ప్రజలకి వైద్య సహాయం చేస్తుంటారు. నేను దీంట్లో అకౌంట్స్ రాసే ఉద్యోగిని. కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్నాను" అన్నాడు జీవన్ తన వివరాలు చెబుతూ.

"మీ వయసు ఎంత..." ప్రశ్నించాను.

"ముప్ఫై సార్..." అన్నాడు తను.

"ఓ...ఇంచు మించు నా వయసు లో సగం. చాలా సంతోషం. జీవన్ గారు...మీకు చరిత్ర ...ఆ విశేషాలు ...ఇష్టమనుకుంటా గదా...లేకపోతే ...నేను రాసిన ఆ పోస్ట్ లకి కనెక్ట్ కారు" చెప్పాను నాలోఉన్న మాటని. 

"అవును సార్. గతం లేకపోతే వర్తమానం లేదు గదా. ఏమి నేర్చుకున్నా దాన్నుంచే నేర్చుకోవాలి. చారిత్రక విషయాలు అంటే ...చదవడం ఇంకా చూడటం నాకు ఇష్టమైన అంశాలు" జీవన్ మాటల్లో నిజాయితీ ధ్వనించింది.

"ఇన్నాళ్ళకి ఒక మంచి అభిరుచి కలిగిన యువకుడిని కలిసినందుకు...అదే...తెలుసుకోగలిగినందుకు చాలా ఆనందం గా ఉంది జీవన్ గారు. మీ అభిరుచి ని అలాగే కొనసాగించండి" అన్నాను.       

 ఆ విధం గా మా సంభాషణ ముగిసింది.

సాయంత్రం పూట కేదారేశ్వర ఆలయానికి వెళ్ళాను. చాలా పురాతమైన గుడి అది. ఒరిస్సా ఆలయ నిర్మాణ వైభవానికి ఓ మచ్చుతునక అని చెప్పాలి. ఎర్రటి సాండ్ స్టోన్ తో కట్టిన ఆ నిర్మాణం లో ఉప ఆలయాలు,తోరణాలు ప్రత్యేక ఆకర్షణ గా ఉంటాయి. ఏదో కాలానికి మనల్ని తీసుకుపోతుంటాయి. ఆ సాయం సమయాన ఎవరూ లేరు. నీటి కొలను పక్కనే కాసేపు కూర్చుని ధ్యానం చేసుకున్నాను. 

కాలం నిలిచిపోయిన అనుభూతి. ఈ కళింగ భూమి లో ఏదో చెప్పలేని ఆకర్షణ ఉంది. నిలువు గా మనిషి నిలబడినట్లు ఉంటాయి...ప్రధాన గర్భాలయాలు...లోపలికి వెళితే గది గుండ్రంగా ఉండి విగ్రహాలు లేదా లింగాకారము ఉంటాయి. ముఖ్యంగా రాజా రాణి ఆలయం ..! దక్షిణాది,ఉత్తరాది ఆలయ శైలి ని కాపీ కొట్టకుండా తమదైన ఒక సంతకాన్ని ఈ నిర్మాణాల్లో వదిలిపెట్టి పోయారు ఆ శిల్పులు ఎవరో..!ఆస్తికులైనా,నాస్తికులైనా ...ఆ నిర్మాణ కౌశలానికి ముగ్ధులవవలసిందే..!    

నా యోగ సాధన ని కొనసాగిస్తూనే ఉన్నాను. ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి. కొన్ని చెబితే నమ్మదగినవి. కొన్ని చెబితే నమ్మలేనివి. ఏదైనా ఎంతో నిధి ని మన పూర్వులు నిస్వార్థంగా వదిలి వెళ్ళారు. అవి తీసుకున్నవాళ్ళకి తీసుకున్నంత..! విగ్రహారాధనలు,పూజలు,పునస్కారాలు, వాదోపవాదాలు అన్నీ ఒక స్థాయి వరకే..! ఆ తర్వాత అంతా మరో జన్మ లాంటిది. అది అనుభవం లోనే తెలియగలదు. మనిషి దేనిగురించి పెనుగులాడుతుంటాడో అది ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా దొరుకుతుంది. అయితే ప్రతి దానికీ ఓ సమయం ఉంది.

ఒకసారి ఎందుకో యయాతి అనే భారతం లోని పాత్ర గురించి తెలుసుకోవాలనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు లైబ్రరీ లో కథల్లో చదవడమే తప్పా పెద్దగా ఆ పాత్ర గురించి తెలియదు. ఎందుకు ఆ పాత్ర స్ఫురణకి వచ్చింది అనేది మొదట అర్థం కాలేదు. కట్టా సుబ్బారావు గారు ఇచ్చిన పుస్తకాల్లో అది కూడా ఉన్నట్లు జ్ఞాపకం వచ్చింది.ఒక్కో పుస్తకం ఒక్కో సమయాన్ని ఎంచుకుంటుంది. తనని ఎవరెవరు చదవాలో..!

పాత పుస్తకాల అరల్ని దులిపాను. యయాతి బయటపడింది. ఆకలిగొన్న వాడి లా చదివాను.ఎంత ఆసక్తికరమైన కథనం.మానవ దేహం లో దాగి ఉండి ఎప్పటికీ చల్లారను,మరో దేహం లోని శక్తి ని ఎవరైనా ఇస్తే బాగుండును ఈ అంతులేని లాలస ని కొనసాగించడానికి అని ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు తప్పక అనిపిస్తుంది. ఆ నేపథ్యాన్ని ఆలంబన గా చేసుకుని వృషపర్వుడు, శర్మిస్ఠ,శుక్రాచార్యుడు,దేవయాని,యయాతి ఇంకా ఇతర పాత్రలతో ఈనాటికీ పనికి వచ్చే గొప్ప నీతి ని రచయిత చెప్పాడు.

మనిషి యొక్క అంతర్లోకాలను ఆ రోజుల్లోనే ఎంత సూక్ష్మంగా విశదీకరించారు మహానుభావులు అనిపించింది. అందుకే అవి ఈనాటికీ నిలిచిఉన్నాయి,ఎవరి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా..! నా పెదవులపై చిరునవ్వు విరిసింది.ప్రతి మనిషి లోనూ ఓ యయాతి ఉన్నాడు. అయితే అతని పుత్రుల్లో పురూ వంటి వారు మాత్రం ఇప్పుడు ఎవరూ లేరు. ఈ వృత్తాంతం చదవకపోయి ఉంటే ఆ లోటు ఎప్పటికీ లోటే..!    

 ఈ ఆలోచనల్లో మునిగి ఉండగా పోస్ట్ మేన్ ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు. చింపి చూస్తే సి.ఐ.ఐ.ఎల్. సంస్థ వాళ్ళు మైసూర్ నుంచి పంపిన లేఖ. అనువాదకులకు శిక్షణ ఇచ్చేందుకు గాను ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ గత కొన్నేళ్ళ నుంచి క్లాస్ లు నిర్వహిస్తోంది.దానికి ఎంపిక అయినట్లుగా సారాంశం. సంతోషమనిపించింది. రెండు రోజుల్లో బయలుదేరాలి. దానికి గాను వెంటనే పనులు మొదలు పెట్టాను.

లెటర్ లో ఉన్న మిగతా పార్టిసిపేంట్స్ ని చూస్తే ఇతర రాష్ట్రాల వారు ఎక్కువ ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల వారు,ఉత్తర ప్రదేశ్,మహారాష్ట్ర, తమిళనాడు,కేరళ ఇంకా ఇతరులు ఉన్నారు. హైద్రాబాద్ నుంచి చూస్తే బి.ఆర్.శర్మ గారని ఒకాయన పేరు కనబడి ఆనందమనిపించింది. గతం లో బెంగుళూరు లో,మడికేరి,కూర్గు ప్రాంతాలవైపు వెళ్ళిన అనుభవాలున్నాయి గాని మైసూరు వెళ్ళలేదు. మొత్తానికి కేంద్రప్రభుత్వం వారి సంస్థ ఆహ్వానం మేరకు వెళుతున్నాను.

మైసూర్ లో దిగి సి.ఐ.ఐ.ఎల్ వారి కార్యాలయం కి వెళ్ళేసరికి సాయంత్రం అయింది. వచ్చిన వాళ్ళందరికి హాస్టల్ సదుపాయం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో కోలాహలం గా ఉంది. ఇలాంటి సందర్భాలు జాతీయ సమగ్రత ని ప్రతిబింబిస్తూంటాయి. ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రం వారితో తరచూ కలవడం వల్ల దగ్గరితనం పెరుగుతుంది.ఒకరికొకరు వారి గురించి తెలుసుకుని వాళ్ళ మధ్యన ఉన్న అపోహల్ని పోగొట్టుకుంటారు.

రూం బాగుంది. ఒక బెడ్,టెబిల్ ఇంకా కుర్చీ ఉన్నాయి. బాత్ రూం అవీ అటాచ్డ్ గా ఉన్నాయి. విశాలమైన ప్రాంగణం లో రకరకాల చెట్లు ఉన్నాయి. చల్లటి గాలి, నీడ ఎంతో ఆహ్లాదం గా అనిపిస్తున్నాయి.కేంటిన్ లో డిన్నర్ ముగించి నడుము వాల్చేసరికి నిద్ర వెంటనే పట్టేసింది. ప్రయాణ బడలిక వల్ల..!తెల్లారితే క్లాసులు..!

నా పక్క రూం లో ఉన్న యువకుని పేరు భైజాన్ దాస్. అస్సాం నుంచి వచ్చాడు. పరిచయం చేసుకున్నాం ఇద్దరం. ఇరు రాష్ట్రాల కబుర్లు ఇంకా పిచ్చాపాటీ సాగింది. ఆ తర్వాత క్లాస్ కి వెళ్ళాము. క్లాస్ రూం విశాలంగా ఉంది. పవర్ ప్రెజెంటేషన్ తో క్లాసులు సాగాయి. దేశం లోని అనేకమంది లబ్దప్రతిష్టులైన ప్రొఫెసర్లని తొలిసారిగా కలిసి ముచ్చటించే అవకాశం కలిగింది. అనువాద సమస్యలు,వ్యూహాలు, అనువాద పుస్తకాలు ఇలా ఎన్నో విషయాలపై ప్రతి రోజూ క్లాసు లు జరిగాయి. 

ప్రభాత్ పట్నాయక్ గారి వ్యాసాలు తెలుగు పత్రికల్లో అనువాద రూపం లో ఎప్పటినుంచో చదువుతుండేవాడిని. చివరి రోజున ఆయన ప్రసంగించారు. ఒరియా నుంచి మనోజ్ దాస్ గారి తెలుగు అనువాదాల గురించి చెప్పాను. ఆయన అభినందించారు. ఎంతో అనుభవజ్ఞుల,మేధావుల ఆధ్వర్యం లో జరిగిన ఈ క్లాసులు ఎప్పటికీ గుర్తు పెట్టుకోదగ్గవి. ఇంచు మించు ప్రపంచం లోని ప్రతి అనువాద పుస్తకం గురించి ప్రస్తానకొచ్చింది.ఇంకా ఎన్నెన్నో..!

      
దాదాపు ఇరవై రోజుల పాటు సాగిన క్లాసులు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాయి. మధ్యలో ఆటవిడుపు గా సెలవులు దొరికినపుడు కేంపస్ లో నుంచి బయటపడి మైసూర్ అంతా తిరిగేవాళ్ళం. శర్మ గారి రూం కి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. సాటి తెలుగువాడిగా..! ఆయన కి ఈ మైసూర్ పరిసరాలు బాగా తెలుసు. గతం లో తిరిగినవేనని చెప్పారు. అంతే గాక కన్నడ భాషలో కూడా మంచి ప్రవేశం ఉంది.

"ఈ రోజు పదకొండు గంటలకి మైసూర్ ని ఆనుకుని ఉండే కేరళ ప్రాంతానికి వెళుతున్నాం. సుల్తాన్ బత్తేరి అని, చూడవలసిన ప్రాంతం. మీరు కూడా వస్తారా ...వస్తానంటే బస్ లో సీట్ బుక్ చేస్తాను" అన్నారాయన.

"సరే...అలాగే. నా చార్జ్ ఎంత చెప్పండి...అన్నట్టు అది ఒక్కటేనా..! ఇంకా ఏమైనా కవర్ అవుతాయా " అడిగాను.

"రిటన్ లో శ్రీరంగపట్న ,మైసూర్ పేలస్ లాంటివి కూడా కొన్ని ఉన్నాయి.అవి కూడా చూడచ్చు" అన్నారు శర్మ గారు.

బస్ బయలుదేరింది. పశ్చిమ కనుమల ప్రభావం వల్ల విస్తారంగా కురిసే వానల వల్ల అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండే గ్రామాల గుండా,అడవుల గుండా బస్ సాగిపోతోంది. ఎట్టకేలకు సుల్తాన్ బత్తేరి చేరుకున్నాము. కేరళ లో ఉన్న చిన్న పట్టణం ఇది. ఇక్కడ టిప్పు సుల్తాన్ కట్టించిన ఆయుధాగారాలు ,కోటలు ఉన్నాయి. అవి చూశాము. అలా వీథుల్లో కాసేపు తిరగడం జరిగింది. ఇక్కడ కొన్ని జైన ఆలయాలు ఉన్నాయి. వాటిని కూడా మంచిగా సంరక్షిస్తున్నారు. పురాతన మానవుల గుహలు కూడా ఉన్నాయి. అన్నీ చూడదగినవే..!

వచ్చేటపుడు ఒకచోట బస్ టైర్ పంక్చర్ అయింది. దానితో మైసూర్ కి వెళ్ళేసరికి బాగా లేటయింది. కనక మిగిలిన ప్రాంతాల్ని వచ్చే ఆదివారం కవర్ చేద్దాం అని నిర్ణయించడం జరిగింది. అందరూ అంగీకరించారు. ఆ సుల్తాన్ బత్తెరి లో కూడా తలా ఓ చోటకి వెళ్ళి బస్ దగ్గరకి రావడం లో కూడా  లేటు చేయడం వల్ల కూడా రిటన్ జర్నీ లేటయిందని చెప్పాలి. ఎక్కువమంది జనాలతో జర్నీలు చేస్తే ఇదో గోల. కొంతమంది కో ఆర్డినేషన్ లేకుండా వ్యవహరించి జర్నీ ప్లాన్ నే పాడుచేస్తారు.
  
   తర్వాత ఆదివారం రోజున బస్ ఎక్కి శ్రీరంగపట్న,మడికేరి, కూర్గు ప్రాంతాల్ని సందర్శించాము. కూర్గు పరిసరాలు ఆకుపచ్చని పరిసరాలతో , ఆ మధ్య మధ్య కట్టుకున్న ఇళ్ళతో ప్రశాంతం గా ఏదో యూరపు లోని దేశం లో ఉన్నామా అన్నట్లు కనిపించింది.చాముండేశ్వరి ఆమ్మవారి ని వచ్చేటపుడు దర్శనం చేసుకున్నాము. ఎత్తైన గుట్టల మధ్య ,అడవుల మధ్య ఆ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.

"ఆర్.కె. నారాయణ్ ...ఒకప్పటి భారతీయాంగ్ల రచయిత ఆయన ఇంటిని కూడా సందర్శించుదాం" అన్నారు శర్మ గారు.

"అలాగే...మరి ఇపుడు ఎలా" అన్నాను.

"మనం మైసూర్ లో బస్ స్టాండ్ దగ్గర దిగిపోదాం. బస్ లో మన బ్యాచ్ అంతా కేంపస్ కి వెళ్ళిపోతారు" అన్నారు.

బస్ నిర్వాహకుడికి ఈ విషయం చెప్పగా అతను "సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర దింపుతాను. అక్కడ నుంచి మీరు యాదవగిరి ఈజీ గా ఆటోలో  వెళ్ళవచ్చు. ఆర్.కె. నారాణ్ ఇల్లు అక్కడే ఉన్నది"  అన్నాడు.

సరే అని అక్కడే దిగాము... ఆటో తీసుకుని యాదవగిరి లో ఉన్న ఆర్.కె నారాయణ్ ...రైటర్ ఇల్లు అంటే మాట్లాడకుండా తీసుకెళ్ళి అక్కడ దింపాడు. అడ్రస్ చాలా ఈజీ గా దొరికింది. ఆ ఇంటికి ఇవతల ఓ హోటల్ ఉంది. పెద్దగా రష్ లేదు ఆ ఏరియా లో..! శుభ్రంగా ఉన్నాయి రోడ్లు,ఇళ్ళు అన్నీ..!

మాల్గుడి డేస్ తో ప్రఖ్యాతి పొందిన ఆర్.కె. నారాయణ్ గారి ఇంట్లోకి ప్రవేశించాము. ఆయన నివసించిన ఇంటిని మ్యూజియం లా మార్చారు. ఆయన పుస్తకాలు,దుస్తులు,పెన్నులు,సేకరించిన ఫోటోలు,కుర్చీలు ...అన్నీ అలాగే భద్రపరిచారు. ఆ ప్రదేశం అంతా చెట్ల తో నిండి చల్లగా ఉంది. ఈ మైసూరు లో ఎక్కడికి వెళ్ళినా పచ్చదనం,శుభ్రత కనుల విందుగా ఉంటుంది. 

అనువాద శిక్షణ ముగించుకుని చివరి రోజు కి వచ్చాము. అందరం కలిసి కొన్ని గ్రూప్ ఫోటోలు దిగాము. వాళ్ళంతా ఇపుడు ఎక్కడ ఉన్నారో,ఏం చేస్తున్నారో తెలియదు. అస్సాం నుంచి భైజాన్ దాస్ ఆ రాష్ట్రం లోనే ఫ్రెంచ్ టీచర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. జలకంఠేశ్వరి అనే గుజరాతీ యువతి రష్యన్ అనువాదకురాలిగా వేరే దేశం లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదంతా ఫేస్ బుక్ వల్ల తెలిసినదే. మిగతా వాళ్ళ గురించి తెలియదు. జీవితం అనే రైలు లో ఎవరు ఎక్కడ ఎక్కి ఎప్పుడు ఎందుకు దిగిపోతారో కనుమరుగైపోతారో మనం ఊహించలేము.

శర్మ గారు మాత్రం ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. ఫోన్ లో ఎప్పుడైనా మాట్లాడుకోవడం ద్వారా..! నేను భువనేశ్వర్ వచ్చి నా బ్లాగింగ్ కార్యకలాపాల్లో మళ్ళీ బిజీ అయిపోయాను. స్థానిక ఇంగ్లీష్ న్యూస్ పోర్టల్ వాళ్ళు తమ కోసం కంటెంట్ రాయమంటే రాస్తున్నాను.జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రవహిస్తుంది. మనం ఊహించలేని దారుల్లోకి...!ఒక రోజు జీవన్ ఫోన్ చేశాడు. తాను కలకత్తా వెళుతున్నానని...మీకు టైం ఉంటే భువనేశ్వర్ లో దిగి కాసేపు మాట్లాడతానని...! దానిదేముంది రమ్మన్నాను.

తాను చెప్పిన టైం కి రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. మొత్తానికి జీవన్ ని ప్రత్యక్ష్యంగా చూడగలిగాను. ఆనందంగా షేక్ హేండ్ ఇచ్చాను. తను కూడా ఎంతో సంతోషంగా ఫీలయ్యాడు.

"వెరీ హేపీ సార్...మిమ్మల్ని కలుసుకున్నందుకు" అంటూ తను నాకు భద్రాచల రాముడి ప్రసాదం అందించాడు. కళ్ళకి అద్దుకుని తీసుకున్నాను. మళ్ళీ భద్రాచల ప్రాంతం అంతా ఆ ప్రసాదం రూపం లో నా చేతిలోకి వచ్చినట్లు అనిపించింది.

"ఈ రోజు ఇక్కడి ఉండి తర్వాత వెళ్ళచ్చుగదా... ఐ మీన్ బ్రేక్ జర్నీ" అన్నాను.

"లేదు సార్, వేరే ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, కేవలం మిమ్మల్ని కలవడం కోసమే ఫోన్ చేశాను, ఎలాగు ఓ పది నిమిషాలు రైలు ఇక్కడ ఆగుతుంది గదాని, మళ్ళీ సారి ఎప్పుడైనా వస్తా  "  అన్నాడు జీవన్.

"ఏమిటి భద్రాచలం ...ఆ ఏరియా సంగతులు..." అడిగాను.

"మీకు తెలిసిందే గద సార్. ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలు వేరయ్యాయి...ముఖ్యంగా ఆ దెబ్బ భద్రాచలం ఏరియా మీద బాగా పడింది" 

"ఎలా" 

" పట్టణానికి అటు వైపు,ఇటువైపు ఒక్క కిలోమీటర్ కూడా గేప్ లేకుండా ఆంధ్రా లో కలవడం వల్ల చెత్త పోయడానికి కూడా స్థలం లేకుండా పోయింది. పడమర వైపు గోదావరి బ్రిడ్జ్..." 

"మరి కరకట్ట వైపు.." 

"చివరికి చెత్త ని అంతా తీసుకుపొయి ఆ కరకట్ట చివరనే  డంప్ చేస్తున్నట్లున్నది ప్రస్తుతం. రాజుపేట, మేడువాయి ...లాంటి శివారు వీథులు ఉన్నట్లుండి తూర్పు గోదావరి జిల్లా లో కలిసిపోయాయి. సరే..ఇపుడు ఏ.ఎస్.ఆర్. జిల్లా లోకి మార్చారు..." 

"పర్ణశాల వెళ్ళేదాకా ...అటువేపే కలిసిందా" 

"అదే విచిత్రం. భద్రాచలం శివారు వీథి రాజుపేట నుంచి....ఎటపాక ...మీదుగా...కన్నాయిగూడెం వరకు అంటే సుమారు పన్నెండు కిలోమీటర్లు వరకు ఆంధ్రా లో కలిసి మళ్ళీ అక్కడనుంచి పర్ణశాల వరకు, ఇంకా ఆ పై వరకు తెలంగాణా లో కలిసింది.అంటే భద్రాచలం ఇంకా పర్ణశాల చూడాలని వచ్చే భక్తులు ఆ రెండు ఊర్ల మధ్యగల ఆంధ్రా ప్రాంతాన్ని దాటి వెళ్ళాలి..." 

"చెక్ పోస్ట్ లూ అవీ వచ్చేసే ఉండాలే" 

"ఆ...అన్నీ వచ్చేశాయి. రాష్ట్రం చీలినప్పుడు బోర్డర్ లో ఉండే ప్రజల జీవితాలు మహా చికాకులవుతాయి... స్కూళ్ళ లో చేరడానికి గాని,సర్టిఫికేట్లకి గాని,జాబ్ ల విషయంలో గానీ "  

"అయిదు గ్రామపంచాయితీలు తిరిగి కలిపితే సమస్య కొంతవరకు తీరుతుందని పేపర్ లో చదివాను...ఆన్ లైన్ పేపర్ ల వల్ల అదో సదుపాయం" నవ్వుతూ అన్నాను.

"కానీ...అది ఎప్పటికి జరుగుతుందో...మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టాలట గద సార్, దానికంటే భద్రాచలాన్ని ఆంధ్రా లో కలిపితే జిల్లా అయి ఇంకా డెవలప్ అవుతుంది అని కొంతమంది అంటున్నారు" అన్నాడు జీవన్ బోగీ లోకి చూస్తూ.

"కొన్నిటికి కాలమే తీర్పు చెప్పాలి జీవన్ గారు..." అంటూండగానే రైలు కూత వినిపించింది. నేను స్టేషన్ లో కొన్న ఓ పుస్తకాన్ని జీవన్ కి బహూకరించాను. ద గ్రాండ్ మేట్రియార్క్ ఆఫ్ మలబార్ అనే నవల అది. సజిత నాయర్ అనే రచయిత్రి రాసినది. 

"థాంక్యూ వెరీ మచ్ సార్" అన్నాడు జీవన్ ఆనందంగా.

"ఆల్ ద బెస్ట్" అన్నాను చిరునవ్వుతో.

రైలు కదిలింది. జీవన్ కిటికీ లో నుంచి చెయ్యి ఊపుతున్నాడు.కాసేపటి లో ఆ రైలు అంతర్ధానమైపోయింది. మరో చోట ఎక్కడో ... ముందుకు ...మున్ముందుకు దూసుకుపోతూనే ఉంటుంది. జీవితం మాదిరిగానే..! 

--------- సమాప్తం -------------    

No comments:

Post a Comment

Your comment means everything for me. Thanks for your visit and comment.All the best.

"Gourahari Das Kathalu " ( A Review in English)

 Translation from Oriya to Telugu has not been new and going on from many decades and Puripanda Appalaswamy, an iconic translator was known ...